AFGHANISTAN CITIES KANDAHAR HERAT FALL TO TALIBAN MAY TAKE OVER KABUL SOONER THAN EXPECTED SK
Afghanistan: తాలిబన్ల చేతుల్లోకి కాందహార్ నగరం.. మిగిలింది కాబూల్ మాత్రమే.. ఆఫ్ఘాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
తాలిబన్లు (ప్రతీకాత్మక చిత్రం)
Afghanistan Crisis: దేశంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. తాలిబన్లతో అధికారం పంచుకునే ఒప్పందానికి సిద్ధమని ప్రకటించినట్లు తెలుస్తోంది. ఖతార్‌లోని ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధులు తాలిబన్ల ముందు ఈ ప్రతిపాదన ఉంచినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి
ఆప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. దేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు మారణహోమాన్ని సృష్టిస్తున్నారు. ఆప్ఘానిస్తాన్ నుంచి అమెరికా బలగాల ప్రారంభమైన తర్వాత వీరి అరాచకాలకు అడ్డే లేకుండా పోయింది. సాధారణ ప్రజలను చంపుతూ.. భద్రతా దళాలపై దాడులకు తెగబడుతూ.. అధికార దాహంతో నెత్తుటేరులు పారిస్తున్నారు. ఇప్పటికే మూడింట రెండొంతుల ఆఫ్ఘాన్ భూభాగాన్ని ఆక్రమించిన తాలిబన్లు.. రాజధాని కాబూల్‌ను వశం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాలను ఆఫ్ఘాన్ ప్రభుత్వం కోల్పోయింది. ఉత్తర, పశ్చిమ ప్రాంతం మొత్తం తాలిబన్ల చేతుల్లోనే ఉంది. తాజాగా దేశంలోనే రెండో అతి పెద్ద నగరం కాందహార్‌తో పాటు హెరాత్‌ను కూడా తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు.
కాందహార్‌లోని మార్టిర్ స్క్వేర్ వరకు ముజాహిదీన్లు చేరుకున్నారని తాలిబన్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. తాలిబన్ల రాకతో కాందహార్ నుంచి ఆఫ్ఘానిస్తాన్ భద్రత దళాలు వెనక్కి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం చేతిలో ఉన్న ఏకైక పెద్ద నగరం ఆ దేశ రాజధాని కాబూల్ మాత్రమే. కాబూల్‌ను స్వాధీనం చేసుకుంటే దాదాపు ఆప్ఘానిస్తాన్ మొత్తాన్ని తాలిబన్లు తమ గుప్పిట్లో పెట్టుకున్నట్లే భావించవచ్చు. అనుకున్న దాని కంటే తక్కువ సమయంలోనే కాబూల్‌ను కూడా హస్తగతం చేసుకునే అవకాశముందని తాజా పరిస్థితులను చూస్తుంటే అర్థమవుతోంది.
ఐతే దేశంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. తాలిబన్లతో అధికారం పంచుకునే ఒప్పందానికి సిద్ధమని ప్రకటించినట్లు తెలుస్తోంది. ఖతార్‌లోని ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధులు తాలిబన్ల ముందు ఈ ప్రతిపాదన ఉంచినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దేశంలో శాంతిని నెలకొల్పే ఉద్దేశంతో మధ్యవర్తిగా ఉన్న ఖతార్‌కు ఈ విషయన్ని చెప్పినట్లు తెలిసింది. దీనిపై తాలిబన్లు ఎలా స్పందిస్తారన్నది తెలియాల్సి ఉంది. ప్రభుత్వం తమతో సంధికి వచ్చినా రాకున్నా.. వారు మాత్రం అధికారమే లక్ష్యంగా అన్ని ప్రాంతాలను ఆక్రమిస్తున్నారు. ఎవరైనా ప్రజలు వ్యతిరేకిస్తే వారిని కిరాతకంగా హత్యలు చేస్తున్నారు.
మరోవైపు ఆఫ్ఘానిస్తాన్‌లో ఉన్న తమ పౌరులను అన్ని దేశాలను వెనక్కి రప్పిస్తున్నాయి. ఆఫ్ఘాన్‌లో ఉన్న భారతీయులంతా వీలైనంత త్వరగా తిరిగి వెనక్కి రావాలని భారత్ ప్రభుత్వం ఇప్పటికే మూడు సార్లు అడ్వైజరీ జారీచేసింది. తాజాగా నాలుగో అడ్వైజరీని కూడా జారీచేసింది. ఆప్ఘానిస్తాన్‌లో ఇప్పటికీ 1,500 మంది భారతీయుులు ఉన్నారని సమాచారం. వారిని వెనక్కి రప్పించేందుకు విదేశాంగశాఖ చర్యలు చేపట్టింది. ఆప్ఘానిస్తాన్‌లో హింస నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రముఖ నగరాలకు విమాన రాకపోకలు నిలిచిపోయాయి. విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోకముందే అందరూ స్వదేశాలు చేరుకోవాలని భారత్‌తో పాటు యూకే, అమెరికా, జర్మనీ తమ పౌరులకు విజ్ఞప్తి చేస్తోంది. ఇక ఆఫ్ఘనిస్తాన్‌లో ఇంత జరుగుతున్నా అమెరికా మాత్రం తమ నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు. ఈ నెలాఖరు నాటికి అమెరికా బలగాలను పూర్తి స్థాయిలో ఉపసంహరించుకుంటామని.. సేనలన్నీ తిరిగి అమెరికా చేరుకుంటాయని బైడెన్ ప్రభుత్వం వెల్లడించింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.