AFGHANISTAN CRISIS TALIBAN ENTER AFGHAN CAPITAL OFFICIAL SAYS PRESIDENT ASHRAF GHANI HAS LEFT FOR TAJIKISTAN SK
Afghanistan: ఆఫ్ఘానిస్తాన్ నుంచి పారిపోయిన దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.. ఎక్కడికి వెళ్లారంటే..
అష్రఫ్ ఘనీ
Afghanistan: తాలిబన్లు కాబూల్ నగర శివార్లలోకి చేరుకోగానే.. అమెరికా అప్రమత్తమయింది. ప్రత్యేక చినూక్ హెలికాప్టర్ల ద్వారా దౌత్య కార్యాలయంలోని తమ సిబ్బందిని తరలించింది. బ్రిటన్, చెక్ రిపబ్లిక్ దేశాలు కూడా తమ సిబ్బందిని తరలించాయి.
ఆఫ్ఘానిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆదివారం కాబూల్‌ను నలువైపుల నుంచి చుట్టుముట్టారు. ఎవరూ ఊహించనంత వేగంగా వారు రాజధానిలోకి చొచ్చుకురావడంతో ఆఫ్ఘాన్ ప్రభుత్వం ఏమీ చేయలేక చేతులెత్తేసింది. తాలిబన్లు అద్యక్ష భవనం వైపు కదులుతున్నాన్న సమాచారం రావడంతో.. ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. ఘనీ కాబూల్ నుంచి నేరుగా తజికిస్తాన్‌కు వెళ్లారు. అక్కడి నుంచి వేరే దేశానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎక్కడి వెళ్తారన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. భద్రత కారణాల దృష్ట్యా అస్రఫ్ ఘనీ ఎక్కడికి వెళ్తున్నారో తాము చెప్పలేమని కాబూల్‌లోని అధ్యక్ష కార్యాలయం తెలిపింది.
ఐతే తాము కాబూల్‌లోకి పూర్తిగా వెళ్లలేదని.. నగర శివారులో వేచి చూస్తామని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ వెల్లడించారు. కాబూల్‌లో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చూసుకుంటామని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. శాంతియుతంగా అధికార మార్పిడి జరగాలనే తాము కోరుకుంటున్నామని.. అప్పటి వరకు తమ ముజాహిదీన్లు నగర శివార్లలోనే వేచి ఉంటారని పేర్కొన్నారు. అధికార మార్పిడి కోసం ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. అటు తాలిబన్లు కాబూల్‌పై ఎలాంటి దాడి చేయలేదని, అధికార మార్పు శాంతియుతంగా జరుగుతుందని అఫ్ఘాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ కూడా తెలిపింది.
తాలిబన్లు కాబూల్ నగర శివార్లలోకి చేరుకోగానే.. అమెరికా అప్రమత్తమయింది. ప్రత్యేక చినూక్ హెలికాప్టర్ల ద్వారా దౌత్య కార్యాలయంలోని తమ సిబ్బందిని తరలించింది. బ్రిటన్, చెక్ రిపబ్లిక్ దేశాలు కూడా తమ సిబ్బందిని తరలించాయి. భారత్ సైతం ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో 126 మందిని కాబూల్ నుంచి తరలించింది. ఇప్పటికే ఆ విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండయింది. మరో తాలిబన్ల ప్రతినిధి అలీ అహ్మద్ జలాలీ ఆఫ్ఘన్ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తారని పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. మరోవైపు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి అష్రఫ్ ఘనీ పాలన పగ్గాలను స్వచ్ఛందంగా అప్పజెప్పినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
కాగా, ఆఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పదవి నుంచి తప్పుకొని దేశం విడిచి వెళ్లనున్నారని రెండు మూడు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఐతే అందుకు ఇంకా సమయం ఉందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఆదివారం రోజే తాలిబన్లు కాబూల్‌ను హస్తగతం చేసుకోవడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేసి, కాబూల్ నుంచి ఆయన పారిపోయారని సమాచారం అందుతోంది. అసలు అష్రఫ్ ఘనీ ఎక్కడున్నారన్న దానిపై తాలిబన్ వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.