China Hits Back Biden Over Taiwan: తైవాన్ ఆక్రమణకు చైనా ప్రయత్నిస్తే.. తైవాన్(Taiwan)దేశానికి తాము అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden)భరోసా ఇచ్చారు. తైవాన్‌కు మద్దతుగా సైనికపరంగా అమెరికా జోక్యం చేసుకుంటుందని ప్రకటించారు. వన్ చైనా పాలసీకి అమెరికా కట్టుబడి ఉందన్న బైడెన్.. అలాగని తైవాన్‌ను బలవంతంగా విలీనం చేసుకోవాలని చూస్తే సైనికపరంగా జోక్యం చేసుకుంటామని హెచ్చరించారు. అంతేగాక ప్రమాదంతో ఆటలాడుతోందని చైనాను హెచ్చరించారు. జపాన్ పర్యటనలో ఉన్న జో బైడెన్ టోక్యోలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ..ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య తర్వాత స్వయంపాలిత ద్వీపమైన తైవాన్ భద్రతకు మరింత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. తైవాన్‌కు వ్యతిరేకంగా చైనా(China)బలగాలను ఉపయోగించే ప్రయత్నం మంచిది కాదన్నారు. చైనా అలాంటి చర్యలకు దిగితే ఆ ప్రాంతంలో అస్థిరత తలెత్తుతుందని అన్నారు. ఉక్రెయిన్ తరహా చర్య అవుతుందని అభిప్రాయపడ్డారు.
తైవాన్ మొదటి నుంచి అమెరికాకు సన్నిహితంగా మెలుగుతోంది. అమెరికా సైతం తైవాన్‌కు భారీగా ఆయుధాలను సరఫరా చేస్తోంది. అయినప్పటికీ చైనా దండెత్తితే సైనికపరమైన జోక్యం చేసుకుంటామని అమెరికా ప్రకటించడం ఇదే తొలిసారి. తైవాన్‌ను తమ భూభాగంగా పరిగణిస్తోన్న చైనా.. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇటీవల ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తైవాన్ సమీపంలోకి యుద్ధనౌకలు, యుద్ధవిమానాలను పంపుతూ చైనా భయాందోళనలు కలిగిస్తోంది. ఈ క్రమంలో తైవాన్‌పై చైనా దాడి చేస్తే అమెరికా సాయం చేస్తుందా అనే ప్రశ్నపై బైడెన్ ఈ విధంగా సమాధానమిచ్చారు.
ALSO READ Imran Khan : ప్రభుత్వమంటే అలా ఉండాలి..భారత్ పై మరోసారి ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు
చైనా దాడి చేస్తే తైవాన్‌కు తాము రక్షణగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలపై చైనా ధీటుగా స్పందించింది. చైనాను ఎవరూ తక్కువగా అంచనా వేయొద్దంటూ ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి అమెరికాకు కౌంటర్ ఇచ్చారు. తైవాన్ విషయంలో బైడెన్‌చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తైవాన్ వ్యవహారం చైనా సార్వభౌమాధికారం, అంతర్గత సమగ్రతకు సంబంధించినదని మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంలో చైనా రాజీపడే అవకాశమే లేదని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా క్వాడ్ కూటమిలోని జపాన్, భారత్, ఆస్ట్రేలియా నాయకులతో బైడెన్ మంగళవారం భేటీ కానున్నారు. ఇక చైనా తైవాన్‌పై దాడి చేసే అవకాశాలున్న నేపథ్యంలో తమ సైనిక సంబంధాలను బలోపేతం చేయడంపై బైడెన్‌తో చర్చించినున్నట్టు జపాన్ ప్రధాని కిషిడా వ్యాఖ్యానించారు. బలమైన జపాన్.. అమెరికా-జపాన్ శక్తివంతమైన కూటమి ఈ ప్రాంతానికి చాలా కీలమైందని ఆయన తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.