AUSTRALIAN GOVERNMENT HAS IMPOSED A BAN ON ITS CITIZENS FROM RETURNING HOME IF THEY HAVE SPENT TIME IN INDIA UP TO 14 DAYS BEFORE FLYING BACK SSR
Australia: ఆస్ట్రేలియా ఊహించని ప్రకటన.. భారత్‌లో 14 రోజులుండి ఆస్ట్రేలియాలో అడుగుపెడితే..
ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ (ఫైల్ ఫొటో)
భారత్‌లో 14 రోజుల పాటు ఉండి.. ఆ తర్వాత తమ దేశంలో ఆస్ట్రేలియా పౌరులు అడుగుపెడితే.. అలా వచ్చిన వారికి ఐదేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం హెచ్చరించింది. అంతేకాకుండా.. 66వేల డాలర్ల వరకూ జరిమానా కూడా విధిస్తామని ప్రకటించింది. స్వదేశీ పౌరులపై ఈ తరహా కఠినమైన ఆంక్ష విధించడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
మెల్బోర్న్: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న వేళ ఆస్ట్రేలియా ప్రభుత్వం చరిత్రలో తొలిసారిగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో 14 రోజుల పాటు ఉండి.. ఆ తర్వాత తమ దేశంలో ఆస్ట్రేలియా పౌరులు అడుగుపెడితే.. అలా వచ్చిన వారికి ఐదేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం హెచ్చరించింది. అంతేకాకుండా.. 66వేల డాలర్ల వరకూ జరిమానా కూడా విధిస్తామని ప్రకటించింది. స్వదేశీ పౌరులపై ఈ తరహా కఠినమైన ఆంక్ష విధించడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ కొత్త నిబంధన శనివారం నుంచి అమల్లోకి వచ్చే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బయోసెక్యూరిటీ చట్టం ప్రకారం ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేసింది. భారత్‌లో రోజుకు 3 లక్షల 80 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్న తరుణంలో.. కరోనా కట్టడిలో భాగంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి ప్రయాణాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం మూడు వారాల క్రితమే తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. భారత్‌లో కొత్తగా సార్స్-కోవిడ్-2 వేరియంట్ కేసులు వెలుగుచూస్తున్న తరుణంలో తమ దేశ పౌరులైనా భారత్ నుంచి వస్తే ఉపేక్షించేది లేదని ఆస్ట్రేలియా తేల్చి చెప్పింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం చెబుతున్న ప్రకారం.. భారత్‌లో మొత్తం 9వేల మంది ఆస్ట్రేలియా దేశస్తులు నివసిస్తున్నారు. ఇందులో.. సుమారు 600 మందికి కరోనా సోకి ఉండే అవకాశం ఉందని ఆస్ట్రేలియా చెబుతోంది.
ఇదిలా ఉంటే.. భారత్‌లో జరుగుతున్న ఐపీఎల్లో భాగంగా కొందరు ఆస్ట్రేలియా క్రికెటర్లు, శిక్షణా సిబ్బంది ఇండియాలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిలో కొందరు ఇంటి బాట పట్టారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ నుంచి విమాన ప్రయాణాలపై నిషేధం విధించినప్పటికీ ఆసీస్ క్రికెటర్లు ఆడం జంపా, కేన్ రిచర్డ్సన్ ఆ దేశంలో అడుగుపెట్టినట్లు తెలిసింది. ఈ క్రికెటర్లు ఇద్దరూ భారత్ నుంచి ఖతర్‌కు వెళ్లి.. అక్కడి నుంచి మెల్బోర్న్కు కమర్షియల్ ఫ్లైట్‌లో చేరుకున్నట్లు సమాచారం.
ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్‌పై మాత్రమే నిషేధం విధించిన విషయం తెలుసుకున్న ఈ ఇద్దరు క్రికెటర్లు ఆ దేశ ప్రభుత్వ నిబంధనలో ఉన్న లొసుగును అడ్డం పెట్టుకుని స్వదేశం చేరడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మే 15 వరకూ భారత్ నుంచి రాకపోకలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. ఆ తర్వాత.. భారత్‌లో ఉన్న తమ దేశ పౌరులను ఎలా స్వదేశానికి తీసుకురావాలన్న అంశంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆలోచనలో పడినట్లు తెలిసింది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.