ఓవైపు రష్యాతో స్నేహం కొనసాగిస్తూనే మరోవైపు అమెరికాతోనూ చెలిమిగా మెలగడం ప్రపంచంలో భారత్‌కు మాత్రమే సాధ్యం. భారత్ దౌత్యనీతి అలాంటిది మరి. నాటి అటల్ బిహారి వాజ్‌పేయి డిప్లమసీని కంటీన్యూ చేస్తున్న నేటి ప్రధాని మోదీ.. అమెరికాకు మరింత దగ్గరవుతున్నారు. రష్యాను ఏ మాత్రం నొప్పించకుండా మోదీ అమెరికా నుంచి ఆయుధాలు తెప్పించుకుంటున్నారు. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడేలా ఇటు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్.. మోదీని అమెరికా టూర్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారని.. దీనికి మోదీ కూడా సానుకూలత చెప్పారని సమాచారం. పీఎంవో వర్గాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి.
జీ 20 సమావేశానికి ముందే అమెరికాకు మోదీ:
ప్రపంచాన్ని విధానపరమైన సవాళ్లు వెంటాడుతున్న ఆందోళనకర పరిస్థితుల్లో జీ20 కూటమి అధ్యక్ష పదవిని చేపట్టిన భారత్.. ఈ ఏడాది ఈ కూటమి సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. నిర్ణయాల విషయంలో చట్టబద్ధత లేకపోయినా లోకాన్ని ప్రభావితం చేసే శక్తి ఈ గ్రూప్‌కు ఉంది. వరల్డ్ బ్యాంక్, UNO, WHO, IMF, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ మొదలైన సంస్థలు కూడా సదస్సుల్లో హాజరవుతూ ఉంటాయి. ఆర్ధిక పరమైన అంశాలు ప్రధాన భూమిక పోషిస్తాయి. 2023 నవంబర్ 30 నుంచి డిసెంబర్ ఒకటి వరకు జరిగే జీ-20 సదస్సును మనమే హొస్ట్ చేస్తున్నాం. అయితే అంతకంటే ముందే అమెరికా టూర్‌కు వెళ్లనున్నారు మోదీ.
2021 తర్వాత మరోసారి అమెరికాకు మోదీ:
వేసవి పర్యటన కోసం అమెరికాకు రావాల్సిందిగా మోదీని ఆహ్వానించారు బైడెన్. సూనతప్రాయంగా ఇప్పటికే టూర్‌ను అంగీకరించిన మోదీ.. అగ్రరాజ్యంలో ఎప్పుడు అడుగు పెడతారన్నదానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. జులైలో మోదీని అమెరికా విజిట్ చేసే అవకాశాలున్నాయట. ఇరు దేశాలకు చెందిన ఉన్నతాధికారులు తేదీలు ఖరారు చేసే పనిలో పడ్డారని సమాచారం. ఇక 2021లోనూ అమెరికాలో పర్యటించారు మోదీ. బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అదే తొలి విజిట్. ఇప్పుడు మరోసారి అమెరికాకు వెళ్లనున్నారు మోదీ. జెట్ ఇంజిన్ల ఉమ్మడి ఉత్పత్తితో సహా అధునాతన రక్షణ, కంప్యూటింగ్ టెక్నాలజీని పంచుకోవడానికి అమెరికా, భారత్ కృషి చేస్తున్న సమయంలో ఈ పర్యటన జరగనుండడం ప్రాధాన్యాతను సంతరించుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, G20 Summit, Joe Biden, Modi