Srilanka-China: లంకపై పెత్తనానికి చైనా కొత్త స్కెచ్.. తెరపైకి యువరాణి కథ.. ఇంతకు ఎవరీమె?

బీజింగ్‌లోని శ్రీలంక ఎంబీసీలో షూశియినే

షూశియినేను లంక యువరాణిగా పేర్కొనడాన్ని లంక ప్రజలు తప్పుబట్టుతున్నారు. శ్రీలంక అపహాస్యం చేస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈమెను అడ్డంపెట్టుకొని లంకపై పెత్తనం చేస్తే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు.

 • Share this:
  శ్రీలంకపై పెత్తానానికి చైనా కొత్త స్కెచ్ వేసిందా? అందుకే సింహళ యువరాణి కథను తెరపైకి తెచ్చిందా? ఆమె కథ వింటే అలాగే కనిపిస్తోంది. BRISL అనే సంస్థ చేసిన ఓ ట్వీట్..దాని ఆధారంగా వస్తున్న కథనాలు.. ఇప్పుడు శ్రీలంకలో ప్రకంపనలు రేపుతున్నాయి. చైనా చేపట్టిన బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్‌ (వన్ బెల్ట్ వన్ రోడ్)ను శ్రీలంక కోణంలో విశ్లేషించడంతో పాటు వార్తలను ప్రచురించే ఈ సంస్థ.. లంక యువరాణి గురించి ట్వీట్ చేసింది. ఆమె పేరు షూ శియినే (XU Shi Yin'e). మే 26న బీజింగ్‌లోని శ్రీలంక రాయబార కార్యాలయంలో జరిగిన వేసాక్ (బుద్ధ పూర్ణిమ) వేడుకలకు హాజరయ్యారు. ఐతే ఈమె చైనాలోనే పుట్టి పెరిగారు. కానీ అక్కడ శ్రీలంక యువరాణిగా చెప్పుకుంటున్నారు. ఇదే శ్రీలంక ప్రజలకు ఆగ్రహానికి కారణం. ఇప్పటికే శ్రీలంక మెల్లమెల్లగా చైనా ఆధీనంలోకి వెళ్తోంది. అక్కడ చైనీయుల సంఖ్య పెరిగిపోతోంది. దీనికి తోడు ఇప్పుడు షూశియినే వ్యవహారం బయటకు రావడంతో లంకేయులు మండిపడుతున్నారు.  అసలు షూశియినే ఎశరు? ఆమె కథేంటి?

  శ్రీలంక పురణాల ప్రకారం..15 శతాబ్దంలో ఆరో పరాక్రమ బాహు అనే రాజు కొట్టె (ప్రస్తుతం కొలంబో) ప్రాంతాన్ని పరిపాలించేవారు. ఆయన ఆస్థానానికి చెందిన ఓ యువరాజు చైనాకు వెళ్లి ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.ఆ తర్వాత అక్కడే స్థిరపడ్డారు. షూశియినే ఆయన 19వ తరానికి చెందిన వారసురాలని చైనా మీడియాతో పాటు అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. ఐతే శ్రీలంక ప్రజలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదో రకంగా చుట్టరికం కలుపుకొని.. తమపై పెత్తనం చెలాయించేందుకు చూస్తోందని సింహళ జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చైనాపై విరుచుకుపడుతున్నారు.

  1990ల్లో షూశియినే ఉదంతం తొలిసారి వెలుగులోకి వచ్చింది. అప్పట్లో క్వింగ్‌యువాన్ ప్రాంతంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టారు. ఐతే ఆ పనుల కింద క్వింగ్‌యువాన్ పర్వతంపై ఉన్న షిజియా సమాధులు ధ్వంసం అయ్యే పరిస్థితులు వచ్చాయి. వాటిని ధ్వంసం చేయకూడదని గళమెత్తారు షూశియినే.

  ఐతే చైనా వెళ్లిన యువరాజు తిరిగి ఎందుకు శ్రీలంక రాలేదన్న దానిపై భిన్న కథనాలు ఉన్నాయి. తండ్రి నుంచి కొట్టె సింహాసనాన్ని బలవంతంగా లాక్కుని సోదరులను హతమార్చిన మరో యువరాజు కారణంగానే.. ఆయన తిరిగిని లంకకు రాలేదని ఓ కథ ప్రచారంలో ఉంది. కానీ షూశియినే చెప్పేది మరోలా ఉంది. తాను ప్రేమించిన చైనా అమ్మాయిని వదిలి రాలేక.. ఆమెను పెళ్లి చేసుకొని, అక్కడే స్థిరపడిపోయారని షూశియినే చెబుతున్నారు. ఆ యువరాజు ఎవరో కాదు.. కొట్టె రాజు అలకేశ్వరుడని మరో కథ ప్రచారంలో ఉంది. అలకేశ్వరుడిని మింగ్ రాజవంశానికి చెందిన సైన్యాధికారులు బందీగా పట్టుకొని చైనాకు తీసుకెళ్లారట. కొన్నాళ్ల తర్వాత ఆయనకు మింగ్ చక్రవర్తి క్షమాభిక్ష పెట్టారట. అనంతరం శ్రీలంకకు ఆరో పరాక్రమబాహును రాజును చేశారట.

  ఇలా షూశియినేకు సంబంధించి ఎన్నో కథలు వినిపిస్తున్నాయి. చైనీస్ మీడియాలో వస్తున్న ఈ కథనాలను ధృవీకరించే వారు లేరు. ఆధారాలు కూడా లేవు. కథనాలను మాత్రం కథలు కథలుగా వినిపిస్తున్నారు. అందులో ఎంత నిజం ఉందో? ఎంత అబద్ధం ఉందో ఎవ్వరికీ తెలియదు. ఐనా షూశియినేను లంక యువరాణిగా పేర్కొనడాన్ని లంక ప్రజలు తప్పుబట్టుతున్నారు. ఆమె పేరుతో శ్రీలంకను అపహాస్యం చేస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈమెను అడ్డంపెట్టుకొని లంకపై పెత్తనం చేస్తే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు.

  కాగా, శ్రీలంకలో చైనా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే. దేశంలో మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం శ్రీలంక కూడా గత పదేళ్లలో చైనా నుంచి వేల కోట్ల రుణాలను తీసుకుంది. ఇప్పటికే శ్రీలంకలోని హంబన్‌టోటా పోర్ట్‌ను తమ నియంత్రణలోకి తీసుకుంది చైనా. అక్కడ అంతర్జాతీయ పోర్టు సిటీని నిర్మిస్తోంది. శ్రీలంక అధ్యక్షుడి అధికార నివసానికి అతి సమీపంలోనే ఇది ఉంటుంది. శ్రీలంక రాజధాని కొలంబోలో ఉన్న ఈ పోర్ట్ సిటీని.. చైనీస్ కాలనీగా అక్కడి ప్రజలు అభివర్ణిస్తారు. తమపై చైనా ఆధిపత్యం పెరుగుతోందని కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఇప్పుడు యువరాణి కథను తెరమీదకు తేవడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఐతే ఈ వ్యవహారంపై శ్రీలంక ప్రభుత్వం ఇప్పటి వరకూ స్పందించలేదు.
  Published by:Shiva Kumar Addula
  First published: