H1B Visa: హెచ్1బీ వీసా విషయంలో గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా.. ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చంటే..

ప్రతీకాత్మక చిత్రం

పాత పద్దతిలోనే లాటరీ విధానం ద్వారా హెచ్1బీ వీసాలను మంజూరు చేయాలని కొద్దిరోజుల క్రిందట జో బైడెన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడి ఆదేశాలతో అమెరికా సిటిజన్ షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) వెంటనే దీనికి సంబంధించిన చర్యలను మొదలు పెట్టింది.

  • Share this:
    హెచ్1 బీ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పాత పద్దతిలోనే లాటరీ విధానం ద్వారా హెచ్1బీ వీసాలను మంజూరు చేయాలని కొద్దిరోజుల క్రిందట జో బైడెన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడి ఆదేశాలతో అమెరికా సిటిజన్ షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) వెంటనే దీనికి సంబంధించిన చర్యలను మొదలు పెట్టింది. హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ అంటే 2021 అక్టోబర్ 1 నుంచి 2022వ సంవత్సరం సెప్టెంబర్ 31 వరకు గానూ, హెచ్1బీ వీసా దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించి అమెరికా సిటిజన్ షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఓ కీలక ప్రకటన చేసింది.

    లాటరీ ద్వారా పాత పద్ధతిలోనే హెచ్1బీ వీసాలను ఇస్తామని స్పష్టం చేసింది. మార్చి 1వ తారీఖు నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది. మార్చి 31వ తేదీన కంప్యూటర్ ఆధారిత లాటరీ ఫలితాలను వెల్లడిస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మార్చి 25 నాటికే అత్యధిక దరఖాస్తులు వస్తాయనీ, ఆ తర్వాతి నుంచి లాటరీ ప్రక్రియను మొదలు పెట్టి 31న ఫలితాలు విడుదల చేస్తామని చెప్పింది.

    కాగా, అగ్రరాజ్యం ప్రతి యేటా 65వేల హెచ్1బీ వీసాలను మాత్రమే ఇవ్వాలన్న నిబంధనను పెట్టుకున్న సంగతి తెలిసిందే. విదేశాల నుంచి హెచ్1బీ వీసాకు దరఖాస్తు చేసిన లక్షల మందిలో కేవలం 65వేల మందికి మాత్రమే ఛాన్స్ లభిస్తుంది. అంతే కాకుండా అమెరికాలో ఇప్పటికే చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో 20వేల మందికి అదనంగా హెచ్1బీ వీసాలను ప్రతి యేటా ఇవ్వనుంది. అమెరికా ఇచ్చే హెచ్1బీ వీసాల్లో అధిక శాతం వీసాలను భారతీయులే దక్కించుకుంటున్నారు. ఇదిలా ఉండగా జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన జో బైడెన్ పలు వరుస సంచలన నిర్ణయాలతో పాలనను పరుగులు తీయిస్తున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను తిరగతోడుతూ, వివాదాస్పద నిర్ణయాలను రద్దుచేస్తున్నారు.
    Published by:Hasaan Kandula
    First published: