అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటున్న భారతీయుల (Indians)పై వివక్షపూరిత వ్యాఖ్యల కేసులు ప్రస్తుతం పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు వ్యక్తులతో పాటు భారతీయులు ఆరాధించే ఆలయాలపై కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు కొందరు అతివాదులు. తాజాగా కెనడా (Canada), టొరంటోలోని బీఏపీఎస్ స్వామినారాయణ మందిరం (BAPS Swaminarayan Mandir) గోడలపై గుర్తు తెలియని వ్యక్తులు పెయింట్‌తో రాసిన (గ్రాఫిటీ- Graffiti) నినాదాలు దుమారం రేపుతున్నాయి. భారతదేశానికి వ్యతిరేకంగా మందిరం గోడలపై నినాదాలు రాయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో నిందితులపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం కెనడాను కోరింది. ఘటనకు సంబంధించి వివిధ వర్గాలు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
* ఖండించిన భారత ప్రభుత్వం
టొరంటోలోని బీఏపీఎస్ స్వామినారాయణ మందిరం గోడలపై ఇండియా వ్యతిరేక నినాదాలకు సంబంధించి గ్రాఫిటీని గురువారం భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని కెనడా అధికారులను కోరింది. ఈ ఘటనకు సంబంధించి ఒట్టావాలోని భారత హైకమిషన్ ఒక ట్వీట్ చేసింది. నేరస్థులపై సత్వర చర్యలు తీసుకోవాలని అందులో అధికారులను కోరింది.
ఈ ఘటనను పలువురు కెనడా ఎంపీలు, హిందువులు ఖండించిన తర్వాత హైకమిషన్ ట్వీట్ పోస్ట్ చేయడం గమనార్హం. ‘భారతదేశానికి వ్యతిరేకమైన నినాదాల గ్రాఫిటీతో టొరంటోలోని బీఏపీఎస్ స్వామినారాయణ ఆలయాన్ని పాడు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై సత్వర చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను కోరా’మని భారత హైకమిషన్ ట్వీట్‌లో పేర్కొంది.
* కెనడియన్ హిందూ దేవాలయాలు లక్ష్యం
ఇది కేవలం ఒక సంఘటన కాదు. కెనడియన్ హిందూ దేవాలయాలు ఇటీవలి కాలంలో ఈ రకమైన విద్వేషపూరిత నేరాలకు లక్ష్యంగా మారుతున్నాయి. దీంతో హిందూ కెనడియన్లు ఆందోళన చెందుతున్నారు. గ్రాఫిటీకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇక్కడ గోడలపై "ఖలిస్తాన్ జిందాబాద్" అనే పదాలు పెయింట్‌తో రాశారు. అయితే వైరల్ అవుతున్న వీడియో నిజమైనదేనా? నకిలీదా? అనేది స్పష్టం కాలేదు.
ఇది కూడా చదవండి :ఇక టోల్ ప్లాజాలు ఉండవు.. సరికొత్త విధానానికి సిద్ధమవుతున్న కేంద్రం!
* ఖలిస్తానీ తీవ్రవాదుల చర్య?
ఈ విధ్వంసానికి కెనడా ఖలిస్తానీ తీవ్రవాదులు కారణమని ఆరోపించారు భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య. ఇది ఒక్కసారిగా జరిగిన సంఘటన కాదన్నారు. టొరంటో బీఏపీఎస్ శ్రీ స్వామినారాయణ మందిరంలో కెనడియన్ ఖలిస్తానీ తీవ్రవాదులు విధ్వంసం చేయడాన్ని అందరూ ఖండించాలని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
* ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రముఖులు
బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ కూడా సోషల్ మీడియా ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. టొరంటోలోని స్వామి నారాయణ మందిరంలో జరిగిన విధ్వంసం గురించి విని చాలా నిరాశ చెందినట్లు పేర్కొన్నారు. ఈ రకమైన ద్వేషానికి GTA లేదా కెనడాలో స్థానం లేదని, బాధ్యులను త్వరగా శిక్షించాలని ఆశిద్దామని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.