రూల్స్ కు ఎవరూ అతీతులు కాదనడానికి ఈ ఘటన నిదర్శనం. సామాన్యులైన, నాయకులైన, దేశ ప్రధాని అయినా సరే నిబంధనలు పాటించాల్సిందే. లేదంటే కొన్ని కొన్ని సార్లు వార్తల్లో నిలుస్తుంటారు. ఇక బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ఎంత ముఖ్యమో కారు నడిపేటప్పుడు సీటు బెల్ట్ అంతే ముఖ్యం. ఇది పాటించకుండా డ్రైవ్ చేస్తూ అనేక మంది రోజూ ఫైన్ ల బాదుడుకు గురవుతుంటారు. ఇక బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) దీనికి అతీతం కాదు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సీటు బెల్ట్ పెట్టుకోకుండా కారు నడపడం అది కాస్త వైరల్ అయింది. దీనితో ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. తప్పు చేసింది ఎవరైనా ఫైన్ కట్టాల్సిందే అని తీర్మానించారు. దీనితో ప్రధాని రిషికి (Rishi Sunak) 100 పౌండ్లు (10 వేలు) జరిమానాను లాంక్ షైర్ పోలీసులు విధించారు.
రిషి సునాక్ (Rishi Sunak) సీటు బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేయడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించారు. ప్రధాని ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో రిషి సునాక్ క్షమాపణలు కూడా చెప్పారు. ఇక దీనిపై సునాక్ (Rishi Sunak) ప్రతినిధి మాట్లాడుతూ..ఇది సంక్షిప్త లోపం. చిన్న క్లిప్ ను చిత్రీకరించడానికి ప్రధాని సీటు బెల్ట్ ను తీసేశారు. ఇది పొరపాటు అని అంగీకరించారు. దేశ వ్యాప్తంగా 100 ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి తన ప్రభుత్వం యొక్క కొత్త లెవెలింగ్ ఆఫ్ ప్రకటనను ప్రమోట్ చేయడానికి కదులుతున్న కారులో కూర్చున్నప్పుడు సునాక్ (Rishi Sunak) వీడియోను చిత్రీకరించినట్టు తెలుస్తుంది.
బ్రిటన్ చట్టాల ప్రకారం కారులో ప్రయానిస్తున్న సమయంలో ప్రతీ ఒక్కరు కూడా సీటు బెల్ట్ వేసుకోవాల్సిందే. అత్యవసర వైద్యం పొందే వారు తప్ప అందరూ తప్పనిసరిగా సీటు బెల్ట్ పెట్టుకోవాలి. కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోకుంటే బ్రిటన్ రూల్స్ ప్రకారం 100 పౌండ్లు చెల్లించాలి. ఒకవేళ కోర్టుకు వెళితే మాత్రం 500 పౌండ్ల జరిమానా కట్టాలి.
బ్రిటన్ లో ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో ప్రధానిగా రిషి సునాక్ (Rishi Sunak) బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి బ్రిటన్ లో తనదైన మార్క్ చూపిస్తున్నాడు. భారత సంతతికి చెందిన రిషి బ్రిటన్ ప్రధాని కావడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Britan, Fine, Police, Rishi Sunak