అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ (Kabul) రక్తసిక్తమయింది. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులతో కాబూల్ ఎయిర్ పోర్టులో నెత్తుటేరులు పారాయి. వరుస పేలుళ్లతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బాంబు పేలుళ్లలో ఇప్పటి వరకు 90 మంది మరణించారని అఫ్గానిస్తాన్ (Afghanistan)కు చెందిన మీడియా సంస్థ టోలో న్యూస్ తెలిపింది. మరో 150 మంది గాయపడ్డారని వెల్లడించింది. కాబూల్‌లో జరిగిన మారణకాండపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదుల దాడుల్లో అమెరికా సైనికులు కూడా మరణించారు. ఈ నేపథ్యంలో కాబూల్ పేలుళ్లపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) స్పందించారు. తమ సైనికుల ప్రాణాలు తీసిన వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. వారిని వేటాడి, ప్రతీకారం తీర్చుకుంటామని ఘాటుగా హెచ్చరించారు. కాబూల్ పేలుళ్లలో మరణించిన అమెరికా సైనికులను హీరోలుగా ఆయన అభివర్ణించారు. దాడికి పాల్పడింది తామేనని ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ ప్రకటించడంతో.. ఆ ఉగ్రవాద సంస్థ నాయకులను హతమార్చాలని యూఎస్ ఆర్మీని బైడెన్ ఆదేశించారు. ఆగస్టు 31 కల్లా అప్గానిస్తాన్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటామని మరోసారి స్పష్టం చేశారు జో బైడెన్.
గురువారం సాయంత్రం కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. నిమిషాల వ్యవధిలోనే రెండు వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల్లో కనీసం 90 మంది మరణించగా.. 150 మంది గాయపడ్డారు. మృతుల్లో 12 మందికి అమెరికా మెరీన్ కమాండోలు, ఒక నేవీ వైద్యుడు ఉన్నట్లు అమెరికా ప్రకటించింది. పేలుళ్ల ధాటికి చాలా మంది శరీరాలు ముక్కలు ముక్కలయ్యాయి. కాబూల్ ఎయిర్ పోర్టు వెలుపల ఎక్కడ చూసినా రక్తపు మరకలు, మాంసపు ముద్దలే కనిపించాయి. కొందరికి తీవ్ర గాయాలు కావడంతో రక్తమోడుతూ కనిపించారు. కాపాడమని హాహాకారాలు చేశారు. ఈ ఘటనతో అక్కడ భీతావహ వాతావరణ నెలకొంది. చాలా మంది ఎయిర్‌పోర్టు నుంచి పరుగులు పెట్టారు. సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లారు.
ఆప్ఘనిస్తాన్ ప్రజల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది..? ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేస్తారు..?
కాబుల్ విమానాశ్రయం వద్ద ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడబోతున్నారని బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాలు హెచ్చరించాయి. కానీ అదేమీ లేదని తాలిబన్లు చెప్పారు. కానీ కొద్ది గంటల్లోనే కాబూల్ ఎయిర్‌పోర్టులో జంట పేలుళ్లు జరిగాయి. అబే గేటు నుంచి ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లేందుకు చాలా మంది గుమిగూడిన చోట మొదట ఒక బాంబు పేలింది. ఆ తర్వాత కాసేపటికే బేరన్ హోటల్ వద్ద మరో పేలుడు సంభవించింది. తాలిబన్ల దురాక్రమణతో అఫ్గానిస్థాన్ నుంచి వెళ్లిపోయేందుకు వేలాది మంది విమానాశ్రయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. లోపలికి అనుమతించాలని అమెరికా సైనికు బలగాలను వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాబూల్ ఎయిర్ పోర్టు బయటకు వేలాది మంది స్థానికులు ఉన్నారు. వారిని టార్గెట్ చేసుకొని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడులను ఐక్యరాజ్యసమితి, అమెరికా, భారత్, ఇతర దేశాలు తీవ్రంగా ఖండించాయి. తాలిబాన్లు కూడా ఖండించారు.
Afghanistan: దేశానికి ఐటీ మంత్రి..ఇప్పుడు పిజ్జా డెలివరీ బాయ్.. జీవితం తలకిందులు.. ఎందుకిలా?
కాబూల్ ఎయిర్‌పోర్టులో దాడులకు తామే పాల్పడ్డామని ఐసిస్-కే ప్రకటించిన విషయం తెలిసిందే. ISIS-K అంటే ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్. ఇస్లామిక్ స్టేట్ (ISIS)కి ఇది స్థానిక అనుబంధ సంస్థ. అప్గానిస్తాన్, పాకిస్తాన్‌లో ఐసిస్-కే యాక్టివ్‌గా ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఉగ్రవాద సంస్థకు చెందిన అగ్రనేతలను మట్టుబెట్టాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ దేశ సైన్యాన్ని ఆదేశించారు. ఉగ్ర దాడుల్లో అమెరికా సైనికులు కూడా మరణిచడంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, America, ISIS, Joe Biden, Kabul, Kabul blast, Taliban, USA