Plant Based Corona Vaccine : రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు అనేక వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే కొత్త కొత్త వేరియంట్ల రూపంలో కోవిడ్ విరుచుకుపడుతూనే ఉన్న నేపథ్యంలో మరిన్ని రకాల వ్యాక్సిన్ల కోసం ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ల సరఫరాను పెంచాలనే ఉద్దేశంతో మరిన్ని పరిశోధనలను చేస్తున్నారు. ఈ క్రమంలో మొక్క ఆధారంగా తయారుచేసిన కోవిడ్ వ్యాక్సిన్ కు కెనడా ఆమోదం తెలిపింది. కెనడాకు చెందిన బయోటెక్నాలజీ కంపెనీ మెడికాగో ఇంక్ మరియు యూకేకు చెందిన గ్లాక్సో స్మిత్‌క్లైన్ పిఎల్‌సి కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి మొక్క ఆధారిత కోవిడ్-19 వ్యాక్సిన్ "కోవిఫెంజ్" వినియోగానికి కెనడా గురువారం ఆమోదం తెలిపింది.
మెడికాగో అనే మొక్క ఆధారితగా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ను 18 నుంచి 64 ఏళ్ల పెద్దలకు ఇవ్వవచ్చని కెనడియన్ అధికారులు తెలిపారు. అయితే 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇవ్వవచ్చా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. 24 వేల మంది పెద్దవాళ్లపై చేసిన పరిశోధనల ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కోవిడ్ -19 నిరోధించడంలో ఈ టీకా 71శాతం ప్రభావంతంగా ఉందని తెలిపారు. మెడికాగో అనే మొక్క వైరస్ లాంటి కణాలను పెంచడంలో సజీవ కర్మాగారాలుగా పనిచేస్తుంది. ఇది కరోనా వైరస్ ను కప్పి ఉంచే స్పైక్ ప్రోటీన్‌ను అనుకరిస్తుంది. మొక్కల ఆకుల నుండి కణాలు తొలగించి శుద్ధి చేస్తారు. ఇది బ్రిటీష్ భాగస్వామి గ్లాక్సో స్మిత్‌క్లైన్ తయారు చేసిన అడ్జువాంట్‌గా పిలిచే రోగనిరోధక శక్తిని పెంచే మరొక వ్యాక్సిన్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.