ప్రపంచ ప్రఖ్యాత కట్టడమైన దుబాయ్‌లోని (Dubai) బుర్జ్ ఖలీఫా (Burj Khalifa) ఎంత పెద్దదో తెలుసు కదా..? దానికంటే రెండితలు పెద్దదైన ఓ గ్రహశకలం జనవరి 18న భూమికి దగ్గరగా రానుంది. ఆస్టరాయిడ్ 7482 (1994 PC1) గా పిలిచే దీనిని.. "ప్రమాదకర వస్తువు"గా నాసా (NASA) వర్గీకరించింది. అయితే ఇది సురక్షితంగానే భూగ్రహాన్ని దాటి కనీసం 1.2 మిలియన్ మైళ్ల దూరం వరకు వెళుతుందని నాసా(Nasa) హామీ ఇచ్చింది. సూర్యుని చుట్టూ తిరుగుతూ భూకక్ష్య నుంచి 4.6 మిలియన్ మైళ్ల దూరంలో 140 మీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న గ్రహశకలాలను నాసా ప్రమాదకరమైనవిగా గుర్తిస్తుంది. ప్రస్తుత 1994 PC1 ఆస్టరాయిడ్ (Asteroid) 1.3au ఆస్ట్రనామికల్ యూనిట్స్(AU) కంటే దగ్గరగా ఉన్నందువల్ల, నాసా దీన్ని ఒక నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్‌గా(Near Earth Object) గుర్తించింది. ఇది భూమి, సూర్యుని మధ్య దూరం కొంచెం ఎక్కువ. ఒక au.. 93 మిలియన్ మైళ్లకు సమానం.
భూమికి ప్రమాదం తప్పదా..?
ఈ ఆస్టరాయిడ్(Asteroids) ప్రభావం భూమిపై ఉండనప్పటికీ.. ఈ తరహా గ్రహశకలాలు ప్రతి ఆరు లక్షల సంవత్సరాలకు ఒకసారి భూ గ్రహాన్ని ఢీకొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని ఖగోళ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు భూమికి సమీపంలో ఉన్న గ్రహశకలాలు, తోకచుక్కలు సూర్యుని నుంచి 195 మిలియన్ కిలోమీటర్ల పరిధిలో ఉంటాయని జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (jet propulsion laboratory) చెబుతోంది. అంటే అవి భూ కక్ష్యకు సమీపంలోనే పరిభ్రమిస్తుంటాయి. అయితే ఈ గ్రహశకలాల్లో కొన్ని మాత్రమే ప్రమాదకరమైనవి అని పేర్కొంది.
200ఏళ్ల వరకు నో ప్రాబ్లమ్..
భూమికి సమీపంలో ఉన్న 26,000 ఆస్టరాయిడ్లను నాసా ట్రాక్ చేస్తోంది. వీటిలో వెయ్యికి పైగా శకలాలు మాత్రమే ప్రమాదకరమైనవిగా పరిగణిస్తోంది. ప్రస్తుత 7482 (1994 PC1)ను ఆస్ట్రేలియాలోని సైడింగ్ స్ప్రింగ్ అబ్జర్వేటరీని ఉపయోగించి రాబర్ట్ మెక్‌నాట్ 1994 ఆగస్టు 9న తొలిసారిగా కనుగొన్నారు. వివిధ స్కాన్‌ల ప్రకారం 1974 నుంచి దీనికి సంబంధించిన డేటా అందుబాటులో ఉంది. అంటే దీని కక్ష్య 47 సంవత్సరాలకు పైగా పరిశీలనలో ఉంది.
భారత కాలమానం ప్రకారం.. జనవరి 19న తెల్లవారుజామున 3.21 గంటలకు అత్యంత ప్రమాదకరమైన ఈ గ్రహశకలం భూమిని సమీపించనుంది. 1994 PC1 సురక్షితంగా భూమిని దాటి.. కనీసం 1.2 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళుతుందని నాసా హామీ ఇస్తోంది. ఆస్టరాయిడ్-భూకక్ష్య మధ్య దూరాన్ని లెక్కించిన ఎర్త్‌స్కీ అనే ఖగోళ సంస్థ శాస్త్రవేత్తల ప్రకారం.. వచ్చే 200 సంవత్సరాల వరకు ఈ గ్రహశకలంతో భూమికి ఎటువంటి ఇబ్బంది లేదు.
ఇటీవలే నాసా ఓ అంతరిక్ష నౌకను ప్రయోగించి ఆస్టరాయిడ్లు భూమిని నాశనం చేయకుండా.. భారీ అంతరిక్ష శిలలు భూమిపై పడిపోకుండా వాటిని రోదసిలోనే పేల్చేసేందుకు ఓ ప్రయోగాత్మక ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ఏడాది చివరినాటికి భూమికి 11 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ భారీ గ్రహశకలాన్ని ఢీకొంట్టించేదుకు ప్రయోగాలు పూర్తయ్యే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.