Space Race: బెజోస్ కంటేముందే అంతరిక్షానికి వెళ్లనున్న బిలీనియర్.. తెలుగమ్మాయి కూడా..

రిచర్డ్​ బ్రాన్​సన్ (FILE PHOTO: REUTERS/Kelsey Brunner)

తన స్పేస్​క్రాఫ్ట్​లో అంతరిక్షంలోకి వెళతానని అమెజాన్ అధినేత జెఫ్​ బెజోస్ ప్రకటించగా.. ఆయన కంటే ముందు నేనే చేరుకుంటానని తాజాగా మరో బిలీనియర్ ప్రకటించాడు.

  • Share this:
అంతరిక్షానికి వెళ్లేందుకు బిలీనియర్లు పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తోంది. తన స్పేస్​క్రాఫ్ట్​లో అంతరిక్షంలోకి వెళతానని అమెజాన్ అధినేత జెఫ్​ బెజోస్ ప్రకటించగా.. ఆయన కంటే ముందు నేనే చేరుకుంటానని తాజాగా మరో బిలీనియర్ ప్రకటించాడు. ఆయనే బ్రిటన్​లో బిజినెస్ దిగ్గజం రిచర్డ్​ బ్రాన్​సన్​. బెజోస్ కంటే తొమ్మిది రోజుల ముందు భూ వాతావరణం వెలుపలికి వెళతానని ప్రకటించాడు. స్పేస్​కు టూరిస్టులను పంపాలని లక్ష్యంగా పెట్టుకున్న వ్యాపారంలో బెజోస్​కు బ్రాన్​సన్ పోటీగా నిలుస్తున్నారు. జూలై 11న అంతరిక్షంలోకి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు బ్రాన్​సన్​. ఆయనతో పాటు తెలుగు నేలపై పుట్టిన శిరీష బండ్లకు కూడా వెళ్లనుండడం విశేషం.

బ్లూ ఆరిజన్ ప్రాజెక్టులో భాగంగా న్యూ షెఫర్డ్​ స్పేస్​క్రాఫ్ట్​లో తాను అంతరిక్షానికి వెళతానని జెఫ్ బెజోస్ చెప్పగా.. బ్రాన్​సన్ అంతకు ముందే రెడీ అయ్యారు. తన సంస్థ చేపడుతున్న వర్జీన్ గలాక్టిక్​ టెస్టు ఫ్లయిట్​లో భాగంగా స్పేస్​షిప్​ టూ యూనిటీలో ఆయనే స్పేస్​కు వెళ్లనున్నారు. 2022 కల్లా టూరిస్టులను స్పేస్​కు తీసుకెళ్లాలని బ్రాన్​సన్ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 82 ఏళ్ల మహిళా ఏవియేటర్​ వాలీ ఫంక్​ను తనతో పాటు అంతరిక్షంలోకి తీసుకెళుతున్నానని అమెజాన్ బాస్ సంచలన ప్రకటన చేసిన కొద్ది రోజుల్లోనే బ్రాన్​సనే స్పేస్​లోకి ముందుగా వెళుతున్నట్టు ప్రకటించి షాకిచ్చారు.

అలాగే స్పేస్​షిప్ టూ యూనిటీలో అంతరిక్షానికి వెళ్లే ఈ ప్రయోగానికి మిషన్ స్పెషలిస్టుగా బ్రాన్​సన్ ఉంటారని వర్జిన్ గలాక్టిక్ ప్రకటించింది. జూలై 11వ తేదీ ఉదయమే స్పేస్​షిప్ అంతరిక్షంలో లాంచ్ అవుతుందని ప్రకటించింది. “అంతరిక్షం అందరిదీ అని నేను నమ్ముతా. కమర్షియల్ స్పేస్ ఇండస్ట్రీలో వర్జిన్ గలాక్టిక్ ఓ వెలుగు వెలుగుతుంది. ప్రపంచానికి మంచి చేసే మార్పును తీసుకొస్తుంది” అని బ్రాన్​సన్ చెప్పారు. మరోవైపు జూలై 20న న్యూ ఆరిజన్​ స్పేస్​క్రాఫ్ట్​లో అంతరిక్షానికి వెళతానని ఇదివరకే అమెజాన్ బాస్ ప్రకటించారు.

తెలుగు మూలాలున్న అమ్మాయి శిరీష బండ్ల.. వర్జిన్ గలాక్టిక్ స్పేస్​ఫ్లయిట్ టెస్టులో భాగంగా బ్రాన్​సన్​తో కలిసి అంతరిక్షానికి వెళ్లనున్నారు. ఈ మిషన్​లో ఆమె కీలకపాత్ర పోషించారు. శిరీష బండ్ల ఆంధ్రప్రదేశ్​లో పుట్టి.. హూస్టన్​లో పెరిగారు. చిన్నప్పటి నుంచి అంతరిక్షంపై ఆసక్తి ఉన్నా ఆమె.. ఎయిరోనాటికల్​ – ఆస్ట్రోనాటికల్​ ఇంజినీరింగ్​లో పట్టా పొందారు. అనంతరం వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. ఆ తర్వాత కమర్షియల్ పేస్ ఫ్లయిట్స్ ఫెడరేషన్​ స్పేస్ పాలసీ డిపార్ట్​మెంట్​లో పని చేశారు. ప్రస్తుతం వర్జిన్ గలాక్టిక్​లో గవర్నమెంట్ అఫైర్స్​, బిజినెస్ డెవలప్​మెంట్ వింగ్​లో విధులు నిర్వర్తిస్తున్నారు. లాంచర్ వన్​, స్పేస్​షిప్​టూ రూపకల్పనలో ఆమె కీలకంగా వ్యవహరించారు.
Published by:Sumanth Kanukula
First published: