Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న బస్సు.. 33 మంది దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జయిన బస్సు

పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బక్రీద్ నేపథ్యంలో పండుగ చేసుకునేందుకు స్వస్థలాలకు కూలీలు బస్సులో వెళుతుండగా.. ప్రమాదవశాత్తూ ఆ బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో 33 మంది కూలీలు ప్రాణాలు కోల్పోగా.. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.

  • Share this:
    ముల్తాన్: పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బక్రీద్ నేపథ్యంలో పండుగ చేసుకునేందుకు స్వస్థలాలకు కూలీలు బస్సులో వెళుతుండగా.. ప్రమాదవశాత్తూ ఆ బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో 33 మంది కూలీలు ప్రాణాలు కోల్పోగా.. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ డేరా ఘాజీ ఖాన్ జిల్లాలో హైవేపై ఈ ఘటన జరిగింది. సియాల్కోట్ నుంచి రజన్‌పూర్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. బుధవారం నాడు బక్రీద్ కావడంతో పండుగ జరుపుకునేందుకు ఇళ్లకు వెళుతుండగా ఈ ప్రమాదం జరగడంతో ఘటనా స్థలంలో హాహాకారాలు మిన్నంటాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని రెస్క్యూ టీం ఇంఛార్జ్ షేర్ ఖాన్ తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కూడా స్పాట్‌లోనే చనిపోయాడు. ఈ ప్రమాదానికి సంబంధించి పాకిస్తాన్ వార్తా ఛానళ్లలో, సోషల్ మీడియాలో చూపించిన కొన్ని దృశ్యాలు చూపరులను కలచివేశాయి. ఒక ఫొటోలో... తీవ్రంగా గాయపడి బస్సు సమీపంలో కూర్చొని సాయం కోసం ఎదురుచూస్తున్న ఓ క్షతగాత్రుడి ఫొటో కలచివేసింది.

    ఈ ప్రమాదంలో గాయపడి ప్రాణాలతో బయటపడిన ఓ వ్యక్తి.. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో జారుకోవడాన్ని తాను అప్పుడే గమనించానని.. అప్రమత్తం చేసే లోపే ప్రమాదం జరిగిందని పోలీసులకు చెప్పాడు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా బస్సు అదుపు తప్పడమే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి ఉస్మాన్ బుజ్దార్ ఈ ప్రమాదం జరగడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఆయన ఇప్పటివరకూ ఎలాంటి పరిహారాన్ని ప్రకటించకపోవడం గమనార్హం. పాకిస్తాన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖా మంత్రి ఫవాద్ చౌదరి ఈ రోడ్డు ప్రమాదంపై ట్వీట్ చేశారు.

    డేరా ఘాజీ ఖాన్ ప్రాంత సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 30 మందికి పైగా చనిపోయారని.. డ్రైవర్లు అప్రమత్తంగా డ్రైవింగ్ చేసి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని ఆయన ట్వీట్‌లో కోరారు. పాకిస్తాన్‌లో ఇలాంటి రోడ్డు ప్రమాదాలు కొత్తేమీ కాదు. రోడ్డు ప్రమాదాలు ఇటీవల కాలంలో పాక్‌లో సర్వ సాధారణంగా మారాయి. అతి వేగం, గతుకులమయంగా మారిన రోడ్లు, కనీస శిక్షణ పొందని డ్రైవర్ల కారణంగా పాకిస్తాన్‌లో రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి.
    Published by:Sambasiva Reddy
    First published: