ఇండియాపై జిహాద్ ప్రకటించండి... భారత ముస్లింలకు అల్‌ఖైదా పిలుపు...

ఇండియాపై జిహాద్ ప్రకటించండి... భారత ముస్లింలకు అల్‌ఖైదా పిలుపు... (FILE - credit- twitter - The Munsif Daily)

భారత్‌పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న అల్‌ఖైదా కొత్త టార్గెట్లు పెట్టుకుంటోందా? కరోనా కాలంలో ఏంటీ వార్నింగ్?

 • Share this:
  అల్‌ఖైదా చీఫ్ అయిమన్ అల్ జవహరి చచ్చి దాదాపు ఏడాది అయిన తర్వాత... భారత్‌కి వ్యతిరేకంగా ఉగ్రవాద దాడులు చెయ్యమని కాశ్మీర్‌లోని మిలిటెంట్లకు పిలుపిచ్చింది అల్‌ఖైదా. ఇస్లామిస్ట్ జిహాద్‌లో పాల్గొనాలని భారత ముస్లింలను అల్‌ఖైదా సోమవారం కోరింది. ముస్లింలపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధంలో భారత్ కూడా భాగమే అంటూ... యెమెన్‌లోని ప్రపంచ నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అరబ్ పెనిన్సులా (AQAP) ఓ స్టేట్ మెంట్ రిలీజ్ చేసింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కూపరేషన్ (OIC), కువైట్ ప్రభుత్వం, కొన్ని అరబ్ సంస్థలు కలిసి... ఇండియాలో ఇస్లామిస్టులకు అన్యాయం జరుగుతోందని అరోపించిన కొన్ని రోజులకే అల్‌ఖైదా ఈ స్టేట్‌మెంట్ ఇచ్చింది.

  అరబ్ దేశాల్లో భారత్‌కి వ్యతిరేక ప్రచారం జరగడానికి కారణం పాకిస్థాన్ చేస్తున్న తప్పుడు ప్రచారమే. పౌరసత్వ చట్టం (CAA), కాశ్మీర్ విభజన, కరోనా వైరస్ విషయంలో తబ్లీఘీ జమాత్ ఘటన వంటి వాటిని అడ్డం పెట్టుకొని... పాకిస్థాన్... లేనిపోని అసత్య ప్రచారాన్ని భారత్‌కి వ్యతిరేకంగా చేస్తోంది.

  CAAని వ్యతిరేకించిన AQAP (సెప్టెంబర్ 11 దాడులకు పాల్పడిన ఉగ్రవాద సంస్థ)... భారత ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా చాలా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించింది.

  ఈ ఉగ్రవాద సంస్థ మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌... పాకిస్థాన్‌లోని అబొత్తాబాద్‌లో అజ్ఞాతంలో ఉండగా... అమెరికా దళాలు కోవర్ట్ ఆపరేషన్ చేసి లేపేశాయి. ఇప్పుడదే సంస్థ భారత్‌లోని ముస్లింలంతా ఏకమై... ఆయుధాలు చేపట్టి... భారత్‌కి వ్యతిరేకంగా జిహాద్‌లో పాల్గొనాలని కోరింది. ప్రస్తుతం AQAP... యెమెన్, సౌదీ అరేబియాలో యాక్టివ్‌గా ఉంది. ఇది అల్‌ఖైదాకి చెందిన అత్యంత ప్రమాదకర యాక్టివ్ విభాగం (శాఖ లేదా branch) అని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది.

  ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడైన అల్‌ఖైదా చీఫ్ అయిమన్ అల్ జవహరి... గతేడాది ఓ విడియో మెసేజ్‌లో కాశ్మీర్‌లోని జీహాదిస్టులు... భారత్‌పై దాడులు చెయ్యాలని కోరాడు. తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందనీ, మేన్ పవర్ (శ్రామిక శక్తి) లేక... నష్టాల్లో కూరుకుపోతుందని అన్నాడు.

  తాజాగా అల్‌ఖైదా పిలుపుకి భారత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆన్సర్ ఇస్తుందన్నది తేలాల్సి ఉంది. ఇటీవల కాశ్మీర్‌లో ఉగ్రవాద చొరబాట్లు పెరుగుతున్నాయి. భారత్ కరోనాపై పోరాడుతుంటే... పాకిస్థాన్ మాత్రం... ఉగ్రవాదుల్ని భారత్‌లోకి ఎగదోస్తోందని స్వయంగా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీయే సోమవారం అన్నారు. అందువల్ల అల్‌ఖైదాకి కేంద్రం సరైన సమాధానం చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.
  Published by:Krishna Kumar N
  First published: