Indonesia Prison: విషాదంతో మొదలైన సెప్టెంబర్ 8.. అగ్ని ప్రమాదం కారణంగా 41 మంది సజీవ దహనం

మంటలు రేగిన దృశ్యం

ఇండోనేషియాలోని బాంటెన్ ప్రావిన్స్‌లో విషాద ఘటన జరిగింది. బాంటెన్ ప్రావిన్స్‌లో ఉన్న జైలులో అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి 1 గంట నుంచి 2 గంటల మధ్యలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో జైలులో విధులు నిర్వహిస్తున్న అధికారులతో సహా మొత్తం 40 మందికి పైగా అగ్నికి ఆహుతి కావడం శోచనీయం.

  • Share this:
    జకార్తా: ఇండోనేషియాలోని బాంటెన్ ప్రావిన్స్‌లో విషాద ఘటన జరిగింది. బాంటెన్ ప్రావిన్స్‌లో ఉన్న జైలులో అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి 1 గంట నుంచి 2 గంటల మధ్యలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో జైలులో విధులు నిర్వహిస్తున్న అధికారులతో సహా మొత్తం 40 మందికి పైగా అగ్నికి ఆహుతి కావడం శోచనీయం. జైలులోని బ్లాక్- సీలో మంటలు రేగినట్లు తెలిసింది. అగ్ని ప్రమాదానికి కారణం ప్రస్తుతానికి తెలియలేదని, విచారణ జరుపుతున్నామని జైలు అధికారి ఒకరు తెలిపారు. మంటలు అలుముకున్న బ్లాక్-సీలో మొత్తం 122 మంది ఖైదీలు డ్రగ్ సంబంధిత కేసుల్లో అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు తెలిసింది.

    ఈ జైలులో మొత్తం 600 మంది ఖైదీలు ఉండగలిగేంత సామర్థ్యం ఉంది. ఈ అగ్ని ప్రమాదం గురించి తెలియగానే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో మొత్తం 41 మంది చనిపోగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మొత్తం 73 మంది ఈ ఘటనలో స్వల్పంగా గాయపడినట్లు పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

    ఇది కూడా చదవండి: Supreme Court: శస్త్ర చికిత్స చేస్తున్న సమయంలో రోగి చనిపోతే వైద్యుడి నిర్లక్ష్యం వల్లే అనలేం: సుప్రీం

    ఇదిలా ఉంటే.. ఇండోనేషియాలోని జైళ్లలో ఈ తరహా ఘటనలు సర్వ సాధారణమయ్యాయి. జైళ్లలో గొడవలు, ప్రమాదాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. జైళ్లలో పరిమితికి మించి ఖైదీలను ఉంచడం, జైళ్ల నిర్వహణకు సరిపడా నిధులు కేటాయించే పరిస్థితి లేకపోవడంతో జైళ్లలో అల్లర్లు, ప్రమాదాలు ఇండోనేషియాలో నిత్యకృత్యంగా మారాయి. డ్రగ్స్ అక్రమ దందా ఇండోనేషియాలో యదేచ్ఛగా సాగుతోంది. అక్కడ అరెస్ట్ అయ్యే నేరస్తుల్లో ఎక్కువ మంది ఈ డ్రగ్స్ ముఠాలకు సంబంధించిన వారే ఉంటారు.
    Published by:Sambasiva Reddy
    First published: