మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Diesel Prices) భగ్గుమంటున్నాయి. ఇక ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న దేశాల్లో మరింత భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్పపటికే మన పక్కన ఉన్న శ్రీలంక, పాకిస్తాన్‌లో చమురులు ధరలు అధికంగా ఉన్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఆర్థిక కష్టాల్లో ఉంది. ఈ క్రమంలోనే ఇంధన ధరలను పెద్ద ఎత్తున పెంచింది. రాత్రికి రాత్రే 50శాతం మేర పెంచేసింది. బంగ్లాదేశ్ (Bangladesh)లో శనివారం పెట్రోల్ ధరలు 51.7 శాతం, డీజిల్ ధరలు 42 శాతం పెరిగాయి.
ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి బంగ్లాదేశ్ IMF (అంతర్జాతీయ ద్రవ్య నిధి) సహా అనేక అంతర్జాతీయ సంస్థల నుంచి పెద్ద ఎత్తున రుణాలను తీసుకుంది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా పెరిగిన వస్తువుల ధరలు బంగ్లాదేశ్ దిగుమతి బిల్లు పెంపునకు కారణమయ్యాయి. దీని కారణంగా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ ధరల పెరుగుదల తర్వాత... బంగ్లాదేశ్‌లో ఒక లీటర్ పెట్రోల్ ధర ఇప్పుడు 130 టాకాకు చేరుకుంది. డీజిల్ 114 టాకాగా ఉంది. 1971లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత .. అక్కడ ఇంధన ధరలు ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరల పెంపు అనివార్యమైందమని బంగ్లాదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థ 'బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్' గత 6 నెలల్లో 8 బిలియన్ టాకాల నష్టాన్ని చవిచూసింది. బంగ్లాదేశ్ ఇంధన, ఖనిజ వనరుల మంత్రి నస్రుల్ అహ్మద్ మాట్లాడుతూ.. పెరిగిన ధరల వల్ల ప్రజలపై భారం పడుతుందని.. తామకు కాదనడం లేదని అన్నారు. కానీ ప్రభుత్వానికి వేరే మార్గం లేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గిన వెంటనే... దేశంలోనూ ఇంధన ధర తగ్గుతుందని నస్రుల్ తెలిపారు. దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయని తాము ముందే ఊహించామని.. కానీ ఏకంగా 50శాతం మేర పెరుగుతాయని అస్సలు ఊహించలేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు.
OMG: వామ్మో.. బస్సు కిటికీలోకి దూసుకొచ్చిన పెద్ద పులి.. వైరల్ వీడియో
గత 9 నెలలుగా దేశంలో ద్రవ్యోల్బణం రేటు నిరంతరం 6 శాతం కంటే ఎక్కువగానే ఉంది. జూలై నెలలో ఏకంగా 7.48 శాతానికి చేరుకుంది. ఇది పేద మధ్యతరగతి కుటుంబాలపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరగడంతో ప్రజలపై మరింత భారం పడనుంది. పెరిగిన ఇంధన ధరల కారనంగా.. బంగ్లాదేశ్‌లో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని అంచనా. అయితే ఇంధన ధరల పెంపు వల్ల బంగ్లాదేశ్ ప్రభుత్వంపై సబ్సిడీ భారం తగ్గుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా బంగ్లాదేశ్‌లో ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు. ప్రస్తుతం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ విలువ 416 బిలియన్ డాలర్లుగా ఉంది.
మన దేశంలో కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.92.76, డీజిల్ రూ.89.62గా ఉంది. దేశంలోనే అత్యంత తక్కువ ధరకు పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ రూ.84.10కి లభిస్తోంది. డీజిల్ ధర కూడా అక్కడే అత్యల్పంగా ఉంది. పోర్ట్ బ్లెయిర్‌లో లీటర్ డీజిల్ రూ.79.74గా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangladesh, Diesel price, International news, Petrol Price