గల్ఫ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)పై ఇరాన్ ప్రేరిత హౌతీ తిరుగుబాటుదారులు భయానక దాడులు జరిపారు. యూఏఈ రాజధాని అబుదాబి నగరంలోని అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును లక్ష్యంగా చేసుకుని సోమవారం డ్రోన్లతో దాడికి తెగబడ్డారు. ఈ దాడుల్లో భారతీయ కార్మికులు ఇద్దరు దుర్మరణం చెందారు. మరో పాకిస్తాన్ జాతీయుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడ్డ మరో ఆరుగురిని ఆస్పత్రులకు తరలించారు. వలస కార్మికులు ఎక్కువగా ఉండే యూఏఈలో డ్రోన్ల దాడి వార్త భారత్ తోపాటు ప్రపంచ దేశాల్లోనూ కలకలం రేపింది..
యూఏఈ రాజధాని అబుదాబీపై సోమవారం జరిగిన దాడుల్లో అబుదాబీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి సమీపంలో మూడు అయిల్ ట్యాంకర్లు పేలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అబుదాబి విమానాశ్రయంలోని ఓ నిర్మాణ స్థలంలో మంటలు చెలరేగాయని, ఏడీఎన్ఓసీ సంస్థకు చెందిన చమురు నిల్వలు ఉన్న పారిశ్రామిక ప్రాంతం ముసఫాలో మూడు ఇంధన ట్యాంకర్ ట్రక్కులు పేలిపోయాయని పోలీసులు తెలిపారు.
అబుదాబి ఎయిర్ పోర్టును పేల్చడమే లక్ష్యంగా సాగినట్లు భావిస్తోన్న ఈ డ్రోన్ దాడుల్లో ఇద్దరు భారతీయులు, ఓ పాకిస్తాన్ వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గడిచిన రెండేళ్లుగా యూఏఈ, యెమన్ లోని హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. అయితే, అంతర్జాతీయ రాకపోకలు జరిగే విమానాశ్రయంలో, అందునా విదేశీయులు మృతి చెందిన ఘటన ఇటీవల కాలంలో ఇదే తొలిసారి.
2019 సెప్టెంబర్ లో సౌదీ అరేబియాలోని రెండు కీలక చమురు స్థావరాలపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు దాడులు నిర్వహించారు.. ఈ దాడుల ఫలితంగా పెర్షియన్ గల్ఫ్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి. తాజాగా యూఏఈ రాజధాని నగరాన్నే హౌతీలు టార్గెట్ చేయడం గమనార్హం. భారతీయుల మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.