China Zero Covid Policy : చైనా(China)లో ఇటీవల కాలంలో మళ్లీ కరోనా కేసులు(Covid Cases) పెరుగుతున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం లాక్డౌన్(Lockdown) విధించింది. లాక్‌డౌన్‌కు సంబంధించి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చాలా మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. భయంకరమైన లాక్డౌన్లతో విసిగిపోయిన లక్షలాది మంది చైనీయులు కఠినమైన జీరో-కోవిడ్ పాలసీ(Zero Covid Policy)పై తమ కోపం, నిరాశను ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది 1982లో విడుదలైన హిందీ మూవీ డిస్కో డాన్సర్‌లోని బప్పి లహిరి సూపర్‌హిట్ పాట ‘జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా’ ద్వారా నిరసన తెలియజేస్తున్నారు.
ఆదివారం చైనాలో 2,675 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే 802 కేసులు పెరిగాయి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశించిన జీరో-కోవిడ్ విధానం ప్రకారం.. నగరాలు, ప్రాంతాలు కఠినమైన లాక్డౌన్ పాటించాలి. పాజిటివ్ కేసులు నమోదైతే ఆ ప్రాంత ప్రజలను నిర్బంధ కేంద్రాలకు తరలిస్తారు. బీజింగ్‌తో సహా దాదాపు అన్ని నగరాల్లో, నివాసితులందరికీ వైద్య పరీక్షలు తప్పనిసరి. పాజిటివ్ వస్తే.. నగరాల్లోని ప్రజలు రెస్టారెంట్లు, మార్కెట్ల సహా బహిరంగ ప్రదేశాల్లోకి ప్రవేశించలేరు.
సోషల్ మీడియాలో నిరసన వీడియోలు
చైనాలోని సోషల్ మీడియా యాప్ డౌయిన్‌లో.. లహిరి, పార్వతి ఖాన్ పాడిన జిమ్మీ జిమ్మీ సాంగ్‌ను మాండరిన్లో పాడారు. జిమ్మీ, జి మీ అంటూ సాగే ఈ పాటకు నాకు ఆహారం పెట్టండి, నాకు అన్నం ఇవ్వండి అనే అర్థం వస్తుంది. చైనాలో లాక్డౌన్ సమయంలో అవసరమైన ఆహార పదార్థాలు అందడం లేదని, ప్రభుత్వం సక్రమంగా పని చేయడం లేదని నిరసిస్తూ ఈ పాటతో వ్యంగ్యంగా వీడియోలు చేస్తున్నారు. సాధారణంగా చైనా ప్రభుత్వం ఇంటర్నెట్పై నిఘా ఉంచుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనిపించే కంటెంట్‌ను తొలగిస్తుంది. కానీ ఈ వీడియోలు చైనీస్ సెన్సార్ల నుంచి తప్పించుకోగలిగాయి.
Twitter Character Limit: ట్విట్టర్లో ఇక 280-క్యారెక్టర్ లిమిట్ ఉండదా..? ఎలాన్ మస్క్ ప్లాన్ ఏంటి..?
చైనాలో మన సాంగ్స్ ఫేమస్
1950ల నుంచి చైనాలో బాలీవుడ్ సినిమాలకు ఆదరణ కనిపిస్తోంది. ఈ దశాబ్ధంలో వచ్చిన 3 ఇడియట్స్, సీక్రెట్ సూపర్ స్టార్, హిందీ మీడియం, దంగల్ వంటి సినిమాలు అక్కడ పాపులర్ అయ్యాయి. అంధాధున్ మూవీ చైనీస్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. అయితే ఇప్పటికే అక్కడి వారికి పరిచయమైన Jimmy Jimmy పాటతో, జీరో-కొవిడ్ పాలసీపై ప్రజల దుస్థితిని ఎత్తిచూపడం ఆసక్తికరంగా మారింది.
కఠినంగా జీరో కొవిడ్ పాలసీ
చైనాలో జీరో-కొవిడ్ పాలసీ కఠినంగా అమలవుతోంది. 25 మిలియన్లకు పైగా జనాభా ఉన్న షాంఘై సహా డజన్ల కొద్దీ నగరాలు కొన్ని వారాలపాటు లాక్డౌన్లో ఉన్నాయి. ప్రజలు తమ ఫ్లాట్లకు మాత్రమే పరిమితమయ్యారు. లాక్డౌన్లను నిరసిస్తున్న వ్యక్తులపై భద్రతా అధికారులు తీవ్రంగా విరుచుకుపడటం వంటి వీడియోలు చాలానే బయటకు వచ్చాయి. అయితే వీటన్నింటినీ అక్కడి అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా, ప్రభుత్వ విధానాలను బలవంతంగా అమలు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, Corona lockdown