యూరప్ లో పరిణామాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. ఉక్రెయిన్ ను ఈజీగా లొంగదీసుకోవచ్చని భావించిన రష్యా అంచనాలు తలకిందులు కావడంతో యుద్ధం సుదీర్ఘంగా సాగుతూ మూడో నెలలోకి ప్రవేశించింది. అసలు వివాదానికి నాటో విస్తరణ కారణం కాగా, ఇప్పుడు నాటో సభ్యదేశాలైన గ్రీస్-టర్కీ మధ్య యుద్దవాతావరణం నెలకొంది. ఎయిర్‌స్పేస్ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ గ్రీస్, టర్కీలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఒకరినొకరు వెలివేసుకుంటున్నారు. ఈ పరిణామాలు ముదిరితే మరో యుద్దం తప్పదనే అంచనాలున్నాయి.
నాటో మిత్రదేశాలైన గ్రీస్, టర్కీ మధ్య ఎయిర్‌స్పేస్ ఉల్లంఘనల వివాదం ఉద్రిక్తతలకు దారి తీసింది. నాటో ఎయిర్ డ్రిల్ నుంచి టర్కీని నిషేధిస్తూ గ్రీస్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో నాటో విస్తరణకు బ్రేకులుపడినట్లయింది. మే 9న ఏథెన్స్ లో జరిగే 'టైగర్ మీట్' (నాటో ఎయిర్ డ్రిల్ కార్యక్రమం)లోనూ టర్కీ పాల్గొనకుండా గ్రీస్ అడ్డుకుంది. ఇంతటితో కథ ముగియలేదు..
టర్కీ ఇక ఏమాత్రమూ మిత్రదేశం కాదంటూ గ్రీస్ సంచలన ప్రకటన చేసింది. మే నెలలో జరగాల్సిన గ్రీక్, టర్కీ దౌత్యవేత్తల మధ్య చర్చలను కూడా నిలిపేసింది. టర్కీ ఎయిర్ ఫోర్స్ యుద్ద విమానాలు డాగ్ ఫైట్ నిర్వహించాయని గ్రీస్ ఆరోపిస్తుండగా, ఆపని చేసింది గ్రీస్ యుద్ధవిమానాలే అని టర్కీ ప్రత్యారోపణ చేస్తున్నది. తాజా వివాదానికి ఈ వాదనలే కారణం. టర్కీ ఆర్మ్డ్ జెట్‌లు ఇటీవల గ్రీక్ గగనతలంలోకి ప్రవేశించాయని, 24 గంటల్లో అనుమతి లేకుండా 125 యుద్ధ విమానాలు దూసుకొచ్చాయని, హాలిడే దీవులపై టర్కీ విమానాలు చక్కర్లు కొడుతూ వైమానిక డాగ్‌ఫైట్‌లను నిర్వహించాయని గ్రీస్ ఆరోపిస్తోంది. నాటో మిత్రదేశాల మధ్య ఈ రకమైన ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని గ్రీస్ మండిపడింది. కాగా,
గ్రీస్ ఆరోపణలను తోసిపుచ్చిన టర్కీ.. అసలు ఉల్లంఘనలకు పాల్పడిందే గ్రీస్ అని ప్రత్యారోపణ చేసింది. ఉద్రిక్తతలను ప్రేరేపించడానికి గ్రీస్ ప్రయత్నిస్తోందని టర్కీ మండిపడుతోంది. గ్రీక్ వైమానిక దళం ఏప్రిల్ 26-28 తేదీలలో టర్కీ తీరాలకు సమీపంలో డాట్కా, దలామాన్, డిడిమ్ మీదుగా గగనతలాన్ని పదేపదే ఉల్లంఘించి ఉద్రిక్తతలను ప్రేరేపిస్తూ.. మరోపక్క నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్న టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
నాటో సభ్యదేశాలే అయినప్పటికీ గ్రీస్, టర్కీ మధ్య చాలా కాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. చమురు, ఖనిజాలు అధికంగా ఉండే ఏజియన్‌లో ఎయిర్, సముద్ర హక్కుల కోసం రెండు దేశాలు గొడవపడుతూనే ఉన్నాయి. ఎడారిగా ఉన్న ఏజియన్ ద్వీపం కోసం గ్రీస్-టర్కీలు 1996లో యుద్దానికి సైతం సిద్దపడ్డాయి. వివాదాస్పద దీవుల గగనతలంలో రోజువారీ ఎయిర్ ఫోర్స్ పెట్రోలింగ్, ఇంటర్‌సెప్షన్ మిషన్లు ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. ఈ వివాదాన్ని అంతర్జాతీయ కోర్టులో పరిష్కరించుకుందామని గ్రీస్ కోరుతున్నా అందుకు టర్కీ నో చెబుతోంది.
అమెరికాకు దగ్గరయ్యే వ్యూహంలో భాగంగా టర్కీ.. రష్యా- ఉక్రెయిన్ యుద్ద నివారణకు మధ్యవర్తిత్వం వహించడానికి విఫలయత్నం చేసింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఆంక్షలకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించడంతో NATO, USతో టర్కీకి సంబంధాలు క్షీణించాయి. ఇంధనం కోసం రష్యాపై ఆధార పడుతున్నందున యుద్దం విషయంలో టర్కీ తొలుత తటస్థవైఖరిని ఎంచుకుంది. కానీ
కాల క్రమంలో టర్కీ తన స్టాండ్ మార్చుకుంది. ఉక్రెయిన్‌కు కీలకమైన బైరక్టార్ డ్రోన్ ఆయుదాలను అందించింది. ఓవైపు రష్యన్ S-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసి అమెరికా ఆగ్రహానికి గురైన టర్కీ.. మారిన వ్యూహాలతో రష్యా ప్రత్యర్థి ఉక్రెయిన్ కు ఆయుధాలు అందించింది. త్వరలో అమెరికా నుంచి F-16 యుద్ధ విమానాలు కొనాలనీ టర్కీ భావిస్తోంది. మొత్తంగా టర్కీ-గ్రీస్ మధ్య నెలకొన్న యుద్ధ వాతారణం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Greece, Russia-Ukraine War, Turkey