సాధారణ జలుబు వంటి లక్షణాలను కలిగించే సాధారణ వైరస్ కారణంగా 2019లో ప్రపంచవ్యాప్తంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న లక్ష మందికి పైగా పిల్లలు మృత్యువాతపడ్డారని ది లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన కొత్త అధ్యయనం పేర్కొంది. అధ్యయనంలో మొదట శిశువుల్లో రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్(RSV-Respiratory Syncytial Virus ) భారాన్ని పరిశీలించారు. 2019లో ఆరు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న 45,000 మంది శిశువులు దీని ద్వారా మరణించారని నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న ఐదు RSV కేసులలో ఒకరు ఆరు నెలలలోపు పిల్లలు ఉన్నారు.
UKలోని ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధన సహ రచయిత హరీష్ నాయర్ మాట్లాడుతూ..‘చిన్న పిల్లలలో తీవ్రమైన లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్కు RSV ప్రధాన కారణం. ఆరు నెలలు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకంగా కోవిడ్-19 పరిమితులు ప్రపంచవ్యాప్తంగా సడలిస్తున్నారు. గత 2 సంవత్సరాలలో జన్మించిన చాలా మంది చిన్నపిల్లలు ఎప్పుడూ RSVకి గురికాలేదు (అందువల్ల ఈ వైరస్ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి లేదు).’ అని చెప్పారు.
* 28 రోజుల నుంచి ఆరు నెలలలోపు పిల్లలో అత్యధిక మరణాలు
RSV వ్యాక్సిన్ అభ్యర్థులను పరిశీలించడం ద్వారా ఏ వయసు వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనే అంశాలను పరిశోధకులు గుర్తించారు. అందులో గర్భిణులు ఉన్నారు. వారికి ప్రాధాన్యం ఇవ్వడంతో చిన్న వయసులో ఉన్న పిల్లలకు రక్షణ కల్పించవచ్చు. 2015 నుంచి ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో RSV వార్షిక కేసుల సంఖ్య 33.1 మిలియన్లుగా ఉంది. దీని ఫలితంగా మొత్తం 118,200 మరణాలు సంభవించాయని పరిశోధకులు తెలిపారు.
అయితే 2019 సంవత్సరానికి సంబంధించిన అధ్యయనంలో ప్రపంచ, ప్రాంతీయ, జాతీయ స్థాయిలలో RSV మరణాలకు సంబంధించి వందకు పైగా కొత్త అధ్యయనాల వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు. 28 రోజుల నుండి ఆరు నెలల వయస్సు వరకు ఉన్న శిశువుల్లో అత్యధిక RSV మరణాల రేటు ఉంది. పరిశోధకుల ప్రకారం ఆరు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు, 2019లో ప్రపంచవ్యాప్తంగా 6.6 మిలియన్ ఆర్ఎస్వి-అనుబంధ అక్యూట్ లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కేసులు ఉన్నాయి.
* మొత్తం మరణాలలో 2.1 శాతం..
ఈ వయస్సు పరిధిలో 1.4 మిలియన్ల మంది ఆసుపత్రిలో చేరారు, 13,300 మంది ఆసుపత్రిలో మరణించగా, మొత్తంగా 45,700 మంది ప్రాణాలు కోల్పోయారు. వార్షిక మరణాలలో 2.1 శాతం మరణాలకు ఇదే కారణం కావడం గమనార్హం. ఇది ముఖ్యంగా తక్కువ, మధ్య-ఆదాయ దేశాలలో స్పష్టంగా కనిపిస్తుంది, ఇక్కడ ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఆసుపత్రిలో మరణాల నిష్పత్తి 1.4 శాతంగా ఉంది, ఇది అధిక- ఆదాయ దేశాలలో 0.1 శాతంగా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.