భారత ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాకు ఎట్టకేలకు ప్రంపచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అనుమతి లభించింది. భారత్ లో ఈ టీకాను విస్తారంగా వాడుతోన్నా, ఇండియా నుంచి పదుల కొద్దీ దేశాలకు ఎగుమతి అవుతున్నా కొవాగ్జిన్ కు గుర్తింపు ఇవ్వడంలో డబ్ల్యూహెచ్ఓ చేసిన ఆలస్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం, ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా డబ్ల్యూహెచ్ఓ వేదికపైనే ఆ సంస్థ తీరును ఎండగట్టడం తదితర పరిణామాల తర్వాతగానీ కొవాగ్జిన్ కు గ్రీన్ సిగ్నల్ దక్కింది. పూర్తివి వివరాలివి..
ఇండియాకు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్దిచేసి, ఇప్పటికే వివివిగా వినియోగిస్తోన్న కొవాగ్జిన కొవిడ్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం నాడు ఆమోదం తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ టెక్నికల్ అడ్వైజరీ బృందం.. కొవాగ్జిన్ సమర్థతపై భారత్ బయో సమర్పించిన డేటాను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత.. ఈ టీకాను 18 ఏళ్లు పైబడినవారు అత్యవసరంగా వినియోగించొచ్చని చెప్పడంతో ఆ మేరకు డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. గ్లాస్గో వేదికగా జరిగిన కాప్ 26 సదస్సులో మంగళవారం నాడు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ ను ప్రధాని మోదీ కలిశారు. మరుసటి రోజే కొవాగ్జిన్ కు ఆమోదం లభించడం గమనార్హం.
పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో ఇండియాలో రూపుదిద్దుకున్న తొలి వ్యాక్సిన్ అయిన కొవాగ్జిన్ కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం లభించడంతో సుదీర్ఘకాలంగా నెలకొన్న అనేక సమస్యలు తీరిపోనున్నాయి. ఇన్నాళ్లూ కొవాగ్జిన్ ను డబ్ల్యూహెచ్ఓ గుర్తించని కారణంగా ఆ టీకా తీసుకున్న భారతీయులు.. అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు ప్రయాణాలు చేయలేకపోయారు. డబ్ల్యూహెచ్ఓ ఆమోదం లభించనికారణంగానే భారత్ బయోటెక్ వివిధ దేశాలతో వ్యాక్సిన్ పంపిణీ ఒప్పందాల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. అందరికంటే ముందుగా కొవాగ్జిన్ తయారైనప్పటికీ.. అనుమతి ఆలస్యంగా రావడంతో ప్రపంచ మార్కెట్ లో భారత టీకా అవకాశాలను కోల్పోయినట్లయింది. కనీసం ఇప్పటికైనా గ్రీన్ సిగ్నల్ లభించడం శుభపరిణామమే అవుతుంది.
కొవాగ్జిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి లభించడాన్ని ముందస్తు దీపావళిగా పోల్చుతున్నప్పటికీ... ఈ దశను చేరడానికి భారత ప్రభుత్వం, ప్రధాని మోదీ, తయారీ సంస్థ తీవ్రంగా కృషి చేయాల్సి వచ్చింది. ఈఏడాది ఏప్రిల్ లోనే అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా, సుదీర్ఘ కాలం తర్వాత నిర్ణయం వెలువడింది. ఇండియాలో తయారైన వ్యాక్సిన్లకు గుర్తింపు లభించని నేపథ్యంలో.. అగ్రదేశాల అధినేతలు, డబ్ల్యూహెచ్ఓ సారధులు పాల్గొన్న ఓ కాన్ఫరెన్స్ లో ప్రధాని మోదీ అతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డబ్ల్యూహెచ్ఓ ఉద్దేశపూర్వకంగానే భారత్ ను చిన్నచూపు చూస్తున్నదని, ఈ తీరు మానుకోవాలని హెచ్చరించారు.
కొవాగ్జిన్ సమర్థతపై విదేశాల్లో తొలి నుంచీ అనమానాలు కొనాసగుతుండటం, భారత్ లోనే తయారైన కొవిషీల్డ్(ఆస్ట్రాజెనెకా, సీరం తయారీ)కు మాత్రం అనుమతిచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ ను పక్కన పెట్టడం వివాదాస్పదమైంది.అయినాసరే ఇండియాపై నమ్మకంతో ఆస్ట్రేలియాతోపాటు మారిషస్, ఒమన్, ఫిలిప్పీన్స్, నేపాల్, మెక్సికో, ఇరాన్, శ్రీలంక, గ్రీస్, ఎస్టోనియా, జింబాబ్వే తదితర దేశాలు కొవాగ్జిన్ కు గుర్తింపునివ్వడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bharat Biotech, Covaxin, Covid vaccine, India, WHO, World Health Organisation