No trust vote on imran khan : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భవితవ్యం నేడు తేలిపోనుంది. ఇమ్రాన్ ఖాన్‌పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆదివారం ఓటింగ్ జరగనుంది. ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప ఈ పరీక్షలో ఇమ్రాన్ ఓడిపోవడం, ప్రధాని పదవి నుంచి దిగిపోవడం దాదాపు ఖాయమే. ఇమ్రాన్‌ఖాన్ సారధ్యంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీకి మద్దతిస్తున్న రెండు పార్టీలు విపక్షాల కూటమిలో చేరడంతో ఇమ్రాన్ గద్దె దిగక తప్పని పరిస్థితి. పీటీఐ.. మిత్రపక్షాలుగా ఉన్న బెలూచిస్తాన్ అవామీ పార్టీ, ముత్తాహిద ఖ్వామి మూవ్ మెంట్ (పాకిస్తాన్) పార్టీలు విపక్షాలకు మద్దతు తెలిపాయి. దీంతో ఇమ్రాన్‌ఖాన్ సర్కార్ మైనారిటీలో పడింది. 342 మంది సభ్యులున్న పాక్ లోక్ సభలో ఇమ్రాన్ కు 172 మంది మద్దతు అవసరం. తమకు 175 మంది మద్దతు ఉందని ఇప్పటికే విపక్ష కూటమి ప్రకటించింది.
కాగా,గతంలో రెండు సార్లు పాకిస్తాన్ ప్రధానులపై అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టారు. కానీ అవి వీగిపోయాయి. తొలుత 1989లో బెనర్జీ భుట్టోపై అవిశ్వాస తీర్మానం పెట్టగా ఆమె 12 ఓట్ల తేడాతో నెగ్గారు. 2006లో ప్రధాని షౌకాత్ అజీజ్ కూడా అవిశ్వాస తీర్మానాన్ని ఓడించారు. విశ్వాస పరీక్షను ఎదుర్కొన్న ప్రధానుల్లో ఇమ్రాన్ ఖాన్ మూడో వ్యక్తి అవుతారు. అయితే పాకిస్తాన్ రాజకీయ చరిత్రలో ఏ ప్రధాని కూడా పూర్తి కాలం పదవిలో కొనసాగలేదు. విశ్వాస పరీక్షను ఎదుర్కొన్న ప్రధానుల్లో ఇమ్రాన్‌ఖాన్ మూడో వ్యక్తి అవుతారు. ఇమ్రాన్‌ఖాన్ కీలకమైన మిలిటరీ మద్దతు కోల్పోయారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మూడున్నర దశాబ్దాలుగా పాక్ రాజకీయ అధికారంలో ఆర్మీ కీలకంగా వ్యవహరిస్తున్నది. ఇమ్రాన్ ఖాన్ ను ప్రధాని పదవికి రాజీనామా చేయాలని పాక్ ఆర్మీ కోరినట్లు సమాచారం.
ALSO READ Covid In UK : బ్రిటన్ లో మళ్లీ కరోనా సునామీ..వారానికి దాదాపు 50 లక్షల పాజిటివ్ కేసులు
ఈ నేపథ్యంలో శనివారం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ అధికారిక టీవీ చానెల్ ద్వారా జాతినుద్దేశించి మాట్లాడారు. ఒకవేళ ఇటువంటి ఘటనలు మరే దేశంలోనైనా జరిగితే ప్రజలు వీధుల్లోకి వస్తారు.. మీ అందరికీ పిలుపునిస్తున్నా.. ఈ రోజు, రేపు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపాలని కోరుతున్నా.. జాతి ప్రయోజనాల రీత్యా మీరు మీ అంతరాత్మ ప్రబోధం మేరకు పని చేయండి అని ఇమ్రాన్ ఖాన్ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. విదేశీ కుట్రపై మౌనం తగదన్నారు. తనను ప్రధానిగా తొలగించేందుకు విదేశీ కుట్ర జరుగుతుందని మరోసారి పునరుద్ఘాటించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కుట్ర దారుల ఆటలను సాగనివ్వబోమని స్పష్టం చేశారు.
నయా పాకిస్తాన్ నినాదంతో 2018లో అధికార పీఠం ఎక్కిన ఇమ్రాన్ ఖాన్ పీటీఐ సర్కార్.. ఈ నాలుగేళ్లలో సాధించింది ఏం లేదన్నది అక్కడ ప్రజల మెదళ్లలో బలంగా పాతుకుపోయింది. అందుకే రాజకీయ సంక్షోభాన్ని పట్టించుకోకుండా తమ పనుల్లో మునిగిపోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Imran khan, Pakistan, Pakistan army