Corona Mask: ఫేస్ మాస్క్ తయారుచేయండి... రూ.3 కోట్ల ప్రైజ్ మనీ గెలవండి

ఫేస్ మాస్క్ తయారుచేయండి... రూ.3 కోట్ల ప్రైజ్ మనీ గెలవండి (File Image)

Corona Mask: మీకు అదిరిపోయే ఫేస్ మాస్క్ చెయ్యగలం అనే కాన్ఫిడెన్స్ ఉందా... వెంటనే ఈ ఆఫర్‌కి అప్లై చేసుకోండి. ఎలా చెయ్యాలో, ఏం చెయ్యాలో పూర్తి వివరాలు మీకోసం.

 • Share this:
  Mask Innovation Challenge: ఇప్పుడు ప్రపంచం మొత్తానికీ ఏం కావాలి అనగానే... మనం మాస్క్ అని టక్కున చెప్పొచ్చు. ఆ కరోనా పుణ్యమా అని అలాంటి రోజులొచ్చాయి. హెడ్డింగ్‌లో చెప్పినట్లు ప్రైజ్ మనీ రూ.3 కోట్లు కాదు... అంతకంటే ఎక్కువ. రూ.3,66,65,000 ($500,000). జస్ట్ మాస్క్ కోసం అంతలా ప్రైజ్ మనీ ఎందుకు ఇస్తున్నారు... అనేది ఓ ప్రశ్న. మనందరం మాస్కులు పెట్టుకుంటున్నాం. కానీ మనలో ఒక్కరికి కూడా అవి నచ్చవు. ప్రతీ మాస్కూ ఏదో ఒక రకమైన అసౌకర్యం కలిగిస్తూనే ఉంటుంది. అందుకే కొంత మంది మాస్కులే పెట్టుకోవట్లేదు. కొంత మంది పెట్టుకున్నా... గడ్డం కిందే ఉంటాయవి. ఇప్పుడు అమెరికా ప్రభుత్వానికి చెందిన బయోమెడికల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అథార్టీ (BARDA)... ఈ పోటీ ప్రకటన చేసింది. మాస్క్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ (Mask Innovation Challenge) నెక్ట్స్ జనరేషన్ మాస్క్ తయారుచెయ్యమని ప్రకటించింది. విజేతకు పైన చెప్పిన బంపర్ ప్రైజ్ మనీ ఆఫర్ ప్రకటించింది.

  మాస్క్ ఎలా ఉండాలంటే:
  ఒక్క మాటలో చెప్పాలంటే... అలాంటి మాస్క్ ధరించడానికి ప్రజలు పోటీ పడాలి. అలా ఉండాలట. అమెరికాలో వ్యాధుల నియంత్రణ సంస్థ - CDC తెలుసుగా... దానికి నేషనల ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ (NIOSH) అనే సంస్థ ఒకటుంది. ఆ సంస్థతో కలిసి BARDA... ఈ ఛాలెంజ్ విసిరింది. ఇప్పుడు వాడుతున్న మాస్కుల వల్ల చాలా మంది ముక్కుద్వారా వదిలే శ్వాస... కళ్లజోడుపై వాలి... స్పెట్స్ మసకగా మారుతున్నాయి. చల్లటి వాతావరణం ఉండే అమెరికన్లకు ఇదో తలనొప్పిగా మారింది. అందుకే అక్కడైతే... "మాస్క్ వాడను ఏం చేస్తారో చేసుకోండి" అనే వారు కూడా ఉన్నారు. నో మాస్క్ ఉద్యమం కూడా అక్కడ నడుస్తోంది. అందులో వారు మాస్క్ అస్సలు వాడరు.

  మొదటి దశ పోటీ:
  ఈ కంటెస్ట్ 2 రకాలుగా ఉంటుంది. మొదటి దశలో... మాస్క్ డిజైన్‌పై దృష్టి పెడతారు. ఇందులో ఆల్రెడీ ఇప్పుడున్న మాస్కుల్లోనే మార్పులు చేసి తయారుచేయడం ఒక పద్ధతైతే... పూర్తిగా సరికొత్త టెక్నాలజీ, సరికొత్త ఉత్పత్తులతో కొత్త డిజైన్ మాస్క్ చేయడం మరో పద్ధతి. మొదటి దశలో... 10 మందిని విజేతలుగా ఎంపిక చేస్తారు. వారికి ఒక్కొక్కరికీ 10వేల డాలర్లు (రూ.7,33,300) ఇస్తారు. ఆ డబ్బుతో వారు తాము చెయ్యాలనుకున్న మాస్కును తయారుచేసి చూపిస్తారు.

  రెండో దశ పోటీ:
  రెండో దశను ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటున్నారు. ఈ దశలో... 10 కంటెస్టెంట్లు... తాము చెయ్యాలనుకుంటున్న సరికొత్త మాస్కుల డిజైన్‌ను ఊహాజనితంగా చెప్పాల్సి ఉంటుంది. ఆ మాస్కులు ఇప్పుడున్న మాస్కులలాగా అస్సలు ఉండకూడదు. తమ ఊహాజనిత మాస్కును కంటెస్టెంట్లు తయారుచేసి... టెస్టింగ్ కోసం NIOSHకి ఇవ్వొచ్చు. వీరిలో ఐదుగురిని విజేతలుగా ఎంపిక చేసి... వారికి అందరికీ కలిపి $400,000 (రూ.2,93,32,000) ప్రైజ్ మనీగా ఇస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్ని మళ్లీ త్వరలో ప్రకటిస్తామని NIOSH, BARDA తెలిపాయి.

  మాస్క్ ఎలా ఉండాలంటే:
  ఇంత భారీ ప్రైజ్ మనీ ఇస్తున్నారు కదా అని మరీ హై రేంజ్‌లో మాస్క్ ఉంటే కుదరదు. ఎందుకంటే... అసలు దాన్ని తయారుచేయాలన్న ఉద్దేశాన్ని అది నెరవేర్చాలి. అంటే ఆ మాస్క్ అందరూ పెట్టుకోవాలి. డబ్బున్నవారు, పేదవారూ అందరూ దాన్ని కొనుక్కోగలగాలి. అందరూ దాన్ని రోజువారీ వాడుకునేలా ఉండాలి. కరోనాను అది ఆపడమే కాదు... అది వచ్చాక... మన జీవితాల్లో మాస్క్ ధరించడం అనేది ఓ సాధారణ అంశంగా మారిపోవాలి. ప్రపంచంలో సగం మందికిపైగా వ్యాక్సిన్ వేసుకున్నా... మాస్క్ వాడేందుకు ప్రజలు ఇష్టపడాలి. ఇప్పుడున్న మాస్కులు ఇలాంటి అన్ని ప్రయోజనాలూ కల్పించలేకపోతున్నాయి.

  ఇది కూడా చదవండి: Eggplant: అధిక బరువుకి చెక్ పెట్టి... బాడీలో రక్తాన్ని పెంచే వంకాయలు... ఇలా తినండి

  కరోనా నివారణ సంబంధిత వస్తువుల తయారీపై అధ్యక్షుడు జో బిడెన్ (Joe Biden) ప్రభుత్వం ఎంతో ఆసక్తితో ఉంది. కానీ... సరైన మాస్క్ తయారవుతుందా... దాన్ని అందరూ ఇష్టపడతారా అంటే డౌటే. మొదటి దశ పోటీకి అప్లై చెయ్యాలి అనుకునేవారు ఏప్రిల్ 21లోగా... దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  Published by:Krishna Kumar N
  First published: