ఉక్రెయిన్-రష్యా యుద్దం కారణంగా ధరలు భారీగా పెరగడంతో వంట నూనెల పేరు వింటేనే జనం జంకే పరిస్థితి. వంట నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. విమానయాన రంగంలో సంచలన మలుపుగా వంట నూనెతో నడిచిన విమానం ఆకాశంలోకి ఎగిరింది. తొలి ప్రయాణం సూపర్ సక్సెస్ అయింది. విమాన ఇంధనంగా వంట నూనెను ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రయాణం విజయవంతం కావడంతో రాబోయే రోజుల్లో మిగతా విమానాల్లోనూ వంట నూనెలు నింపే దిశగా ఇండస్ట్రీవర్గాలు యోచిస్తున్నాయి. వివరాలివి..
భారీ విమానాల తయారీలో ఆరితేరిన ఎయిర్ బస్ సంస్థ వారి సూపర్ జంబో విమానం ఎయిర్‌బస్ ఏ-380 పెట్రోల్ కాకుండా పూర్తిగా వంటనూనే ఇంధనంగా తొలి ప్రయాణాన్ని విజయవంతంగా ముగించింది. ఈ విమానం గత వారం ఫ్రాన్స్‌లోని టౌలూస్ బ్లాగ్నక్ విమానాశ్రయంలో వంటనూనెతో తయారుచేసిన సస్టెయినబుల్ విమాన ఇంధనాన్ని (ఎస్ఏఎఫ్) 27 టన్నుల వరకు నింపుకుని టేకాఫ్ అయింది. మూడు గంటల ప్రయాణం తర్వాత నైస్ విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండయింది. 100 శాతం ఎస్ఏఎఫ్తో నింగిలోకి ఎగిరిన తొలి విమానంగా ఎయిర్‌బస్ ఏ-380 రికార్డులకెక్కింది.
కరోనా అనంతర కాలంలో మిగతా రంగాలకంటే విమానయాన రంగం దారుణంగా దెబ్బతిన్న దరిమిలా ఖర్చును తగ్గించుకునేందుకు ఎయిర్ లైన్స్ సంస్థలు రకరకాల ప్రయోగాలు చేపట్టాయి. సాధారణంగా విమానాల్లో వాడే ఖరీదైన వైట్ పెట్రోల్ బదులు సస్టెయినబుల్ ఎయిరోప్లేన్ ఫ్యూయల్( ఎస్ఏఎఫ్) ఇందనం తయారీకి చాలా కాలంగా ప్రయోగాలు జరుగుతున్నా, తొలిసారి విజయవంతంగా ప్రయాణం జరగడం ఇదే తొలిసారి.
మనం సాధారణంగా వాడుతున్న వంటనూనెకు కొన్నిరకాల మిశ్రమాలు కలిపి, కొంత ప్రాసెస్ చేసి జీవఇంధనంగా మార్చిన తర్వాతే విమానాల్లో వాడుతారు. జీఎఫ్ కమ్యూనికేషన్స్ సంస్థ నివేదిక ప్రకారం, తాజా నూనె కంటే చిక్కగా ఉండే వాడిన ఆలివ్, కనోలా నూనెలు దీనికి బాగా పనికొస్తాయి. వాడిన నూనెను వడబోసి అందులో ఉన్న వ్యర్థాలను తొలగించి, దాన్ని బాగా వేడి చేసిన తర్వాత ఆల్కహాల్, సోడియం క్లోరైడ్ తదితరాలను జతచేస్తారు. ఈ మిశ్రమంతో రెండు రకాల ఉత్పత్తులు అంటే మీథైల్ ఈస్టర్, గ్లిసరిన్ తయారవుతాయి. బయోడీజిల్ (జీవఇంధనం) రసాయన నామం మీథైల్ ఈస్టర్. గ్లిసరిన్ను సబ్బులతోపాటు చాలారకాల ఉత్పత్తుల తయారీకి కూడా వాడతారు.
2050 నాటికి కర్భన ఉద్గారాలను పూర్తిగా తగ్గించాలని ఏవియేషన్ పరిశ్రమ లక్ష్యంగా పెట్టుకోగా, హరిత వ్యర్థాలు,కొవ్వులతో తయారయ్యే ఈ ఎస్ఏఎఫ్ ఇంధనం దాదాపు 80 శాతం కా ర్బన్‌డయాక్సైడ్‌ను తగ్గిస్తుంది. గత ఏడాదికాలంలో ఏ380తోపాటు మూడు విమానాలు 100 శాతం వంటనూనెతో నింగిలోకి ఎగిరాయి. 2021 మార్చిలో ఏ350, అక్టోబర్‌లో ఏ319నియో విమానాలు ఇలా ఎఫ్‌ఏఎఫ్‌తో చక్కర్లు కొట్టాయి. అయితే తొలిసారి ప్రయాణికులతో వంటనూనె విమానాన్ని నడపటం ఇదే తొలిసారి.
సంప్రదాయ విమాన ఇంధనంతో పోలిస్తే ఈ హరిత జెట్ ఇంధనం ధర ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ ఇంధనాన్ని వాడితే విమాన టికెట్ల ధరలు కూడా ఎక్కువ అవుతాయని, అయితే ప్రభుత్వాలు సబ్సిడీలిచ్చి ఆదుకుంటే ధరలు పెంచాల్సిన అవసరం ఉండదని విశ్లేషకులు అంటున్నారు. 2030 నాటికి 13 హరిత విమాన ఇంధనం ప్లాంట్లను నెలకొల్పాలని యూకే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో ప్లాంట్‌కు సుమారు రూ.2,280 కోట్లు వ్యయమవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Airlines, Cooking oil, Edible Oil, Flight, Fuel prices