Honey in Space: అంతరిక్షంలో తేనె డబ్బా మూత తీసిన వ్యోమగామి.. తర్వాత ఏమైందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

(Image- Youtube/Canadian Space Agency)

అంతరిక్షంలోకి వెళ్ళిన వ్యోమగాములు రకరకాల వస్తువులు గాల్లో ఎలా తేలుతున్నాయో వీడియోల ద్వారా చూపిస్తుంటారు. ఆ వీడియోలు మనల్ని ఎంతో అబ్బురపరుస్తాయి

  • Share this:
అంతరిక్షంలోకి వెళ్ళిన వ్యోమగాములు రకరకాల వస్తువులు గాల్లో ఎలా తేలుతున్నాయో వీడియోల ద్వారా చూపిస్తుంటారు. ఆ వీడియోలు మనల్ని ఎంతో అబ్బురపరుస్తాయి. అయితే మనల్ని మరింత అబ్బురపరచడానికి మరొక వీడియో నెట్టింట ప్రత్యక్షమయ్యింది. ఆ వీడియోలో భారరహిత (జీరో-గ్రావిటీ) వాతావరణంలో తేనె డబ్బా మూత తీయడం చూడొచ్చు. తరువాత ఆ తేనే విచిత్రంగా తేలియాడటం వీక్షించవచ్చు. ఈ అద్భుతమైన వీడియోని కెనడియన్ స్పేస్ ఏజెన్సీ(CSA)కి చెందిన డేవిడ్ సెయింట్-జాక్వెస్ అనే ఒక వ్యోమగామి షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

నీరు జీరో గ్రావిటీలో ఎలా ప్రవర్తిస్తుందో మనం చాలాసార్లు చూసే ఉంటాం. యూట్యూబ్ లో "వాటర్ ఇన్ స్పేస్ జీరో గ్రావిటీ" అని సెర్చ్ చేస్తే మనకు ఎన్నో అద్భుతమైన వీడియోలు కనిపిస్తాయి. ఇప్పటివరకూ వ్యోమగాములు నీటిని తప్ప ఇతర ద్రవ పదార్థాన్ని జీరో గ్రావిటీ వాతావరణంలో చూపించలేదు. కానీ డేవిడ్ సెయింట్-జాక్వెస్ మాత్రం అంతరిక్షంలో తేనె ఎలా ప్రవర్తిస్తుందో చూపించే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

వైరల్ అయిన వీడియోలో.. డేవిడ్ ఒక తేనె డబ్బాను అంతరిక్షంలో అడ్డంగా పెట్టారు. తర్వాత మెల్లిగా తేనె డబ్బా మూతను తీశారు. అయితే తేనె బాగా కాల్చిన ప్లాస్టిక్ లాగా సాగటం మొదలుపెట్టింది. నీటిలాగా గుండ్రటి గోళాలు ఏర్పడతాయని అందరూ భావించారు. కానీ తేనె మాత్రం చాలా విచిత్రంగా ప్రవర్తించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తర్వాత డేవిడ్ తేనె డబ్బా మూతను గుండ్రంగా తిప్పాడు. అయినప్పటికీ.. సాగిన తేనె తెగి పోలేదు. ఆయన ఇంకోసారి గుండ్రంగా మూతను తిప్పడంతో.. తేనె ఒక తాడు లాగా ముడతలు పడింది. ఈ దృశ్యాలు చూస్తున్నంతసేపు ఒక మంత్రజాలం చూసినట్లే అనిపించింది. కాసేపు ఆ తేనె డబ్బా అంతరిక్షంలో తేలియాడింది. ఆ తర్వాత డేవిడ్ తేనె డబ్బాకు మూత పెట్టి పక్కన పెట్టారు.



ఈ వీడియోని రెండేళ్ల క్రితం యూట్యూబ్ లో షేర్ చేశారు. అయితే తాజాగా ఓ టిక్ టాక్ యూజర్ దీన్ని షేర్ చేశాడు. అనంతరం అది క్షణాల్లోనే వైరల్ గా మారింది. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోని చూసి ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. "నేనే అంతరిక్షంలో ఉంటేనా.. రోజంతా తేనెతో ఆడుకుంటూ కూర్చుంటా. ఏ పని కూడా చేయను" అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. అంతరిక్షంలోకి వెళ్ళిన మీరు ఏదో చేస్తారనుకుంటే.. తేనెతో ఆడుకుంటున్నారా? అని మరొక నెటిజన్ సరదాగా కామెంట్ చేశాడు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.
Published by:Sumanth Kanukula
First published: