హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Queen Elizabeth II: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II కన్నుమూత..రాజకుటుంబం, కామన్‌వెల్త్ దేశాల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది?

Queen Elizabeth II: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II కన్నుమూత..రాజకుటుంబం, కామన్‌వెల్త్ దేశాల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది?

బ్రిటన్ క్వీన్ ఎలిజబెట్ 2(ఫైల్ ఫొటో)

బ్రిటన్ క్వీన్ ఎలిజబెట్ 2(ఫైల్ ఫొటో)

క్వీన్ మరణం బ్రిటన్, కామన్వెల్త్ దేశాల్లో భారీ సాంస్కృతిక, సామాజిక, రాజకీయ మార్పుకు కారణమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగనుందో తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Queen Elizabeth II Death :  బ్రిటన్( Britain)రాణి క్వీన్ ఎలిజబెత్ II( Queen Elizabeth II)కన్నుమూశారు. 96 సంవత్సరాల వయసులో ఆమె మరణించినట్లు గురువారం సాయంత్రం 6:30 గంటలకు బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటన విడుదల చేసింది. రాణి ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను బాల్మోరల్‌ ఎస్టేట్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అయితే గురువారం మధ్యాహ్నమే ఆమె కన్నుమూసినట్లు బకింగ్ హామ్ ప్యాలెస్ వెల్లడించింది. 1952లో ఆమె సింహాసనాన్ని అధిష్టించారు. అప్పటి నుంచి ఏకంగా 15 మంది UK ప్రధాన మంత్రులు ఆమె హయాంలో ప్రమాణం చేశారు. 2022 ఫిబ్రవరిలో రాణి 70 సంవత్సరాల సేవకు గుర్తుగా ప్లాటినం జూబ్లీ జరుపుకున్నారు. ఈ ఘనత సాధించిన మొదటి బ్రిటిష్ చక్రవర్తిగా నిలిచారు. క్వీన్ మరణం బ్రిటన్, కామన్వెల్త్ దేశాల్లో భారీ సాంస్కృతిక, సామాజిక, రాజకీయ మార్పుకు కారణమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగనుందో తెలుసుకుందాం.

 ఆపరేషన్ లండన్ బ్రిడ్జ్

బ్రిటన్ చక్రవర్తి మరణాంతరం ఎదుర్కొనే పరిస్థితులకు ఒక కోడ్ నేమ్ కేటాయిస్తారు. ఎలిజబెత్ తండ్రి కింగ్ జార్జ్ VI మరణం తర్వాత ఈ ప్రక్రియకు ‘హైడ్ పార్క్ కార్నర్’ అనే కోడ్ నేమ్ ఇచ్చారు. తాజాగా రాణి మరణం తర్వాత చేయాల్సిన పనులు, చక్రవర్తి ఎంపిక, ఇతర ఈవెంట్స్‌ను నిర్వహించే ప్రక్రియకు కోడ్ నేమ్‌ను ‘ఆపరేషన్ లండన్‌ బ్రిడ్జ్’ అంటున్నారు. రాణి మరణానంతర పరిస్థితులు, వారసుల ఎంపిక కోసం కొంతకాలంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బకింగ్‌హామ్ ప్యాలెస్ లోపల జరిగే ఈ ప్రణాళికలను ‘ఆపరేషన్ లండన్ బ్రిడ్జ్’గా పేర్కొన్నారు. క్వీన్స్ అంత్యక్రియలు, కొత్త చక్రవర్తి సింహాసనానికి దారితీసే అన్ని ఈవెంట్స్ ఇందులో ఉంటాయి. రాణి మరణాన్ని తెలియజేస్తూ ‘లండన్ బ్రిడ్జ్ ఈజ్ డౌన్’ అని కోడ్ లాంగ్వేజ్‌లో వెల్లడించారు.

రాణి అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహిస్తారు?

క్వీన్ ఎలిజబెత్ II పార్థివ దేహానికి ప్రజలు నివాళులు అర్పించే అవకాశం కల్పిస్తారు. క్వీన్ భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు వెస్ట్‌మిన్‌స్టర్ హాల్‌కు తరలిస్తారు. ప్రోటోకాల్ ప్రకారం, రాణి అంత్యక్రియలు ఆమె మరణించిన 10 రోజుల తర్వాత జరుగుతాయి. ఈ 10 రోజుల జాతీయ సంతాప దినాలు ఉంటాయి. రాణి ఎలిజబెత్ II అంత్యక్రియలకు ముందు ప్రిన్స్ చార్లెస్ దేశవ్యాప్తంగా పర్యటిస్తారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత స్కాటిష్ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తిచేస్తారు. విండ్సర్ కాజిల్‌లోని క్వీన్ సెయింట్ జార్జ్ చాపెల్‌లో ఆమె తల్లిదండ్రులు, కింగ్ జార్జ్ VI, క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు జరిగాయి. ఎలిజబెల్ 2 అంత్యక్రియలు కూడా అక్కడే జరిగే అవకాశం ఉంది.

 తదుపరి రాజు చార్లెస్

బ్రిటన్ తదుపరి చక్రవర్తిగా ప్రిన్స్ చార్లెస్ (73) తక్షణమే రాజు అవుతారు. ప్రోటోకాల్ ప్రకారం క్వీన్ పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్‌ కింగ్‌ అయ్యారు. అయితే పట్టాభిషేకానికి చాలా సమయం పడుతుంది. ఇందుకు సుదీర్ఘమైన ప్రక్రియ ఉంటుంది. సాధారణంగా బ్రిటన్ రాజు లేదా రాణి కన్నుమూసిన తర్వాత 24 గంటల్లో వారసులను ప్రకటించాలనే నిబంధన ఉంది. దీనికి కూడా నిర్ణీత ప్రక్రియ ఉంటుంది. ప్రిన్స్ చార్లెస్ ఇప్పుడు కింగ్ చార్లెస్ III గా గుర్తింపు పొందుతారు. అయితే రాజకుటుంబం గౌరవించాల్సిన సంప్రదాయాలు కొన్ని ఉన్నప్పటికీ, సింహాసనాన్ని అధిష్టించే రాజ కుటుంబీకులు తమకు నచ్చిన పేరును ఎంచుకోవచ్చు. రాణి మరణం గురించి ప్రిన్ చార్లెస్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తన తల్లి, హర్ మెజెస్టి ది క్వీన్ మరణం తనతో పాటు కుటుంబ సభ్యులందరికీ విచారాన్ని మిగిల్చిందని చెప్పారు. ఈ సందర్భంగా సంతాపం తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.

Kohinoor Diamond : కన్నుమూసిన క్వీన్ ఎలిజబెత్..ఇప్పుడు కోహినూర్‌ వజ్రం పొదిగిన కిరీటం ఎవరికి దక్కుతుందో తెలుసా?

రాణి చనిపోయిన తర్వాత ఇంకేం జరుగుతుంది?

రాణి మరణానికి సంతాపంగా బ్రిటన్ జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేశారు. ఇందుకు సంతాపంగా అన్ని చర్చిల్లో గంటలు మోగించారు. ముఖ్యంగా రాజకుటుంబాల సభ్యులు మరణిస్తే వెస్ట్‌మిన్‌స్టర్ చర్చి గంటను మోగించే సంప్రదాయం ఉంది. తాజాగా ఆ చర్చి గంటను కూడా మోగించారు. అంత్యక్రియల రోజున లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ను మూసివేస్తారు. ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఈవెంట్‌ను కవర్ చేయడానికి BBC అన్ని కార్యక్రమాలను సస్పెండ్ చేస్తుంది. 1952లో కింగ్ జార్జ్ VI మరణించినప్పుడు ఈ సంస్థ నిర్దిష్ట కాలానికి అన్ని కామెడీ ప్రోగ్రామ్స్‌ను నిలిపివేసింది. అప్పట్లో కెనడాలోని CBC కూడా రెండు రోజుల పాటు సాధారణ కార్యక్రమాలను నిలిపివేసింది. రాణి అంత్యక్రియల రోజు UK వ్యాప్తంగా చట్టబద్ధమైన సెలవు ప్రకటిస్తారు. కామన్వెల్త్ రాజ్యాలలో మాత్రం, అక్కడి ప్రభుత్వాల నిర్ణయం ప్రకారం సెలవును ప్రకటిస్తారు. కొత్త కరెన్సీ ముద్రణ వెంటనే ప్రారంభమవుతుంది. పోలీసుల హెల్మెట్‌లపై కొత్త చిహ్నాలను (insignia) ఏర్పాటు చేస్తారు. పాస్‌పోర్ట్‌లు, సైనిక చిహ్నాలను కూడా అప్‌డేట్ చేస్తారు.

కామన్వెల్త్ దేశాల్లో ఏం జరుగుతుంది?

కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జమైకాతో పాటు కామన్వెల్త్‌లో సభ్యులుగా ఉన్న అన్ని దేశాలకు రాణి అధిపతి. అయితే కాబోయే రాజు ఆటోమెటిక్‌గా అదే పోస్ట్‌ను పొందుతారని చెప్పలేం. కామన్వెల్త్ ప్రభుత్వాధినేతలు ఆ పదవికి సమిష్టిగా రాణి వారసులను ఎంపిక చేస్తారు. రాణి మరణం బ్రిటన్‌కు మాత్రమే సంబంధించినది కాదు. వివిధ దేశాల రాయబార కార్యాలయాల నుంచి బ్రిటన్ పాలించిన దేశాలు, కామన్వెల్త్ దేశాలు విధేయత ప్రకటిస్తాయి. అయితే సంతాప దినాలు ముగిసిన తర్వాత ప్రస్తుత కామన్వెల్త్ ఉనికిని కోల్పోయే అవకాశం ఉంది. ఆఫ్రికా, ఆసియా, అమెరికా, యూరప్, పసిఫిక్‌ రీజియన్స్‌లోని యాభై నాలుగు దేశాలు కామన్వెల్త్‌లో భాగంగా ఉన్నాయి. ఈ దేశాలకు క్వీన్‌తో బలమైన సంబంధం ఉన్నట్లు చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆమె మరణించారు కాబట్టి, కొన్ని దేశాలు సొంతంగా దేశాధినేతను ఎన్నుకొని రిపబ్లిక్‌గా మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Britain, Queen Elizabeth II, Royal, Uk

ఉత్తమ కథలు