news18-telugu
Updated: August 5, 2020, 9:41 PM IST
బీరుట్లో పేలుళ్లు (credit - twitter)
లెబనాన్ రాజధాని బీరుట్ పేలుళ్లలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 113 మంది మరణించగా.. 4వేల మందికి పైగా గాయపడ్డారు. పేలుళ్ల ధాటికి కాలనీలకు కాలనీలు ధ్వంసమయ్యాయి. ఎక్కడ చూసినా కుప్పకూలిన భవనాలు, శిథిలాలే కనిపిస్తున్నాయి. ఆ భయానక దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనాలు ఇప్పటికీ వణికిపోతున్నారు. పేలుళ్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 2 వారాల పాటు ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు లెబనాన్ అధ్యక్షుడు మిచెల్ ఔన్ ప్రకటించారు.
పోర్టు ఏరియాలోని ఓ గోడౌన్లో 2,700 టన్నుల అమోనియం నైట్రేట్‌ను అక్రమంగా నిల్వచేశారని, భారీ పేలుళ్లకు అదే కారణమని ఆయన అన్నారు. పోర్టు అధికారులందరినీ ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. త్వరలోనే వారందరినీ విచారించనున్నారు. గోడౌన్లలో నిల్వ ఉన్న అమోనియం నైట్రేట్‌ను తరలించాలని చాలా రోజులుగా చెబుతున్నా.. ఎవరూ వినలేదని కస్టమ్స్ చీఫ్ బడ్రీ దాహర్ తెలిపారు. ఈ క్రమంలోనే ఘోరం జరిగిపోయిందని ఆయన పేర్కొన్నారు. అమోనియం నైట్రేట్‌ను ఎరువులతో పాటు పలు పేలుడు పదార్థాల్లోనూ ఉపయోగిస్తారని చెప్పారు.
బీరుట్‌లోని పేలుడు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. అటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది.
Published by:
Shiva Kumar Addula
First published:
August 5, 2020, 9:41 PM IST