దక్షిణ పసిఫిక్ సముద్రంలో సునామీ.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో హై అలర్ట్

ప్రతీకాత్మక చిత్రం

సముద్ర తీరప్రాంతాల్లోని ప్రజలు సముద్రానికి దూరంగా ఉండాలని న్యూజిలాండ్ నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రకటన విడుదల చేసింది. సముద్ర తీరాలు, హార్బర్లు, నదులకు దగ్గరగా ఉండకూడదని ప్రజలకు సూచించింది.

 • Share this:
  దక్షిణ పసిఫిక్‌ మహా సముద్రంలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 7.7గా నమోదయింది. న్యూ కాలిడోనియాలోని వావోకు తూర్పున 415 కిలోమీటర్లు దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భారీ భూకంపం కారణంగా సునామీ ఏర్పడిందని ఆస్ట్రేలియా తెలిపింది. ‘దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం ఫలితంగా సముద్రంలో సునామీ ఏర్పడింది. లార్డ్ హౌ ద్వీపానికి సునామీ ముప్పు పొంచి ఉంది.’ అని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ ట్విటర్‌లో పేర్కొంది. ఆస్ట్రేలియా ప్రధాన భూభాగానికి తూర్పున 550 కిలోమీటర్ల దూరంలో ఉందని వెల్లడించింది.  సముద్ర తీరప్రాంతాల్లోని ప్రజలు సముద్రానికి దూరంగా ఉండాలని న్యూజిలాండ్ నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రకటన విడుదల చేసింది. సముద్ర తీరాలు, హార్బర్లు, నదులకు దగ్గరగా ఉండకూడదని ప్రజలకు సూచించింది. 7.7 తీవ్రతతో భూకంపం వచ్చినందున న్యూజిలాండ్ తీరంలో బలమైన, అసాధారణమైన అలలు వస్తాయని భావిస్తున్నట్లు పేర్కొంది. న్యూజిలాండ్‌ ఉత్తర ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందని పలు సంస్థలు కూడా తెలిపాయి.  పలు తీరాల్లో ప్రమాదకర సునామీ తరంగాల ఉన్నాయని పసిఫిక్ సునామి హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఫిజి, న్యూజిలాండ్, వనాటుల ద్వీప దేశాల్లోని తారాల్లో అలల స్థాయి 0.3 మీటర్ల నుంచి ఒక మీటర్ ఎగిసిపడే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే పలు తీర ప్రాంతాల్లో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. ఐతే ఈ భూంకంపం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

  2018 ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో 7.5 తీవ్రతతో భూకంపం, సునామీ రావడంతో 4,300 మంది మరణించారు. ఇక 2004లో ఇండోనేసియాలోని సుమత్రా దీవుల్లో 9.1 తీవ్రతతో భూకంపం వచ్చి సునామీ ఏర్పడింది. ఆ ప్రకృతి విపత్తు ధాటికి చుట్టు పక్కల ప్రాంతాల్లో 2,20,000 మంది మరణించారు. ఇందులో ఒక్క ఇండోనేసియాలోనే 1,70,00 మంది మరణించారు. ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన విపత్తుల్లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు మళ్లీ సునామీ హెచ్చరికలు జారీ కావడంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తీరాల్లోని ప్రజల్లో ఆందోళన నెలకొంది.
  Published by:Shiva Kumar Addula
  First published: