Graves at school: స్కూల్‌ ప్రాంగణంలో బయటపడ్డ 600 సమాధులు.. అవన్నీ చిన్నారులవే..!

ప్రతీకాత్మక చిత్రం

గత నెలలో ‘కామ్‌లూప్స్‌ ఇండియన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌’ ప్రాంగణంలో ఒకేసారి 215 మంది పిల్లల అస్థిపంజరాలు బయటపడిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే మరోచోట జరిగింది.

  • Share this:
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 600 అస్థి పంజరాలు. వాటన్నింటిని ఒక దగ్గర చూడటమే కష్టం. అలాంటిది ఆ ఆస్థిపంజరాలన్నీ ఓ పాఠశాల ప్రాంగణంలో బయటపడ్డాయి అంటే.. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇదంతా జరిగింది కెనడాలోని ఓ పురాతన రెసిడెన్షియల్‌ పాఠశాల ప్రాంగణంలో. గత నెల బ్రిటిష్‌ కొలంబియాలోని ఓ మూసివున్న పాఠశాల ప్రాంగణంలో 200 అస్థిపంజరాలు బయటపడిన ఉదంతం మరచిపోక ముందే.. వాంకోవర్‌లోని మరోసారి ఈ అస్థి పంజరాలను గుర్తించారు.

గత నెలలో ‘కామ్‌లూప్స్‌ ఇండియన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌’ ప్రాంగణంలో ఒకేసారి 215 మంది పిల్లల అస్థిపంజరాలు బయటపడిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన దర్యాప్తు అధికారులు దేశవ్యాప్తంగా మూసివున్న రెసిడెన్షియల్‌ స్కూళ్ల భవనాలపై దృష్టిసారించారు. ఈ క్రమంలోనే కొవెస్సెస్‌ ఫస్ట్‌ నేషన్‌లోని ‘మారివల్‌ ఇండియన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌’ ప్రాంగణానికి వచ్చారు. ఈ ఆశ్రమ పాఠశాల 1899 నుంచి 1997 వరకు రోమన్‌ కేథలిక్‌ చర్చి ఆధ్వర్యంలో నడిచింది. అక్కడ రాడార్‌ ద్వారా తనిఖీలు చేయగా, వందల కొద్దీ గుర్తుతెలియని సమాధులు బయటపడ్డాయి. వాటిలో 600 మందికి పైనే చిన్నారులను సమాధి చేసినట్లు తేలింది. ఇప్పుడు అక్కడ తవ్వి అవశేషాలను వెలికి తీస్తున్నారు.

19వ శతాబ్దం నుంచి 1970 వరకు కెనడాలో దాదాపు లక్షన్నర మందికి పైగా చిన్నారులను క్రిస్టియన్‌ స్కూళ్లలో బలవంతంగా చేర్చినట్లు చరిత్ర చెబుతోంది. ఈ పాఠశాలలు ఎక్కువగా రోమన్‌ కేథలిక్‌ మిషనరీ ఆధ్వర్యంలో నిర్వహించేవారు. ఆ రోజుల్లో ఈ పాఠశాలల్లో బలవంతపు మత మార్పిళ్లు జరిగేవని అంటారు. వారి మాట విననివారిని తీవ్రంగా కొట్టేవారనీ చెబుతుంటారు. అంతేకాదు చిన్నారులపై శారీరక, లైంగిక దాడులు జరిగాయని పరిశోధకులు గుర్తించారు. ఆ రోజుల్లో పాఠశాలల్లో మాతృభాష మాట్లాడినందుకు పిల్లలను చితకబాదేవారని ఇటీవల కెనడా ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇలాంటి చర్యల వల్ల అక్కడ ఆరు వేలమంది వరకు బలై ఉంటారని అంచనా.

కెనడాలో ఐదేళ్ల క్రితం వేసిన ఓ నిజ నిర్ధారణ కమిషన్‌ ఒకటి నివేదిక ఇప్పుడు కీలకంగా మారింది. కెనడాకు చెందిన పిల్లల పట్ల విద్యాసంస్థల్లో దారుణాలు జరిగాయని ఆ నివేదికలో రాసుకొచ్చారు. పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల 3,200 మంది వరకు పిల్లలు చనిపోయి ఉంటారని అందులో పేర్కొన్నారు. అయితే ఈ ఆశ్రమ పాఠశాలల్లో అంతకుమించి ఇంకేదో ఘాతుకం జరిగి ఉండొచ్చని తాజా అస్థిపంజరాల వ్యవహారం సూచిస్తోంది. తాజా ఘటనలపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ట్విటర్‌ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దారుణాల వెనుక వాస్తవాలను మేం బయటపెడతామని ఆయన ట్వీట్‌ చేశారు.
Published by:Sumanth Kanukula
First published: