US forces: ఆఫ్గానిస్థాన్‌ను వీడి వెళ్లిన యూఎస్‌ దళాలు...ఎన్నేళ్లు అక్కడ ఉన్నాయంటే..

ప్రతీకాత్మకచిత్రం

US and Nato forces: ఆఫ్గానిస్థాన్‌ను వీడి వెళ్లిన యూఎస్‌, నాటో దళాలు... ఎన్నేళ్లు అక్కడ ఉన్నాయ్‌.. ఏం చేశాయ్‌, ఎందుకు వెళ్లిపోతున్నాయ్‌!

  • Share this:
అఫ్గానిస్థాన్‌లో సుమారు 20 ఏళ్ల నుంచి ఉన్న యునైటెడ్‌ స్టేట్స్‌, నాటో దళాలు వెనక్కి వచ్చేశాయి. బాగ్రామ్‌ ఎయిర్‌ బేస్‌ నుంచి చివరి ఫోర్స్‌ను కూడా వెనక్కి పిలిచినట్లు యూఎస్‌ ప్రకటించింది. నిజానికి సెప్టెంబరు 11 నాటికి తమ సాయుధ దళాలను వెనక్కి పిలిపిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ గతంలో తెలిపారు. అయితే అంతకుముందే కార్యక్రమం పూర్తి చేయడం విశేషం. అమెరికా దళాలు ఇక్కడి ఎయిర్ బేస్‌ను వీడిన తరువాత.. తాజాగా ఈశాన్య అప్గానిస్థాన్‌ను తాలిబన్‌లు వశం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా యూఎస్, నాటో దళాలను ఇక్కడికి ఎందుకు పిలిచారు, అక్కడ ఇప్పుడు ఏం జరుగుతోందనే వివరాలు తెలుసుకుందాం.

ఇటీవల వరకు అఫ్గానిస్థాన్‌లో 2,500 నుంచి 3,500 మంది యూఎస్‌ సైన్యం ఉండేవారు. వారిలో చాలామందిని ఇటీవల వెనక్కి పిలిచారు. అలాగే 7,000 మంది సంకీర్ణ దళాల సైన్యం ఉండేది. వారిలో చాలామంది తిరిగి స్వదేశాలకు వెళ్లిపోయారు. ఈ మేరకు జర్మనీ, ఇటలీ ఇటీవల ప్రకటించాయి కూడా. అయితే బలగాల ఉపసంహరణ తర్వాత అఫ్గాన్‌లో హింస పెరిగిపోతూ వచ్చింది. తాలిబన్లు దేశంలో చాలా ప్రాంతాలను ఆక్రమించుకుంటూ వస్తున్నారు. ఈ సమయంలో మిగిలిన కొద్ది మంది అక్కడ ఉండటం మంచిది కాదని అమెరికా భావించిందని సమాచారం. అందుకే అనుకున్న సమయం కంటే ముందుగానే బలగాలను స్వదేశానికి రప్పించేసింది.

ఇప్పటివరకు అఫ్గాన్‌ నేలపై జరిగిన పోరులో 47 వేలమంది అఫ్గాన్‌ పౌరులు, 70 వేలమంది అఫ్గాన్‌ దళాలు, 2,442 మంది యూఎస్‌ సైనికులు, 2,800 యూఎస్‌ ప్రైవేటు సెక్యూరిటీ కాంట్రాక్టర్లు కన్నుమూశారు. సంకీర్ణ దళాలకు చెందిన 1144 మంది చనిపోయారు. గత పదేళ్లలో అమెరికా... అఫ్గాన్‌ యుద్ధం కోసం 2.26 ట్రిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినట్లు సమాచారం. గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ఒప్పందం కారణంగా తాలిబన్లు యూఎస్‌ దళాల మీద దాడులు చేయకూడదు. అలాగే విదేశీ జిహాదీ సంస్థలతో సంబంధాలు పెట్టుకోకూడదు. కానీ గత కొంతకాలంగా ఒప్పందాన్ని తాలిబన్లు మీరుతున్నారు.

అఫ్గానిస్థాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీని.. అక్కడి యూఎస్‌ కమాండర్‌ జనరల్‌ స్కాట్‌ మిల్లర్‌ కలిశారు. ఈ సందర్భంగా ‘దేశంలో యూఎస్‌ దళాల సేవలు అవసరం’ అని అధ్యక్షుడు అన్నారట. దీంతో కనీసం 650 యూఎస్‌ దళాలు అఫ్గానిస్థాన్‌లో ఉంటాయని వార్తలొచ్చాయి. అక్కడి నాయకులు, కాబూల్‌ ఎయిర్‌పోర్టును రక్షించడానికి యూఎస్‌ దళాలు అవసరమని అఫ్గాన్‌ ప్రభుత్వం భావిస్తోందట. దీనికి అమెరికా అంగీకరించిందని సమాచారం. బాగ్రామ్‌ ఎయిర్ బేస్ ఆఫ్గాన్‌ ప్రభుత్వ అధీనం ఉండాలంటే... కాబూల్‌ ఎయిర్‌పోర్టు రక్షణ చాలా కీలకం. అందుకే అమెరికా దళాల సాయం కోరారు.

బాగ్రామ్‌ ఎందుకు కీలకం...
రెండు దశాబ్దాల యుద్ధానికి బాగ్రామ్ వైమానిక స్థావరం కేంద్ర బిందువు. పెద్ద ఎత్తున సైనికులు ఉండటానికి కావాల్సిన సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. దాదాపు 10 వేల మంది సైనికులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. అల్‌ఖైదా జిహాదీలు, తాలిబన్ల దాడులను తిప్పికొట్టేందుకు, ఈ వర్గాలపై పోరాటం చేసేందుకు అమెరికా నాటో సేనలు ఎప్పటికప్పుడు ఇక్కడి నుంచే వ్యూహరచనకు దిగాయి. పట్టుబడ్డ యుద్ధ ఖైదీలను బంధీలుగా ఉంచేందుకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి. భారీ కార్గో విమానాలతో పాటు యుద్ధ విమానాల కార్యకలాపాలకు కావాల్సిన సకల వసతులు ఇక్కడ ఉండేవి. 80వ దశకంలో అఫ్గానిస్థాన్‌ను వశం చేసుకున్న రష్యా దీన్ని నిర్మించింది. దేశ రాజధాని కాబూల్‌కు 40 కి.మీ దూరంలో ఇది ఉంటుంది. ఇక్కడ రెండు రన్‌వేలు కూడా ఉన్నాయి. వాటిపై పెద్ద పెద్ద కార్గోలు, బాంబర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ల్యాండ్‌ అయ్యే వీలు ఉంది. ఇంతటి కీలక ప్రాంతం కావడంతో దీని మీద తాలిబన్లు దృష్టి సారించారు.

సెప్టెంబరు 11 ఎందుకంటే...
సెప్టెంబరు 11 కల్లా దళాలను వెనక్కి తీసుకోవాలని అనుకోవడానికి ఓ కారణం ఉంది. అమెరికాలో 9/11 ఉగ్రవాద దాడుల అనంతరం అఫ్గాన్‌లో సంకీర్ణ దళాలు మోహరించాయి. ఆ దాడిలో అమెరికాలో సుమారు మూడు వేల మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ దాడి అల్‌ ఖైదా ఆధ్వర్యంలో జరిగింది. ఈ జిహాదీ గ్రూపు అఫ్గానిస్థాన్‌లో ఉండేది. ఆ సమయంలో అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల అధీనంలో ఉండేది. సెప్టెంబరు 11 దాడి తర్వాత యూఎస్‌ సంకీర్ణ దళాలు అఫ్గానిస్థాన్‌ మీద దాడి చేసి తాలిబన్‌, అల్‌ ఖైదా గ్రూపులను హతమార్చాయి. అప్పటి నుంచి యూఎస్‌ సంకీర్ణ దళాలు అక్కడ కొనసాగుతున్నాయి. అయితే ఈ సుదీర్ఘ యుద్ధానికి తెరదించాలని అమెరికా ఇటీవల నిర్ణయించుకుంది. దీని వల్ల మనుషుల ప్రాణాలు పోతున్నాయి, ఖజానాలో డబ్బులు ఖర్చు అవుతున్నాయని భావించింది.

అయితే యూఎస్, సంకీర్ణ దళాలు అఫ్గాన్‌ను వీడిన తరువాత, ఆ దేశంలో తాలిబన్ల దురాక్రమణ తంతు కొనసాగుతోంది. ఇప్పటి వరకు చాలా జిల్లాలను వీరు తమ అధీనంలోకి తీసుకున్నారు. సైన్యం వీరిని ప్రతిఘటించేందుకు సాహసించలేదు. ఫలితంగా ఈశాన్య అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకున్నట్లు తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఎలాంటి యుద్ధం లేకుండానే తాలిబన్ల అధీనంలోకి ఈ ప్రాంతాలు వెళ్లాయని అధికారులు సైతం ధ్రువీకరించారు.
Published by:Krishna Adithya
First published: