China Space Station: నింగిలోకి దూసుకెళ్లిన చైనా వ్యోమగాములు.. 3 నెలల పాటు అక్కడే

చైనా అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన వ్యోమగాములు (Image:China Xinhua News)

యూఎస్‌కు చైనా వ్యవహారశైలి ‌నచ్చకపోవడం, తదితర కారణాల వల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చైనాకు అనుమతి లభించలేదు. ఈ క్రమంలోనే చైనా సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోంది.

  • Share this:
అంతరిక్ష రంగంలో చైనా మరో మైలురాయిని అందుకుంది. కొత్తగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రంలోకి గురువారం ముగ్గురు వ్యోమగాములను పంపించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) తరహాలో.. చైనా కూడా సొంతంగా ఓ స్పేస్ స్టేషన్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అందులోకి కొత్తగా ముగ్గురు వ్యోమగాములను పంపించాలని చైనా నిర్ణయించింది. నీ హైసెంగ్‌, లియు బొమింగ్‌, టాంగ్‌ హోంగ్‌బో బృందం తాజాగా స్పేస్‌ స్టేషన్‌కు బయలుదేరారు. అంతకంటే ముందు చైనాలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారి అనుభూతులు, అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ ముగ్గురు వ్యోమగాములు అక్కడ మూడు నెలల పాటు ఉండనున్నారు.

అంతరిక్షంపై పట్టుపెంచుకోవడానికి చైనా నిర్మిస్తున్న స్పేస్‌ స్టేషన్‌కు వెళ్లి అక్కడి పరిస్థితులు గమనించి, అవసరమైన పనులు చేయడం ఈ వ్యోమగాముల పని. ఈ క్రమంలో వారు కొన్నిసార్లు స్పేస్‌ వాక్‌లు కూడా చేయనున్నారు. ఈ బృందానికి సీనియర్‌ వ్యోమగామి నీ హైసెంగ్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఈయనకిది మూడో అంతరిక్ష ప్రయాణం కావడం గమనార్హం. ‘తొలుత అంతరిక్షానికి చేరుకొని, అక్కడ మేముండే ప్రాంతాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ప్రయోగాలు చేస్తాం’ అని ఆయన చెప్పారు. ఈ క్రమంలో తమకు చాలా సవాళ్లు ఎదురవుతాయని, వాటన్నింటికీ సిద్ధంగా ఉన్నామని చెప్పారాయన. ఈసారి స్పేస్‌కి వెళ్తున్న వారిలో టాంగ్‌ హోంగ్‌బో తొలిసారి అంతరిక్షానికి వెళ్తున్నారు. ఆయన సుమారు పదేళ్లుగా అంతరిక్ష పర్యటన కోసం శిక్షణ పొందుతున్నారు. అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా అలవాటుపడి, శిక్షణ తీసుకున్నారు.

ఈ వ్యోమగాముల బృందం షెంజో- 12 అనే స్పేస్‌ షిప్‌ లో బయలుదేరింది. దీన్ని లాంగ్‌ మార్చ్‌ -2 ఎఫ్‌ వై 12 అనే రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి పంపించారు. చైనా కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం 9.22కి ఈ స్పేస్‌ షిప్‌.. చైనాలో గోబి ఎడారిలోని జియుక్వాన్‌ లాంచ్‌ సెంటర్‌ నుంచి బయలుదేరింది. ప్రస్తుతం పురుషులు మాత్రమే అంతరిక్షానికి వెళ్తున్నారు. త్వరలో మహిళా బృందాన్ని కూడా అంతరిక్షానికి పంపిస్తామని చైనా చెబుతోంది. అంతర్జాతీయ స్పేస్‌ స్టేషన్‌లో చైనా క్రియాశీలకంగా లేదు. యూఎస్‌కు చైనా వ్యవహారశైలి ‌నచ్చకపోవడం, తదితర కారణాల వల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చైనాకు అనుమతి లభించలేదు. దీంతో డ్రాగన్ దేశం కొత్తగా స్పేస్‌ స్టేషన్‌ నిర్మించుకోవాలని నిర్ణయించుకుంది.

భవిష్యత్తులో ఇతర దేశాల వాళ్లూ అక్కడకు రావొచ్చని చైనా అంటోంది. దాని వల్ల ఇతర దేశాలు చైనాతో కలసి సంయుక్తంగా ప్రయోగాలు నిర్వహించొచ్చనేది ఆ దేశం ఆలోచన. చైనా స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణం ఆలస్యమవుతోంది. అయితే ఇది ఒకవిధంగా మంచిదే అని చైనా భావిస్తోందట. దాని వల్ల కొత్త టెక్నాలజీతో స్పేస్‌ స్టేషన్‌ను నిర్మించుకునే అవకాశం కలుగుతోందని చైనా చైనా స్పేస్ ఏజెన్సీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జి కిమింగ్‌ చెబుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: