Home /News /international /

CHINA COULD HAVE 1000 NUCLEAR WARHEADS BY 2030 ACCORDING TO A LATEST PENTAGON REPORT PRV GH

China Warheads: పెంటగాన్ సంచలన నివేదిక.. 2030 నాటికి చైనా వద్ద 1,000 అణు వార్‌హెడ్‌లు ఉండనున్నట్లు వెల్లడి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చైనా తన భూమి, సముద్రం, వాయు ఆధారిత అణు డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల సంఖ్యలో పెట్టుబడులు పెడుతోందని పెంటగాన్ వెల్లడించింది. ఇది తన అమ్ములపొదిలో అధికంగా అణ్వస్త్రాలను చేర్చుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా నిర్మిస్తోందని పెంటగాన్ నివేదించింది.

ఇంకా చదవండి ...
మానవాళికి ప్రాణాంతకమైన ఆయుధ సంపత్తి పెంచుకోవడంలో చైనా (china) దేశం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇది 21వ శతాబ్దం మధ్య నాటికి అమెరికా (America)ని మించిన ప్రపంచ శక్తి (world power)గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగినట్టుగా తన అణ్వాయుధాలను పెంచుకోడానికి కృషి చేస్తోంది. చైనా 2027 నాటికి 700 డెలివరీ చేయగల న్యూక్లియర్ వార్‌హెడ్‌ (Nuclear Warheads)లను కలిగి ఉండొచ్చని పెంటగాన్ తాజా నివేదికలో హెచ్చరించింది. మరో మూడేళ్లలో అనగా 2030 నాటికి చైనా వార్‌హెడ్‌ల సంఖ్య 1,000కి పెరగొచ్చని పెంటగాన్ (Pentagon) పేర్కొంది. అణుక్షిపణిలో పేలుడు రసాయనాలు (explosible chemicals) లేదా మంట పుట్టించే శక్తిగల భాగాలనే వార్‌హెడ్‌లు అంటారు. వీటితో వేల కిలోమీటర్ల మేర విధ్వంసం సృష్టించొచ్చు. ఇలాంటి ప్రమాదకరమైన అస్త్రముఖాలను (warheads) చైనా పెద్ద ఎత్తున తయారు చేస్తుండటం ప్రపంచానికి పెను సంకేతంగా శంకిస్తోంది.

మౌలిక సదుపాయాలను కూడా నిర్మిస్తోందని..

చైనా తన భూమి, సముద్రం, వాయు ఆధారిత అణు డెలివరీ ప్లాట్‌ఫామ్‌ (Nuclear delivery platform)ల సంఖ్యలో పెట్టుబడులు పెడుతోందని నివేదిక వెల్లడించింది. ఇది తన అమ్ములపొదిలో అధికంగా అణ్వస్త్రాల (Nuclear weapons)ను చేర్చుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా నిర్మిస్తోందని పెంటగాన్ నివేదించింది. తైవాన్‌తో సహా అనేక సమస్యలపై వాషింగ్టన్ (Washington), బీజింగ్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత సమయంలో ఈ నివేదిక సంచలన విషయాలు బయట పెట్టడం గమనార్హం.

దశాబ్దంలో 400 అణు వార్‌హెడ్‌లను ఎక్కువ..

పెంటగాన్ గతేడాది నివేదికలో బీజింగ్ (Beijing) ఒక దశాబ్దంలో 400 అణు వార్‌హెడ్‌లను ఎక్కువ కలిగి ఉంటుందని అంచనా వేసింది. కానీ ఇప్పుడు చైనా ఈ దశాబ్దం చివరి నాటికి రెట్టింపు స్థాయిలో వార్‌హెడ్‌లను తయారు చేయడానికి రెడీ అయింది. ప్లూటోనియం ఉత్పత్తి చేసి, వేరు చేయగల సామర్థ్యాన్ని పెంచడానికి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్‌లు, రీప్రాసెసింగ్ సౌకర్యాలను ప్రస్తుతం చైనా నిర్మిస్తోందని నివేదిక పేర్కొంది. తైవాన్, భారతదేశం పట్ల బీజింగ్‌ దూకుడుతనం గురించి నివేదిక ఆందోళనలను లేవనెత్తింది. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ వియత్నాం వంటి దేశాలపై చైనా కఠిన చర్యలను కూడా ఇది ప్రస్తావించింది.

అమెరికా సైనిక శక్తికి సమవుజ్జీగా..

2049 నాటికి అమెరికా సైనిక శక్తికి సమవుజ్జీగా మారడం లేదా దాన్ని తలదన్నే ఆధిపత్య శక్తిగా ఎదగడం కోసం చైనా మోడ్రనైజషన్ (modernization), అణుశక్తి విస్తరణ వైపు అడుగులు వేస్తోందని.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆధిపత్య శక్తిగా అవతరించడమే దాని లక్ష్యమని నివేదిక తెలిపింది. అణు సామర్థ్యం గల వాయు-ప్రయోగ బాలిస్టిక్ క్షిపణి (ALBM) అభివృద్ధి.. దాని భూమి, సముద్ర ఆధారిత అణు సామర్థ్యాలను మెరుగుపరచడం ద్వారా చైనా ఇప్పటికే న్యూక్లియర్ ట్రయాడ్ ని స్థాపించి ఉండొచ్చని అంచనావేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకుని ప్రపంచ ఆవిష్కరణల్లో సూపర్‌పవర్‌గా అవతరించేందుకు చైనా తన పనులను మరింత వేగవంతం చేసినట్లు పెంటగాన్ తెలిపింది. తద్వారా వరల్డ్ క్లాస్ మిలిటరీగా ఎదిగే లక్ష్యాలను చైనా దృఢపరచుకుంటున్నట్లు పెంటగాన్ వివరించింది.

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆగ్రహం..

నివేదిక ప్రకారం, కోవిడ్-19 సమయంలోనూ బీజింగ్ (Beijing) తన ఆర్థిక వృద్ధిని స్థిరీకరించడం, సాయుధ బలగాలను బలోపేతం చేయడం, ప్రపంచ వ్యవహారాల్లో మరింత దృఢమైన పాత్రను పోషించడం వంటి మొత్తం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి తన ప్రయత్నాలను కొనసాగించింది. ఈ క్రమంలో ఈ నివేదికపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మండిపడ్డారు.

"చైనా అణు ముప్పు" సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి యూఎస్ ఈ నివేదికను ఉపయోగిస్తోంది. ప్రజాభిప్రాయాన్ని మార్చే ప్రయత్నంలో ఈ ట్రిక్ ని యూఎస్ ప్రయత్నిస్తున్నట్లు అంతర్జాతీయ సమాజం చాలా కాలంగా చూస్తోందని వాంగ్ అన్నారు. చైనా దేశం నుంచి ఎలాంటి అణు ముప్పు లేదని నిజానికి అణుముప్పుకు అమెరికానే ప్రధాన మూలమని చైనా ప్రతినిధి పేర్కొన్నారు. 2021 ప్రారంభం నాటికి, ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతన అణు ఆయుధాగారాన్ని కలిగి ఉన్న యూఎస్ వాస్తవానికి 5,550 అణు వార్‌హెడ్‌లను కలిగి ఉందని అతను పేర్కొన్నారు. తమ దేశం నుంచి ఏ దేశానికి అణుముప్పు ఉండదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: India-China

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు