China: కరోనా వైరస్‌ను లీక్ చేసింది చైనానేనా.. మళ్లీ ఇప్పుడు ఈ డౌట్ రావడానికి కారణం ఏంటంటే..

ప్రెస్‌మీట్‌లో చైనా వైఖరిని వెల్లడిస్తున్న దృశ్యం

కరోనా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనాలో మరోసారి పర్యటించాలని భావిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం తీసుకున్న నిర్ణయాన్ని డ్రాగన్ దేశం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ రెండోసారి పర్యటనలో వైరస్ తొలుత బయటపడిన వుహాన్ నగరంలోని ల్యాబొరేటరీలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని డబ్ల్యూహెచ్‌వో భావించింది.

 • Share this:
  బీజింగ్: కరోనా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనాలో మరోసారి పర్యటించాలని భావిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం తీసుకున్న నిర్ణయాన్ని డ్రాగన్ దేశం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ రెండోసారి పర్యటనలో వైరస్ తొలుత బయటపడిన వుహాన్ నగరంలోని ల్యాబొరేటరీలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని డబ్ల్యూహెచ్‌వో భావించింది. కానీ.. ఈ నిర్ణయంపై చైనా తీవ్ర అభ్యంతరం తెలిపింది. డబ్ల్యూహెచ్‌వో నిర్ణయం పట్ల చైనా డిప్యూటీ హెల్త్ మినిస్టర్ జెంగ్ యిక్సిన్ విస్మయం వ్యక్తం చేశారు. మరోసారి చైనాలో పర్యటించాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదన తమను షాక్‌కు గురిచేసిందని.. చైనా ల్యాబొరేటరీ ప్రోటోకాల్స్‌ను తప్పుబట్టడమే డబ్య్లూహెచ్‌వో పనిగా పెట్టుకుందని ఆరోపించారు. ఈ ప్రతిపాదనను చైనా ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించబోదని ఆయన చెప్పారు. డబ్ల్యూహెచ్‌వో ఇకనైనా.. చైనా నిపుణుల ప్రతిపాదనలను, సలహాలను పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయంగా వైరస్ మూలాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తుందని ఆశిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే లీకయిందనే వార్తలు పూర్తి అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. వుహాన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, నేషనల్ బయోసేఫ్టీ ల్యాబొరెటరీ డైరెక్టర్ యుయాన్ జిమింగ్ మాట్లాడుతూ.. 2018లో ల్యాబ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎలాంటి వైరస్ లీక్ కాలేదన చెప్పారు. కరోనా వైరస్ అనేది సహజంగా వ్యాప్తి చెందిన ఇన్‌ఫెక్షన్ అని చెప్పుకొచ్చారు.

  ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి కారణంగా 40 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. ప్రపంచ దేశాల నుంచి వైరస్ మూలాలను కనిపెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థపై రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోంది. తదుపరి పరిశోధనలను కొనసాగించాలని.. చైనా వైఖరి అనుమానించదగ్గదిగా ఉందని పలు దేశాలు ఇప్పటికే డ్రాగన్ దేశంపై సందేహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే.. డబ్ల్యూహెచ్‌వో బృందం రెండోసారి పర్యటించేందుకు చైనా అభ్యంతరం వ్యక్తం చేయడంపై అగ్ర రాజ్యం అమెరికా తప్పుబట్టింది. చైనా పోకడ బాధ్యతారహితంగానూ, ప్రమాదకరంగానూ ఉందని పేర్కొంది. ఇక.. ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీకయిందన్న వార్తలను పూర్తిగా కొట్టిపారేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పటికే అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ల్యాబ్ నుంచి లీకయి ఉంటుందన్న ప్రచారంపై డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనమ్ గేబ్రియాసిస్ స్పందిస్తూ.. తానొక ల్యాబ్ టెక్నీషియన్‌ను అని, ఇమ్యునాలజిస్ట్‌గా.. ల్యాబ్‌లో పనిచేసిన వ్యక్తిగా చెబుతున్నానని.. ల్యాబ్‌ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయని.. ఇవి సహజమని వ్యాఖ్యానించారు.

  కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందనే ప్రశ్నకు ఇప్పటివరకూ స్పష్టమైన సమాధానం దొరకలేదు. చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే ఈ వైరస్ ప్రపంచ దేశాలకు పాకిందని పలు దేశాలు బహిరంగంగానే ఆరోపణలు చేశాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అయితే.. కరోనా వైరస్‌ను ఏకంగా ‘చైనా వైరస్’ అని మాటిమాటికి అంటుండేవారు. చైనానే కరోనా మహమ్మారిని తయారు చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తిన సందర్భంలో ప్రపంచ ఆరోగ్య సంస్థపై కూడా విమర్శలొచ్చాయి. చైనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుందనే విమర్శలను కూడా డబ్ల్యూహెచ్‌వో మూటగట్టుకుంది. ఈ క్రమంలో.. నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం కరోనా మూలాల గురించి పరిశోధించేందుకు గతేడాది చైనాలో పర్యటించింది.
  Published by:Sambasiva Reddy
  First published: