China- Taliban: చైనా కొత్త స్కెచ్.. తాలిబన్లతో స్నేహం.. ఎందుకో తెలుసా.?

చైనా అధికారులతో తాలిబన్లు

తాలిబన్‌ ప్రతినిధులు చైనా వెళ్లి అక్కడి విదేశాంగ శాఖ బృందంతో సమావేశమవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చైనా - తాలిబన్‌ బృందాల మధ్య ఈ నెల 28న సమావేశం జరిగినట్లు తెలుస్తోంది.

  • Share this:
ఆసియా ఖండంలోని రెండు ప్రధాన శక్తుల మధ్య కొత్త స్నేహం కుదిరిందని చెబుతున్నాయి అంతర్జాతీయ మీడియా వర్గాలు. ఈ స్నేహం ఎవరికెంత మేలు చేస్తుందనే విషయం పక్కనపెడితే... మొత్తం ప్రపంచంలో అలజడి రేపుతుంది అని మాత్రం చెప్పొచ్చు. అదే చైనా - ఆఫ్గానిస్థాన్‌ స్నేహం. వచ్చేనెల 31 నాటికల్లా ఆఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా సైన్యం పూర్తిగా వైదొలగనుంది. ఆ తర్వాత ఏమవుతుందో అనే ఆలోచన ఓవైపు ఉండగానే.. తాలిబన్‌ ప్రతినిధులు చైనా వెళ్లి అక్కడి విదేశాంగ శాఖ బృందంతో సమావేశమవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చైనా - తాలిబన్‌ బృందాల మధ్య ఈ నెల 28న సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి చైనా విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో కనిపించింది. అందులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి, తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్‌ ఘని బార్దార్‌ తదితరులు ఉన్నారు.

ఆ ఫొటోతోపాటు రెండు బృందాలు కలసి దిగిన మరో ఫొటోను కూడా షేర్‌ చేశారు. అందులో చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి వు జియాన్‌గావ్‌తో బార్దార్‌ బృందం సమావేశమైందని, అందులో కీలక విషయాలపై చర్చలు జరిపారని రాసి ఉంది. దాంతోపాటు ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకెళ్లేలా ఆలోచనలు కూడా చేసినట్లు రాసుకొచ్చారు. ఇదంతా చూస్తుంటే తాలిబన్లతో స్నేహం చేయడానికి చైనా ఆసక్తికరంగా ఉందని తెలుస్తోంది.

మరోవైపు ఆఫ్గానిస్థాన్‌ మీద తిరిగి పట్టు సాధించేందుకు తాలిబన్లు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆఫ్గానిస్థాన్‌లో దాడులు, ప్రతిదాడులు చేస్తూ సగం దేశాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆఫ్గానిస్థాన్‌ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య శాంతి చర్చలు సాగుతూనే ఉన్నాయి. దీని కోసం ఆఫ్గానిస్థాన్‌ బృందం అంతర్జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టుకుంటోంది. అదే స్థాయిలో తాలిబన్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

తాలిబన్లు ఇప్పటికే రష్‌యా, ఇరాన్‌ వెళ్లి అక్కడి ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఇప్పుడు చైనా ప్రతినిధులతో తాలిబన్లు కలవడంతో... ఆఫ్గానిస్థాన్‌ ప్రభుత్వానికి తాలిబన్లు గట్టి సపోర్టు పొందారు అనిపిస్తోంది. అయితే ఆఫ్గానిస్థాన్‌ అభివృద్ధిలో తాము కీలక పాత్ర పోషిస్తామని చైనా ఎప్పటి నుంచో చెబుతోంది. చైనా ఇలా అనడం వెనుక వేరే కారణం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆఫ్గానిస్థాన్‌తో వ్యాపార భాగస్వామ్యం కుదుర్చుకుంటే తమకు అన్నివిధాలా మేలు జరుగుతుందనే చైనా ఆలోచిస్తోందట.

ఆఫ్గానిస్థాన్‌ నేలల్లో మూడు ట్రిలియన్‌ డాలర్ల విలువైన మినరల్స్‌ ఉన్నాయని 2014లో యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. 60 మిలియన్ల కాపర్‌, 2.2 బిలియన్‌ టన్నుల ఐరన్‌ వోర్‌, 1.4 మిలియన్‌ టన్నుల ముఖ్యమైన మూలకాలు ఉన్నాయని ఆ సర్వేలో తేలింది. వీటి కోసమే తాలిబన్లతో చైనా స్నేహం చేస్తోందట. దీంతోపాటు చైనా ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న బెల్ట్‌ అండ్‌ రోడ్ ఇనీసియేటివ్‌ (బీఆర్‌ఐ) పూర్తి చేయడమూ ఓ కారణం. దీనికి ఆఫ్గానిస్థాన్‌ అవసరం ఉందని చైనా భావిస్తోందట.
Published by:Shiva Kumar Addula
First published: