కోవిడ్-19 క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 18 నెలల జైలు శిక్ష..!

ప్రతీకాత్మక చిత్రం

వియత్నాంలో కోవిడ్-19 క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ వ్యక్తికి అక్కడి ప్రభుత్వం 18 నెలల జైలు శిక్ష విధించింది. రూల్స్ బ్రేక్ చేసి వైరస్‌ ఇతరులకు అంటించడమే కాకుండా.. యంత్రాంగానికి ఆర్థిక నష్టాన్ని కలుగజేసినందుకు శిక్ష విధించినట్లు వియత్నాం అధికారులు తెలిపారు.

 • Share this:
  వియత్నాం: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. వైరస్ తగ్గుముఖం పట్టినట్టుగా అనిపిస్తున్నప్పటికీ కొత్త వేరియంట్లు విరుచుకుపడుతున్నాయి. ఇలాంటి సమయంలో స్వీయ రక్షణ ఎంతో అవసరం. ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉండటంతో మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని.. కోవిడ్-19 నిబంధనలను పాటించాలని ప్రభుత్వాలు నెత్తీనోరూ కొట్టుకుంటున్నా కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. మాస్క్‌లు ధరించడం మానేసి యధేచ్చగా తిరుగుతున్నారు. వారు ప్రమాదంలో పడిందే కాకుండా ఇతరులనూ వైరస్‌కు బలి చేస్తున్నారు. కొన్నిసార్లు వైరస్ సోకిన వ్యక్తి కోలుకున్నా.. అతని నుంచి వైరస్ సోకిన వ్యక్తి చనిపోయిన ఘటనలూ ఈ కరోనా కాలంలో చాలానే ఉన్నాయి. అందుకే కొన్ని దేశాలు కోవిడ్-19 క్వారంటైన్ రూల్స్ అమలు విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా.. వియత్నాంలో కోవిడ్-19 క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ వ్యక్తికి అక్కడి ప్రభుత్వం 18 నెలల జైలు శిక్ష విధించింది. రూల్స్ బ్రేక్ చేసి వైరస్‌ ఇతరులకు అంటించడమే కాకుండా.. యంత్రాంగానికి ఆర్థిక నష్టాన్ని కలుగజేసినందుకు శిక్ష విధించినట్లు వియత్నాం అధికారులు తెలిపారు.

  డయో డుయి టంగ్ అనే 30 ఏళ్ల యువకుడిని నిందితుడిగా గుర్తించారు. కరోనా కట్టడి విషయంలో గానీ, ఆంక్షల అమలు విషయంలో గానీ వియత్నాం ఇతర దేశాలకు మొదటి నుంచి ఆదర్శంగా నిలుస్తోంది. విరివిగా టెస్టులు చేయడంలో గానీ.. కాంట్రాక్ట్ ట్రేసింగ్‌లో గానీ.. బోర్డర్ల వద్ద కఠిన ఆంక్షల అమలులో గానీ.. క్వారంటైన్ నిబంధనలను పక్కాగా అమలు చేయడంలో గానీ వియత్నాం ముందుంది. లావోస్ దేశం నుంచి టంగ్ ఏప్రిల్ 22న అక్రమంగా వియత్నాంలోకి ప్రవేశించాడు. 14 రోజుల క్వారంటైన్ నిబంధనలను తుంగలో తొక్కాడు. అధికారులు అతనిని గుర్తించి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

  అంతేకాదు.. వైరస్ సోకిన అతను వియత్నాంలోని పలు నగరాల్లో పర్యటించి, చాలామందిని కలిశాడు. టంగ్ చేసిన ఈ పని వల్ల యంత్రాంగానికి 3 బిలియన్ డాంగ్‌లకు పైగా నష్టం వాటిల్లిందని తెలిసింది. కరోనాపై పోరాటంలో భాగంగా వియత్నాం 21.5 ట్రిలియన్ డాంగ్‌లను( 934.34 మిలియన్ డాలర్ల) బడ్జెట్‌ నుంచి ఖర్చు చేసింది. వ్యాక్సిన్ కొనుగోలు, ఈ కరోనా మహమ్మారి వల్ల ఇబ్బంది పడుతున్న వారికి వైద్య సదుపాయాల కోసం ఖర్చు చేసింది.
  Published by:Sambasiva Reddy
  First published: