నరేంద్ర మోదీ ఎగ్జామ్ వారియర్స్ పుస్తకంపై భూటాన్ ప్రధాని ప్రశంసలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ రాసిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకం అద్భుతంగా ఉందని భూటాన్ ప్రధాని లొటోయ్ త్సెరింగ్ ప్రశంసించారు.

news18-telugu
Updated: August 15, 2019, 6:43 PM IST
నరేంద్ర మోదీ ఎగ్జామ్ వారియర్స్ పుస్తకంపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
భూటాన్ ప్రధాని, భారత ప్రధాని (Image:Reuters)
  • Share this:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి భూటాన్ ప్రధాని లొటోయ్ త్సెరింగ్ ఓ అద్భుతమైన విశ్లేషణ చేశారు. ఆగస్ట్ 17 నుంచి భారత ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల భూటాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో గతంలో మోదీ రాసిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీతో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ మేరకు భూటాన్ ప్రధానమంత్రి కార్యాలయం ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గురించి భూటాన్ ప్రధాని లొటోయ్ త్సెరింగ్ రాసిన వ్యాసం.. ‘నా బుక్ షెల్ఫ్‌లో ఉన్న నరేంద్ర మోదీ రాసిన ఎగ్జామ్ వారియర్స్ అనే పుస్తకాన్ని చదివా. మోదీ భారత ప్రధాని. అంతేకాదు. ఓమంచి లేఖకుడు కూడా. పరీక్షలు అంటే జీవితాన్ని నిర్దేశించేవని చాలా మంది అభిప్రాయం. అయితే, మోదీ రాసిన పుస్తకం ఆ ఆలోచనలను పునర్నిర్మిస్తుంది. ఈ పుస్తకంలో వ్యక్తిగత కథలున్నాయి. అందులోని సమాచారం పిల్లలు అర్థం చేసుకోవడానికి, ఆచరణాత్మకంగా ఉంది. అచ్చం నరేంద్ర మోదీలాగానే. భూటాన్ ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండుసార్లు భారత్‌లో పర్యటించా. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి (మోదీ) చాలా వినయంగా, సహజంగా ఉన్నారు. మేమిద్దరం పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నాం. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని, మార్పు తేవాలనే గొప్ప ఉద్దేశాలు ఆయనలో ఉన్నట్టు గ్రహించా. ఎన్నో సంక్లిష్టతలు, భిన్న నేపథ్యాలు ఉన్న దేశం కోసం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అయినా సరే మోదీజీ కాళ్లు ఎప్పుడూ నేల మీదే ఉంటాయి.’

‘ఈ పుస్తకంలో ఎన్నో జీవిత పాఠాలను హైలైట్ చేశారు. ప్రధానమంత్రి కావాలనే కల గురించి అలా ఉంచండి, అసలు నేనెప్పుడూ క్లాస్ లీడర్‌ కూడా కాలేదని మోదీ చెప్పారు. కేవలం పుస్తకంలోనే కాదు, నిజజీవితంలో కూడా ఆయన సానుకూలత గురించి గొప్పగా వివరించారు. ప్రపంచ వేదికపై కొన్ని కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తి పిల్లలను పరీక్షలకు సిద్ధం చేయడానికి సమయం కేటాయించడం విశేషం. ఇది ఒక మంచి నాయకుడి తాదాత్మ్యం, లక్షణం కాదా?. పిల్లలు జ్ఞానం కోసం చదవండి. మార్కులు వాటంతట అవే వస్తాయని చెప్పడం ద్వారా పిల్లలకు విలువలను నేర్పిస్తారు.’

‘ఈ పుస్తకంలో యోగా గురించి రాసిన అధ్యాయాన్ని కచ్చితంగా చదవాలి. ఒక వైద్యుడిగా ఆరోగ్యం కోసం నేను యోగా సాధన చేయమని చెబుతా. సంతోషంగా, శక్తివంతంగా, సౌకర్యవంతంగా ఉండడానికి, వృద్ధాప్య సమస్యలను దూరం చేయడానికి యోగాసాధన ఓ చక్కటి మార్గం. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించేలా ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించినందుకు మోదీజీకి వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలుపుతున్నా.’

‘మరో రెండు రోజుల్లో భారత ప్రధాని భూటాన్ వస్తున్నారు. భూటాన్ ఆయనలో ఓ మంచి స్నేహితుడిని చూస్తోంది. ఆయన భూటాన్ రావడం నిస్సందేహంగా గౌరవం. భారత ప్రధానిగానే కాకుండా ఓ గొప్ప మానవతావాదిగా మోదీజీని ఆహ్వానించడం నిజంగా గర్వకారణం. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య స్నేహంలో కొత్త అధ్యాయం లిఖించబడుతుందని ఆశిస్తున్నా. ఈరోజు.. భారతదేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. శాంతియుత,సుసంపన్న భారతావని కోసం మేం ప్రార్థిస్తున్నాం.’

First published: August 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు