China Population Drop: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనా(China)లో పరిస్థితులు మారిపోతున్నాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం జనాభా(Population)లో చైనా ఆరింట ఒకవంతు వాటాను కలిగి ఉంది. అంటే ప్రతి ఆరుగురిలో ఒకరు చైనీయులే. ముఖ్యంగా గత నాలుగు దశాబ్దాల కాలంలో డ్రాగన్ జనాభా 66 కోట్ల నుంచి 140కోట్లకు చేరుకుంది.అలాంటి చైనాలో మునుపెన్నడూ లేని విధంగా జనాభా తగ్గుతోంది. గత నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని స్థాయిలో చైనా జనాభా తగ్గుముఖం పడుతోంది. చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం 2021లో 141.21 కోట్ల నుంచి 141.26 కోట్లకు చేరినా.. పెరిగింది కేవలం 4,80,000 మందే. పదేళ్ల కిందటి వరకు చైనా జనాభా ఏటా 80 లక్షల వరకు పెరుగుతూ ఉండేది. అయితే కొవిడ్ నిబంధనల కారణంగా పిల్లలను వద్దనుకునే దంపతుల సంఖ్య పెరగడం 2021లో జననాల తగ్గుదలకు కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. 60 ఏళ్ల కింద తీవ్ర కరువు సంభవించిన సమయం(1959-61)లో మాత్రమే చైనాలో జనాభా తగ్గింది. ఆ తర్వాత గత నాలుగు దశాబ్దాల్లో 66 కోట్ల నుంచి ఏకంగా 141 కోట్లకు చేరుకుంది. ఇప్పుడు తగ్గుముఖం పట్టడానికి వివిధ కారణాలు చెబుతున్నారు.
మరోవైపు, 2029 నాటికి తమ దేశ జనాభా 144 కోట్లకు చేరుతుందని షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ 2019లో అంచనా వేసింది. 2021 తర్వాత జనాభా క్షీణత 1.1 శాతంగా ఉంటుందని.. 2100 నాటికి అనూహ్యంగా 58.7 కోట్లకు పడిపోతుందని అభిప్రాయపడింది. సంతానోత్పత్తి రేటు సైతం 2030 నాటికి 1.1శాతానికి తగ్గుతుందన్న షాంఘై అకాడమీ 2100సంవత్సరం వరకు ఇదే తగ్గుదల కొనసాగుతుందని పేర్కొంది. చైనాలో పనిచేసేవారి సంఖ్య 2014లో గరిష్ఠస్థాయికి చేరగా 2100 నాటికి అది మూడింట ఒక వంతుకు క్షీణిస్తుందని అంచనా వేసింది. ఇదే సమయంలో 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య సైతం పెరుగుతుందని షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ పేర్కొంది. 2080 నాటికి పనిచేసే జనాభాను వృద్ధుల జనాభా అధిగమిస్తుందని లెక్కగట్టింది. ప్రస్తుతం వంద మంది పనిచేస్తూ 20 మంది వృద్ధులకు చేయూతగా నిలుస్తుండగా.. 2100నాటికి వంద మంది పనిచేస్తే 120 మంది వారిపై ఆధారపడే పరిస్థితులు వస్తాయని పేర్కొంది. ఫలితంగా కార్మిక శక్తి తగ్గి కార్మికుల వ్యయం పెరుగుతుందని షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ విశ్లేషించింది. కార్మికుల సంఖ్య తగ్గిపోతే.. కార్మిక వ్యయం బాగా పెరిగిపోతుంది. అప్పుడు ఉత్పాదక యూనిట్లు.. కార్మిక వ్యయం చౌకగా ఉండే భారత్, వియత్నాం, బంగ్లాదేశ్ తదితర దేశాలకు వెళ్లిపోతాయి. అదీగాక పెరిగిపోతున్న వృద్ధుల జనాభా అవసరాలకు అనుగుణంగా.. తన ఉత్పాదక వనరుల్లో అత్యధిక భాగాన్ని వారి ఆరోగ్యం, వైద్యం, సంరక్షణ సేవలకు వెచ్చించాల్సి ఉంటుంది.
ALSO READ Joe Biden : జిన్ పింగ్ బైడెన్ తో అలా అన్నారంట..ఏమన్నాడో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే
2016కు ముందు వరకు ఒక్కరు ముద్దు లేదా అసలే వద్దు అని చెప్పిన చైనా.. 2016లో వన్‌చైల్డ్ పాలసీని రద్దు చేసింది. ఒకే బిడ్డ విధానాన్ని ఎత్తివేసి.. ముగ్గురేసి పిల్లలను కనాలన్న విధానం తెచ్చినప్పటికీ సంతానోత్పత్తి పెరగలేదు. గతేడాది ఏకంగా పిల్లలను కనేవారికి పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలు సైతం ప్రకటించింది. అయినప్పటికీ పిల్లలను కనేందుకు చైనీయులు ముందుకు రావటం లేదు. దీనికి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. చిన్న కుటుంబాల వైపు మొగ్గుచూపటం, జీవన వ్యయం పెరగడం, వివాహ వయస్సు పెంపుతో పాటుగా పిల్లలను కనాలనే కోరిక ప్రజల్లో తగ్గడం కూడా జననాల రేటు తగ్గడానికి కారణంగా చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, Population