Kabul Tension: ఆఫ్ఘనిస్తాన్‌ను తమ చేతుల్లోకి తీసుకున్న తాలిబన్లు అరాచకాలు సృష్టిస్తున్నారు. పంజ్‌షీర్ ప్రాంతం మినహా ఆఫ్టనిస్తాన్‌ను(Afghanistan) అక్రమించిన తాలిబన్లు.. తాజాగా ఆ ప్రాంతాన్ని కూడా తమ గుప్పిట్లోకి తీసుకున్నట్టుగా ప్రకటించారు. అయితే పంజ్ షీర్‌లోని తిరుగుబాటు దళాలు మాత్రం ఈ వార్తలను ఖండించాయి. మరోవైపు
కాబూల్ లో తీవ్ర ఉద్రిక్త (Tension in Kabul) పరిస్థితులు నెలకొన్నాయి. విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో హక్కుల సాధనతోపాటు దేశంలో కొత్తగా కొలువుదీరనున్న తాలిబన్ల (Talibans) ప్రభుత్వంలో తమకూ భాగస్వామ్యం కల్పించాలంటూ అఫ్గాన్ మహిళలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. స్వేచ్ఛ, హక్కులను కాలరాయొద్దంటూ శనివారం వారు కాబుల్‌లో రెండో రోజు కొనసాగించిన నిరసన.. ఉద్రిక్తంగా మారింది. మహిళలంతా ప్రదర్శనగా ప్రెసిడెన్షియల్ భవనం వైపు వెళ్లేందుకు యత్నించడంతో తాలిబన్ ఫైటర్స్ వారిని అడ్డుకున్నారు.
ఈ క్రమంలో నిరసనకారులపై టియర్ గ్యాస్‌లు ప్రయోగించారు. ర్యాలీని అడ్డుకుంటున్న తీరు, ఈ క్రమంలో గాయపడ్డ ఓ మహిళకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సదరు మహిళ తలకు గాయమై, నెత్తురోడుతున్నట్లు కనిపిస్తోంది. శాంతియుతంగా మహిళలను నిరసన తెలుపుతున్నా.. తాలిబన్లు ఆవేశంతో రెచ్చిపోయినట్టు ఆ వీడియోల్లో క్లియర్ గా కనిపించింది.
ఓ వైపు నిర్బంధాలు, దాడులు కొనసాగుతున్నా ఆందోళనలు ఆగడం లేదు. తాజాగా అఫ్గాన్‌లోని హెరాత్ నగరంలో గురువారం మహిళల నిరసనలు మొదలయ్యాయి. శుక్రవారం కాబుల్‌లో స్థానిక మహిళలు గళం విప్పారు. మరోవైపు వారిపట్ల తాలిబన్లు తమ ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నారు.
హెరాత్‌లో నిరసనకారుల దగ్గర నుంచి కరపత్రాలను లాక్కొని చింపేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. తాలిబన్ల ప్రభుత్వంలో మహిళలకు చోటు దక్కకపోవచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ నిరసనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అఫ్గాన్ మహిళలకు ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పించినప్పటికీ.. వారికి కేబినెట్‌లో గానీ, ప్రభుత్వంలో, ఏ ఇతర ఉన్నత పదవుల్లో గానీ స్థానం కల్పించే అవకాశం లేదంటూ తాలిబన్ల సీనియర్ నేత మహమ్మద్ అబ్బాస్ ఇటీవల ప్రకటించారు.
మరోవైపు పంజ్ షీర్ ప్రాంతాన్ని తాలిబన్లు(Taliban) స్వాధీనం చేసుకోలేదని వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే పంజ్‌షీర్(Panjshir) స్వాధీనం చేసుకున్నామని చెబుతున్న తాలిబన్లు రెచ్చిపోయారు. దీంతో సంబరాల పేరుతో కాబూల్‌లో పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు. అయితే ఇది అమాయకులైన 17 మంది మరణాలకు కారణమైంది. ఈ మేరకు Shamshad న్యూస్ ఏజెన్సీ వివరాలను వెల్లడించింది. శుక్రవారం కాబూల్‌లో(Kabul) తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరపడం వల్ల.. 17 మంది ప్రజలు చనిపోయారు, 41 మంది గాయపడ్డారు అని పేర్కొంది. టోలో న్యూస్ (Tolo News) కూడా ఇదే రకమైన వార్తను ప్రసారం చేసింది. ఇలా ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, International news, Kabul, Taliban, World news