శ్రీలంక (Sri lanka)లో ఆహార సంక్షోభం చుక్కలు చూపిస్తోంది. అక్కడ నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటాయి. ఒక కిలో పాల ప్యాకెట్ (milk powder packet) ధర ఏకంగా వేయి రూపాయలు దాటి రూ . 1,195కి చేరిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. శ్రీలంక పాలకుల అనాలోచిత నిర్ణయాలు ఇపుడు అక్కడి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. వస్తువుల ధరల నియంత్రణను ప్రభుత్వం (government) ఎత్తివేయడంతో సామాన్యుడు పస్తులుండే పరిస్థితి నెలకొంది. దీంతో ఆదేశంలో ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 90 శాతం పెరిగింది. ఈ మేరకు అక్కడి colomboTimes వార్తా సంస్థ తెలిపింది.
గత శుక్రవారం రూ.1,400 ఉన్న 12.5 కేజీల వంట గ్యాస్ సిలిండర్ (cylinder) ధర.. ఇప్పుడు రూ.2,657కు చేరింది. రెండు రోజుల వ్యవధిలోనే సిలిండర్ ధర అమాంతం రూ.1257 పెరిగింది. ఇక, కిలో పాల ప్యాకెట్ ధర రూ.250 నుంచి రూ.1195 కు చేరింది. ఇవేకాకుండా ఇతర నిత్యావసరాల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. గోధుమ పిండి, పంచదార, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువులు, సిమెంట్ సహా దాదాపు అన్నింటి ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
ఏడాదిగా ఇదే తంతు..
ఏడాది కాలంగా పొరుగు దేశం శ్రీలంక (srilanka)ను ఆహార, ఆర్థిక సంక్షోభం కుదిపేస్తూనే ఉంది. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఆ దేశ విదేశీ మారక ద్రవ్యం భారీగా పతనమైంది. మరోవైపు కరోనా మహమ్మారి దెబ్బకు ఎగుమతులు దెబ్బతిన్నాయి. పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. విదేశీయుల రాకపోకలు భారీగా తగ్గిపోయాయి. దీంతో భారీగా ఆదాయం పడిపోయింది. విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకునే క్రమంలో దిగుమతులపై నిషేధం విధించింది ప్రభుత్వం. అయితే, నిత్యావసర వస్తువులైన పప్పులు, పంచదార, గోధుమపిండి, కూరగాయాలు వంటి వస్తువులకు కూడా శ్రీలంక దిగుమతులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి.ఇలాంటి సమయంలో దిగుమతులపై శ్రీలంక ప్రభుత్వ నిషేధం విధించడంతో ఆ వస్తువుల డిమాండ్, సరఫరా మధ్య తీవ్ర ప్రభావం పడింది.
ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిత్యావసరాల ధరలపై నియంత్రణ విధిస్తూ అత్యవసర నిబంధనలు తీసుకొచ్చింది.
ధరలపై నియంత్రణ తీసుకురావడంతో అక్రమ నిల్వలు పెరిగి మార్కెట్‌లో వస్తువుల సరఫరా భారీగా తగ్గింది. దీంతో ఆహార కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స అధ్యక్షత అత్యవసరంగా సమావేశమైన కేంద్ర కేబినెట్.. ధరలపై నియంత్రణ ఎత్తివేయాలని నిర్ణయించింది. దీని వల్ల అక్రమ నిల్వలను బయటకు తీసుకురావొచ్చని, తద్వారా సరఫరా పెంచాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే నిత్యావసరాలపై ధరల నియంత్రణను తొలగిస్తున్నట్లు ఇటీవలె అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో మళ్లీ ధరలు కొండెక్కి కూర్చొన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Food prices, Milk price, Srilanka