Viral Video: కొంతమందికి జీవితం ప్రశాంతంగా ఉంటే నచ్చదు. లైఫ్ని రిస్కులో పెట్టి... ఇదీ లైఫంటే అనుకుంటారు. అలాంటి కొంత మంది యూత్ చేసిన పని ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ఐస్లాండ్ (Iceland)లోని ఓ అగ్నిపర్వతం... శుక్రవారం బద్ధలైంది. అది చాలా అందంగా బద్ధలైంది. అంటే... దాన్ని చూస్తుంటే... భలే ఉందే అనిపించకమానదు. అగ్నిపర్వతం మధ్యలో పెద్ద గొయ్యిలా ఉండగా... అందులోంచీ నిప్పులు చిమ్ముతూ లావా ఉప్పొంగుతోంది. దానికి ఓ పక్క నుంచి లావా బయటకు కారుతోంది. ఆ ప్రాంతంలో భూ ప్రకంపనలు వస్తున్నాయి. సాధారణంగా అలాంటి చోట ఎవరైనా ఉంటే ప్రాణాలకే ప్రమాదం. ఎందుకంటే మళ్లీ ఆ పర్వతం మరింతగా బద్ధలవ్వవచ్చు. మరింతగా లావా ఎగజిమ్మవచ్చు. కానీ ఆ కుర్రాళ్లు మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. అగ్నిపర్వతం నుంచి లావా వస్తుంటే... ఆ పక్కనే వాలీబాల్ ఆడుకున్నారు.
ఇలా వాళ్లు వాలీబాల్ ఆడుతున్న వీడియో వైరల్ అయ్యింది. చాలా మంది ఆ వీడియో చూసి... షాక్ అవుతున్నారు. "వాళ్ల కిక్కు తగలెయ్య... వాలీబాల్ ఆడటానికి ఇంకే ప్లేసూ దొరకలేదా" అని చిటపడలాడుతున్నారు.
ఐతే... ఇలా ఈ అగ్నిపర్వతం దగ్గర అడ్వెంచర్లు చెయ్యడం ఇదే మొదటిసారి కాదు. ఇదివరకు ఇక్కడే వేడి లావాపై వంట వండుకున్నారు.
సైంటిఫిక్ అవుట్బ్రేక్ వైరల్ వీడియోలో వేడి లావాపై హాట్ డాగ్స్ వండారు. ఇది చేసింది ఓ సైంటిస్టుల బృందం. ఎందుకంటే... ఈ లావా ఎంత వేడి ఉందో తెలుసుకోవడానికి ఇలా చేశారు.
ఐతే... ఇలా అగ్నిపర్వతాల చెంత వంటలు వండటం అనేది విదేశాల్లో కామన్ అయిపోయింది. ప్రయోగాల పేరుతో చాలా మంది ఇలాంటి ప్రమాదకర పనులు చేస్తున్నారు. అసలు ఇలా వండిన ఆహారం తినవచ్చా అన్నది మరో ప్రశ్న.
ఏది ఏమైనా ఈ వాలీబాల్ ఆడటాన్ని మాత్రం ఎవరూ సమర్థించట్లేదు. ప్రాణాలకే ప్రమాదమైన చోట ఆటలాడుతూ... సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు అని మండిపడుతున్నారు.