Shabnam Dawran: తాలిబన్ల అరాచకం.. మహిళా న్యూస్ యాంకర్‌కు చేదు అనుభవం.. వీడియో‌లో ఆవేదన

షబ్నమ్ ఖాన్ దవ్రాన్‌ (Image-Twitter)

Afghanistan News: తాలిబన్లు అక్రమణ తర్వాత అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అక్కడి ప్రజల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

  • Share this:
    తాలిబన్లు అక్రమణ తర్వాత అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అక్కడి ప్రజల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మహిళ భద్రత, హక్కులు ప్రశ్నార్థకంగా మారనున్నాయనే కథనాలు వెలువడుతున్నాయి. అయితే అఫ్గాన్‌ను అక్రమించిన తాలిబన్లు మాత్రం శాంతి మంత్రం జపించారు. అందరికీ క్షమాభిక్ష ప్రకటిస్తున్నామని.. పూర్తి విశ్వాసంతో జీవనం కొనసాగించవచ్చనే భరోసా కల్పించారు. మహిళలకు హక్కులు కల్పించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. అయితే తాలిబన్లు ప్రకటనలకు.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. మహిళల విషయంలో తాలిబన్ల వైఖరి స్పష్టం చేసేలా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అఫ్గాన్‌కు చెందిన ఓ మహిళా న్యూస్ యాంకర్ వీడియో ద్వారా వెల్లడించింది.

    వివరాలు.. అఫ్గానిస్తాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆర్టీఏ టీవీ ఛానెల్‌లో షబ్నమ్ ఖాన్ దవ్రాన్‌ అనే మహిళా జర్నలిస్ట్‌ పనిచేస్తున్నారు. ఆరేళ్లుగా ఆమె ఆర్టీఏ బ్రాడ్‌కస్టర్ కోసం వర్క్ చేస్తున్నారు. అయితే ఇటీవల తాను పనిచేసే ఆఫీస్‌కు వెళ్లగా.. సిబ్బంది తనను లోనికి అనుమతించలేదంటూ షబ్నమ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీస్‌లోనికి పురుష ఉద్యోగులను అనుమతించారు.. నేను నా ఆఫీస్ కార్డు చూపించిన లోనికి వెళ్లనివ్వలేదని ఆమె తెలిపారు. తాలిబన్లు ఆఫ్గన్‌ను ఆక్రమించుకోవడంతో వ్యవస్థ మారిపోయిందని.. అందుకే తనను లోనికి అనమతించలేడిన అక్కడి వారు ఆమెతో చెప్పినట్టుగా పేర్కొన్నారు.

    ‘నా మాటలు వింటున్నవారు.. ఒకవేళ ప్రపంచం నా మాటలు వింటుంటే.. మా ప్రాణాలకు ముప్పు ఉంది.. దయచేసి మాకు సహాయం చేయండి’ అని షబ్నమ్ వీడియో‌ ద్వారా కోరారు. ఇదే విషయాన్ని.. అఫ్గాన్‌కు చెందిన Tolo News ఎడిటర్ మిరాకా పోపాల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘TOLO news లో నా మాజీ సహోద్యోగి, ప్రభుత్వ యాజమాన్యంలోని ఆర్టీఏలో పనిచేస్తున్న షబ్నమ్ దావ్రాన్ ఈ రోజు విధులకు హాజరు కావడానికి తాలిబాన్లు అనుమతించలేదు" అని పోపాల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.





    ఇక, తాలిబన్ల పాలన అంటేనే అఫ్గానిస్తాన్‌లోని చాలా మంది ప్రజలు భయంతో వణికిపోతున్నారు. చాలా మంది దేశాన్ని విడిచి వెళ్లాలనే కోరికతో ఉన్నారు. తాలిబన్లు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ.. వారి పాలన గురించి తమకు తెలసునని అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఈ క్రమంలోనే తాలిబన్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రజలు నిరసనబాట పట్టారు. తాలిబన్‌ జెండాను దించేసి, జాతీయ పతాకాన్ని ఎగరేశారు.
    Published by:Sumanth Kanukula
    First published: