కాబూల్: ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలైన కొద్ది రోజులకే ఆ దేశంలో దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆప్ఘన్‌లో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిన ప్రస్తుత తరుణంలో నిధుల కొరత, ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో అక్కడి ప్రజల్లో చాలామంది నిత్యావసరాలను కొనుగోలు చేసే పరిస్థితి లేక అల్లాడిపోతున్నారు. తినడానికి తిండి లేక, ఆహారాన్ని కొనుగోలు చేసే స్థోమత లేక ఆకలితో అలమటిస్తున్న వారి సంఖ్య ఆందోళనకు గురిచేస్తోంది.
కెనడాకు చెందిన ఇంటర్నేషనల్ ఫోరమ్ ఫర్ రైట్స్ అండ్ సెక్యురిటీ (IFFRAS) చెబుతున్న ప్రకారం.. ఆప్ఘనిస్తాన్‌లో ప్రస్తుతం 95 శాతం మంది ప్రజలకు సరిపడా తిండి లేదు. దాదాపు.. ఆప్ఘన్ జనాభాలో సగానికి పైగా ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగించే మార్చి 2022 నాటికి ఆప్ఘనిస్తాన్‌లో ఇద్దరిలో ఒకరు ఆహార లేమితో బాధపడక తప్పదని IFFRAS తెలిపింది.
ఆప్ఘన్‌లో ఈ పరిస్థితిపై ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(FAO) డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తక్షణమే స్పందించాల్సిన సమయమని, ఈ శీతాకాలం ముగిసే సమయానికి ఆప్ఘన్‌లో రైతులు, మహిళలు, యువత, పెద్ద వయసు వాళ్లలో చాలామంది ఆహార కొరతతో ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని.. మన కళ్ల ముందు ఆహారం దొరకక మనుషులు చనిపోయే పరిస్థితి రావడం ఏమాత్రం సరైంది కాదని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే.. ఆప్ఘన్‌లో ఓ తండ్రి చేసిన పని అక్కడి దయనీయ పరిస్థితులకు అద్దం పడుతుంది. ఆఫ్ఘనిస్తాన్‌లోని నార్త్‌వెస్ట్ ప్రావిన్స్‌లో ఉండే అబ్దుల్ అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలున్నారు. భార్య, ఇద్దరు కూతుర్లతో ఉండే పర్వానా రోజంతా పనిచేసినా ఆ వచ్చిన డబ్బుతో కుటుంబాన్నే పోషించడమే కష్టంగా మారింది. భార్యాబిడ్డలకు కడుపు నిండా తిండి పెట్టలేని పరిస్థితి. దీంతో.. అబ్దుల్ నిర్వేదంతో, నిస్తేజంగా ఏ తండ్రీ తీసుకోని నిర్ణయం తీసుకున్నాడు. కొన్ని నెలల క్రితం 12 ఏళ్ల కూతురిని ఓ వ్యక్తికి అమ్మేశాడు. ఆ వచ్చిన డబ్బుతో భార్య, మరో కూతురి కడుపు నింపాడు.
తాలిబన్ల పాలనలో అబ్దుల్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. పని దొరకడమే కష్టంగా మారింది. జీవితమే దినదిన గండంగా మారింది. కుటుంబాన్ని పోషించడం తన వల్ల కావడం లేదు. ఇక.. చేసేదేమీ లేక ఆహారాన్ని కొనుక్కునేందుకు డబ్బు కోసం 55 ఏళ్ల వృద్ధుడికి 2,200 డాలర్లకు రెండో కూతురిని విక్రయించాడు. ఈ నిర్ణయంపై అబ్దుల్ మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కుటుంబంలో మొత్తం తన భార్య, పిల్లలు కాక ఎనిమిది మంది కుటుంబ సభ్యులం ఉన్నామని, మిగిలిన వారిని బతికించుకోవడం కోసం ఇలా కన్న కూతుర్లను అమ్మేశానని కన్నీరుమున్నీరయ్యాడు. ఈ ఒక్క ఘటనతో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన ఎంత అస్తవ్యస్తంగా సాగుతుందో, ఆ దేశ ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కుంటున్నారో తెలియజేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Hungry people, Kabul, Taliban