Save Trees: అంగారకుడి మీదకు కూడా మొక్కలను తీసుకెళ్లొచ్చు!

అవసరమైతే అంగారకుడి మీదకు మొక్కలు

 • Share this:
  మొక్క‌లు, వివిధ రకాల చెట్ల జాతుల‌‌ను సంరక్షించ‌డానికి శాస్త్రవేత్తలు ఎప్ప‌టి నుంచో ప్ర‌యోగాలు చేస్తున్నారు. క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన మొక్కల పరిశోధకులు మ‌రో అడుగు ముందుకేశారు. అవొకాడో రెమ్మలను కాపాడటానికి, వాటిని ఆరోగ్యకరమైన మొక్కలుగా పెంచ‌డానికి ఒక వినూత్న‌ పద్ధతిని రూపొందించారు. అవ‌స‌ర‌మైతే ఆ మొక్క‌ల‌ను అంగారక గ్రహానికి కూడా పంపించేలా ప్ర‌యోగాలు చేస్తున్నారు. ఇందుకోసం క్రియో ఫ్రీజింగ్ ప‌ద్ధ‌తిని వారు ఎంచుకున్నారు.
  ముందు మొక్క‌ల‌ రెమ్మలను అల్యూమినియం ఫాయిల్లో చుట్టి, దాన్ని క్రయోట్యూబ్ లో ఉంచారు. అనంతరం దీన్ని ద్రవ నత్రజనిలో నిల్వ చేశారు. ఈ ప్ర‌యోగంలో రెమ్మలు కోలుకోవడానికి 20 నిమిషాల సమయం పడుతుందట‌. రెండు నెలల్లోనే ఈ కొమ్మ‌ చిగురించి సాధార‌ణ మెక్క‌లా ఎదుగుతుందని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

  CRYO PRESERVING అంటే ఏమిటి?
  క్రియోప్రిజర్వింగ్ అనేది ఒక‌ శాస్త్రీయ ప్రక్రియ. ఇది క‌ణాలు, క‌ణ నిర్మాణాలు నాశ‌నం కాకుండా కాపాడుతుంది. సాధార‌ణంగా ఐవీఎఫ్, ఎగ్ ఫ్రీజింగ్ ట్రీట్మెంట్లో హ్యూమ‌న్‌ స్మెర్మ్, ఎగ్స్‌ను క్రియో ఫ్రీజింగ్ చేస్తారు. ఈ ప‌ద్ధ‌తిలో స్పెర్మ్, ఎగ్స్ ను -320 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రత వద్ద గ‌డ్డ‌క‌ట్టించి, వాటిని స‌జీవంగా ఉంచుతారు. ఈ విధానాన్ని మొక్క‌ల‌పై ప్ర‌యోగించి మంచి ఫ‌లితాలు రాబ‌ట్టారు. ప్ర‌యోగంలో భాగంగా వివిధ రకాల అవొకాడో మొక్కల కొమ్మ‌ల‌ను ప‌రిశోధ‌కుల బృందం క్రియోప్రిజర్వ్ చేసింది. వీటిల్లో రీడ్ అవొకాడో రకం మొక్క‌ల కొమ్మ‌లు 80 శాతం పునరుజ్జీవన రేటుతో మ‌ళ్లీ పెరిగిన‌ట్లు వారు ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించిన‌ వివ‌రాల‌ను యూనివర్సిటీ సెంటర్ ఫర్ హార్టికల్చరల్ సైన్స్ ప్రొఫెసర్ నీనా మిట్టర్ వివ‌రించారు. ప్ర‌యోగంలో తిరిగి జీవం పొందిన మొక్క‌ల‌ను స్పేస్ ఏజ్ అవొకాడోలని ఆమె చెబుతున్నారు. మొక్క‌ల‌ను ఈ ప‌ద్ధ‌తిలో భ‌ద్ర‌ప‌రిచి, అవ‌స‌ర‌‌మైన‌ప్పుడు అంగార‌కుడి మీద‌కు కూడా తీసుకెళ్లొచ్చ‌ని ఆమె వివ‌రిస్తున్నారు.

  అవొకాడోల‌నే ఎందుకు ఎంచుకున్నారంటే..
  సాధార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అవొకాడోల‌కు కొరత ఉంటుంది. అందుకే ప్రపంచానికి అవొకాడోల సరఫరాను పెంచేందుకు ఒక పద్ధతిని కనుగొనాలని పరిశోధనా బృందం ప్రణాళిక వేసి, విజ‌యం సాధించింది. ఈ ప్ర‌యోగంలో మొక్కలు తిరిగి ప్రాణం పోసుకోవ‌డానికి 20 నిమిషాలు పడుతుందని బృంద స‌భ్యుడు,‌ యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ పీహెచ్‌డీ విద్యార్థి క్రిస్ ఓబ్రెయిన్ చెబుతున్నారు. సుమారు రెండు నెలల్లోనే వాటికి కొత్త ఆకులు వ‌స్తాయంటున్నాడు. బుష్ ఫైర్స్‌, తెగుళ్లు, వ్యాధుల నుంచి అవొకాడో మొక్క‌ల‌ను కాపాడాల‌నే ఉద్ధేశంతో ప్ర‌యోగం చేశారు. ఫ్లోరిడాలోని అన్ని అవొకాడో ర‌కాల‌నూ తుడిచిపెట్టే సామర్ధ్యం లారెల్ విల్ట్ అనే ఫంగ‌స్‌కు ఉంది. ఇలాంటి వాటి బారిన ప‌డి అవొకాడో మొక్క‌లు న‌శించ‌కుండా చూసేందుకు, వాటి జ‌న్యు ల‌క్ష‌ణాల‌ను సంరక్షిస్తూ సాగును ప్రోత్స‌హించాల‌నే ల‌క్ష్యంతో ప్ర‌యోగం చేసిన‌ట్లు ఓబ్రెయిన్ చెప్పారు.

  ప్ర‌యోగాలు కొత్తేంకాదు..
  అవొకాడో పండ్ల జాతిని కాపాడ‌టంతో పాటు, వాటి ఉత్ప‌త్తి, స‌ర‌ఫ‌రాను పెంచాలని పరిశోధకులు కోరుతున్నారు. గత 40 సంవత్సరాల నుంచి అవొకాడోల ‌కోసం క్రియోప్రెజర్వేషన్ ప్ర‌యోగాలు చేస్తున్నారు. ఇప్ప‌టికి శాస్త్రవేత్తలు ఈ ప్రయోగంలో పురోగతి సాధించగలిగారు. "ఉష్ణోగ్రతను స‌రిగ్గా కాపాడేందుకు లిక్విడ్ నైట్రోజ‌న్‌కు ఎలాంటి విద్యుత్ అవ‌స‌రం లేదు. దీని ద్వారానే అవోకాడో జెర్మ్ ప్లాస్మ్‌ను విజయవంతంగా ఫ్రీజింగ్ చేయగ‌లిగాం. ఈ ప‌ద్ధ‌తిలో క్లోనల్ ప్లాంట్ పదార్థాన్ని ఎప్ప‌టివ‌రకైనా సంరక్షించుకోవ‌చ్చు" అని ఓబ్రెయిన్‌ వివ‌రించారు. క‌ణాల‌ను ఉత్తేజం చేయ‌డానికి విట‌మిన్ సి, సుక్రోజ్, చల్లని ఉష్ణోగ్రత వంటి ఇతర ప్రీ-ట్రీట్‌మెంట్స్‌ను ప్ర‌యోగించామ‌ని ఓబ్రెయి‌న్ వివ‌రించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు రీడ్ అవొకాడో మొక్కలను తిరిగి పెంచడంలో 80 శాతం, వెల్విక్ సాగుతో 60 శాతం సక్సెస్ రేటు సాధించారు. అరటి చెట్లు, ద్రాక్ష తీగలు, యాపిల్ మొక్క‌ల‌ను కూడా ఈ పద్ధతిలో సంరక్షిస్తారు.
  Published by:Nikhil Kumar S
  First published: