A GANG FIGHT TOOK PLACE BETWEEN INMATES IN PRISONS IN AMERICA THE RESULT WAS OFFICERS WHO IMPOSED LOCKDOWNS ON PRISONS GH VB
Gang Fight: జైళ్లలోనే ఒకరినొకరు తన్నుకున్న ఖైదీలు.. చివరకు అధికారులు ఏం చేశారో తెలుసా..
ప్రతీకాత్మక చిత్రం(Image Credit:Getty)
తాజాగా అమెరికా (America)లోని జైళ్లలో ఖైదీల మధ్య అత్యంత హింసాత్మకమైన ఓ గ్యాంగ్ ఫైట్ (gang fight) చోటు చేసుకుంది. ఈ కొట్లాటలో ఇద్దరు ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా అమెరికా (America)లోని జైళ్లలో ఖైదీల మధ్య అత్యంత హింసాత్మకమైన ఓ గ్యాంగ్ ఫైట్ (gang fight) చోటు చేసుకుంది. ఈ కొట్లాటలో ఇద్దరు ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఈ డెడ్లీ గ్యాంగ్ ఫైట్ తో అమెరికా అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఖైదీల పోట్లాట తర్వాత హింస వ్యాప్తి చెందుతుందనే ఆందోళనలతో యూఎస్ లోని మొత్తం 120 ఫెడరల్ జైళ్లలో (federal prisons) లాక్డౌన్ (lockdown) విధించారు. ఖైదీలు తమ సెల్ల నుంచి బయటికి రాకుండా సోమవారం నుంచి కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది యూఎస్ ప్రభుత్వం.
టెక్సాస్లోని బ్యూమాంట్ జైలు (Beaumont prison)లో జరిగిన ఈ గ్యాంగ్ ఫైట్ ఇతర జైళ్లలో ప్రతీకార హింసకు సంబంధించిన భయాలను రేకెత్తించింది. దీంతో సోమవారం యూఎస్ ఫెడరల్ జైలు వ్యవస్థ అంతటా అరుదైన లాక్డౌన్ విధించగా... ఇప్పుడు 1 లక్ష కంటే ఎక్కువ మంది ఖైదీలు కఠినమైన నిర్బంధంలో మగ్గిపోతున్నారు. లాక్డౌన్ ఎత్తేసే వరకు వీరు బయటనుంచి ఎలాంటి సందర్శకులను కలవడానికి వీలు లేదు. ఈ ఖైదీలు తోటి ఖైదీలను కనీసం కన్నెత్తి కూడా చూడకుండా కేవలం తమ సెల్లకు మాత్రమే పరిమితం కావాలి. బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ (BOP) ప్రకారం, యూఎస్ అంతటా 120కి పైగా జైళ్లలో ఇప్పుడు నిరవధికంగా లాక్డౌన్ విధించడం జరిగింది. బీఓపీ ప్రతినిధి ప్రకారం, పరిస్థితి మరింత ఘోరంగా మారకుండా నిరోధించేందుకు మాత్రమే ఈ తాత్కాలిక లాక్డౌన్ అమలు చేస్తున్నారు.
సోమవారం మధ్యాహ్నం, దాదాపు 1,400 మంది మగ ఖైదీలను కలిగి ఉన్న టెక్సాస్లోని బ్యూమాంట్లోని హై సెక్యూరిటీ ఫెడరల్ పెనిటెన్షియరీలో భయంకరమైన కొట్లాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ఖైదీలు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ దుర్ఘటన తర్వాత దర్యాప్తు చేయడానికి ఎఫ్బీఐని పిలిపించారు అధికారులు. ఖైదీల గ్యాంగ్స్ మధ్య పెద్ద ఘర్షణ జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఈ దెబ్బలాటలో మోస్ట్ వైలెంట్ స్ట్రీట్ గ్యాంగ్ సభ్యులు పాల్గొన్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అజ్ఞాత వ్యక్తి పేర్కొన్నారు. ఈ గ్యాంగ్ MS-13 లేదా మారా సాల్వత్రుచా అయ్యి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముఠా సభ్యులు దారుణమైన హింసాత్మక చర్యలకు పాల్పడుతుంటారు. వీరు ఎక్కువగా డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తుంటారు. డ్రగ్ ట్రాఫికింగ్ అనేది 1970లలో లాస్ ఏంజెల్స్ లో ప్రారంభమై ఇప్పుడు ఉత్తర, మధ్య అమెరికాలలోని అనేక దేశాలకు విస్తరించింది.
హత్యకు గురైన ఖైదీల్లో ఒకరిని ఆండ్రూ పినెడా (34)గా గుర్తించారు. ఇతను మెక్సికన్ మాఫియా ముఠా సభ్యుడిగా కోర్టు డాక్యుమెంట్స్ లో రికార్డయింది. హత్యకు గురైన మరో ఖైదీ పేరు గిల్లెర్మో రియోజాస్. ఇతడి వయసు 54 ఏళ్ల కాగా 38 ఏళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. వీరిద్దరూ గతంలో జైలు ఘర్షణల్లో పాల్గొన్నట్లు సమాచారం.
తాజాగా జరిగిన కొట్లాటకు ప్రతిస్పందనగా ప్రాణాంతక గ్యాంగ్ ఫైట్లు ఇతర జైళ్లలో వ్యాపించి మరింత హింసకు దారితీయవచ్చని బీఓపీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. 2021లో యూఎస్ క్యాపిటల్లో తిరుగుబాటు, కోవిడ్ కేసులు పెరగడం వంటి సందర్భాలలో మాత్రం ఈ తరహా నేషనల్ వైడ్ లాక్డౌన్లు విధించారు. మళ్లీ ఇప్పుడు దాదాపు మొత్తం జైళ్ల వ్యవస్థపై లాక్డౌన్ విధించడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.