అఫ్గానిస్తాన్ కొత్త పీఎం హసన్, డిప్యూటీ పీఎం బరాదర్ ఎవరు? వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Mohammad Hasan Akhund

అఫ్గానిస్తాన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన తాలిబన్లు.. ప్రభుత్వానికి ముల్లా మహమ్మద్ హసన్ అఖుండ్‌ నేతృత్వం వహించనున్నట్టుగా వెల్లడించారు.

  • Share this:
    అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం కొలువుతీరనుంది. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన తాలిబన్లు.. ప్రభుత్వానికి ముల్లా మహమ్మద్ హసన్ అఖుండ్‌ (Mullah Muhammad Hassan Akhund) నేతృత్వం వహించనున్నట్టుగా వెల్లడించారు. దేశ ఉప ప్రధానిగా అబ్దుల్​ ఘనీ బరాదర్‌ను(Abdul Ghani Baradar) నియమిస్తున్నట్టుగా తాలిబన్లు ప్రకటించారు. అలాగే పలువురితో కూడిన మంత్రివర్గం ప్రకటించారు. ఇందులో అమెరికా, దాని మిత్ర దేశాల వారిపై పోరాటం చేసిన తాలిబన్ నాయకులకు పెద్ద పీట వేశారు. అయితే అఫ్గానిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న.. ముల్లా మహమ్మద్ హసన్ అఖుండ్‌, డిప్యూటీ  పీఎం బాధ్యతలు చేపట్టనున్న అబ్దుల్​ ఘనీ బరాదర్‌.. గురించిన వివరాలు ఇలా ఉన్నాయి.

    ఎవరీ మహమ్మద్ హసన్ అఖుండ్ ?
    ముల్లా మహమ్మద్ హసన్ అఖుండ్ ప్రస్తుతం తాలిబాన్ యొక్క శక్తివంతమైన నిర్ణయాలు తీసుకునే సంస్థ, రెహబరి షురా లేదా నాయకత్వ మండలి అధిపతిగా ఉన్నట్టు ది న్యూస్‌లోని ఒక నివేదిక పేర్కొంది. రెహబరి షురా అనేది అగ్ర నాయకుడి ఆమోదానికి లోబడి గ్రూపు వ్యవహారాలన్నింటినీ నడిపే ప్రభుత్వ మంత్రివర్గం వలె పనిచేస్తుంది. హసన్ తాలిబాన్ల జన్మస్థలం కాందహార్‌కు చెందినవాడు. అతడు సాయుధ ఉద్యమ వ్యవస్థాపకుల ఒకడు. అతను రెహబరి షురా అధిపతిగా 20 సంవత్సరాలు పనిచేశాడు. అంతేకాకుండా తాలిబన్‌ అగ్రనాయకుడు ముల్లా హెబతుల్లాకు(Mullah Hebatullah) సన్నిహితంగా ఉన్నాడు. ఇక, 1996 నుండి 2001 వరకు అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి, ఉప ప్రధాన మంత్రిగా పనిచేశాడు. అయితే ప్రధానిగా హసన్ పేరును కూడా ముల్లా హెబతుల్లా‌ను ప్రతిపాదించినట్టుగా సమాచారం.

    Afghanisthan new govt: అఫ్గానిస్థాన్​లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు.. ప్రకటన చేసిన తాలిబన్లు.. కొత్త సారథి ఎవరంటే..

    ఎవరీ అబ్దుల్​ ఘనీ బరాదర్?
    అబ్దుల్ ఘనీ బరాదర్ తాలిబన్ సహా వ్యవస్థాపకుడిగా ఉన్నాడు. 1968లో ఉరుజ్గాన్ ప్రావిన్స్‌లో(Uruzgan province) జన్మించారు. అయితే అతడు పెరిగింది మాత్రం కాందహార్‌లో. చాలా మంది అఫ్గాన్ నాయకులలాగానే ఇతను కూడా 1980లలో సోవియట్ దళాలపై పోరాటం చేస్తున్న ముజాహిదీన్ దళాలలో చేరాడు. 1989లో సోవియట్ ఉపసంహరణ తరువాత.. ముజాహిదీన్ కమాండర్లు భూభాగాల నియంత్రణ కోసం పోరాడడంతో దేశం‌లో అంతర్యుద్దం పరిస్థితులు నెలకొన్నాయి.
    అంతర్గత కలహాలతో విసిగిపోయిన బరదార్ కాందహార్‌కు వెళ్లి అక్కడ ముల్లా మహమ్మద్ ఒమర్‌తో కలిసి మతపరమైన పాఠశాలను స్థాపించాడు. ఆ తర్వాత తాలిబాన్ ఉద్యమాన్ని ఏర్పాటు చేయడానికి ఒమర్‌కు సహాయం చేశాడు. ఒమర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నాడు.

    Afghanistan: అఫ్ఘాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు..ఈ ఆరు దేశాలకు ఆహ్వానం.. లిస్ట్‌లో చైనా, ఇంకా..

    అతను 1996 నుండి 2001 వరకు తాలిబాన్ పాలనలో అనేక కీలక పదవులు చేపట్టాడు. 2001లో తాలిబన్లు అధికారం కోల్పోయినప్పుడు అతడు.. రక్షణ శాఖ డిప్యూటీ మంత్రిగా ఉన్నాడు. యూఎస్ దాడుల తర్వాత అతను పాకిస్తాన్‌కు పారిపోయాడు. అయితే 2010 లో అరెస్టు అయ్యాడు. పాకిస్తాన్ అధికారులు అతనిని గొలుసులతో ఊరేగించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడ్డాయి. పాకిస్థాన్‌లోని జైలు నుంచి అక్టోబర్ 2018 లో విడుదలయ్యాడు. తర్వాత అఫ్గానిస్తాన్‌కు చేరుకున్నాడు.

    2019 నుంచి ఖతర్‌ రాజధాని దోహలోని తాలిబన్ల రాజకీయ కార్యాలయానికి నాయకత్వం వహించాడు. ఇటీవలి కాలంలో తాలిబన్ల ముఖంగా బరదార్ ఎక్కువగా కనిపించాడు. తాలిబన్ల చీఫ్ హిబతుల్లా అఖుంజాదా ఎక్కువగా బయటి ప్రపంచానికి కనిపించలేదు. దోహాలో అమెరికాతో చర్చల్లో తాలిబాన్లకు ప్రాతినిధ్యం వహించాడు. వారితో ఫిబ్రవరి 29, 2020 న ఒప్పందం కుదుర్చుకున్నాడు.
    Published by:Sumanth Kanukula
    First published: