ఎల్లప్పుడూ ముఖంపై చిరునవ్వు (Smile) ఉండాలని ఎవరు కోరుకోరు! నవ్వు మాత్రమే కాదు ఏడుపు వచ్చినా, బాధ వచ్చినా మనసారా ముఖంపై ఆ భావాలను వ్యక్తీకరించగలగాలి. అప్పుడే ఇతరులకు మన భావాలు అర్థం అవుతాయి. అయితే ఆ భావాలను బయట పెట్టే సామర్థ్యం ముఖ భాగాలకు లేకపోతే అది ఒక శాపంగా భావించవచ్చు. ఇలాంటి ఒక విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది ఓ చిన్నారి (Baby). శాశ్వతమైన నవ్వుముఖంతో ఉండటమే ఈ బాలికకు పెద్ద సమస్యగా మారిపోయింది. అందరూ నోటితో చేసే పనులను ఈ పసిబిడ్డ సక్రమంగా చేయలేక చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తోంది. ఆస్ట్రేలియాలో (Australia) 'పర్మినెంట్ స్మైల్’ (Permanent Smile) అనే మెడికల్ కండిషన్‌తో పుట్టిన పాప ఇప్పుడు ఇంటర్నెట్లో చర్చనీయాంశమయింది. ఈ చిన్నారి గురించి తెలుసుకున్న నెటిజన్లు అయ్యో పాపం అని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. పాప ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి.
శిశువు కడుపులో ఉన్నప్పుడే..
అరుదైన మెడికల్ కండిషన్ (Rare medical condition)తో బాధపడుతున్న ఈ చిన్నారి పేరు ఐలా సమ్మర్ ముచ్చా (Ayla Summer Mucha). ఈ మెడికల్ కండిషన్ గురించి అవగాహన కల్పించడానికి, పెంచుకోవడానికి తల్లిదండ్రులు సోషల్ మీడియాను వేదికగా ఉపయోగిస్తున్నారు. ఐలా డిసెంబర్ 2021లో బైలేటరల్ మాక్రోస్టోమియాతో జన్మించింది. బైలేటరల్ మాక్రోస్టోమియా అంటే శిశువు కడుపులో ఉన్నప్పుడే నోటి చివర భాగాలు సరిగ్గా కలిసిపోని ఒక మెడికల్ కండిషన్ నోటి చివరి భాగాలు కట్ చేసినట్టుగా.. పెదాలు సాగి సాగిపోయినట్టుగా కనిపించడం వల్ల పాప ఎప్పుడూ నవ్వుతున్నట్టుగానే కనిపిస్తుంది.
మొదటిసారి చూసినప్పుడు..
దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన ఐలా తల్లిదండ్రులు, క్రిస్టినా వెర్చర్ (21), బ్లైజ్ ముచా (20) ఈ విషయం గురించి తెలుసుకున్నప్పుడు షాక్ అయ్యారు. "బ్లేజ్‌కి, నాకు ఈ పరిస్థితి గురించి తెలియదు. నేను మాక్రోస్టోమియాతో జన్మించిన వారిని ఎప్పుడూ కలవలేదు. మా బిడ్డకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని తెలిసినప్పుడు దిగ్భ్రాంతికి గురయ్యాను" అని చిన్నారి తల్లి వెర్చర్ మీడియాకి చెప్పుకొచ్చారు. వెర్చర్ దంపతులు తమ కుమార్తెను మొదటిసారి చూసినప్పుడు నోరు చాలా వింతగా కనిపించింది. ఆ మరుక్షణమే వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అలా ఉండటానికి కారణం ఏంటో డాక్టర్లు కూడా వెంటనే చెప్పలేకపోయారు. దీంతో వారిలో ఆందోళన మరింత ఎక్కువైంది.
వివరించడానికి డాక్టర్లకు అనేక గంటల సమయం..
ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లోని ఫ్లిండర్స్ మెడికల్ సెంటర్లోని ఈ బిడ్డ జన్మించింది. ఆ ఆసుపత్రి డాక్టర్లు ఇలాంటి కేసును ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ప్రసవానికి ముందు స్కాన్లలో కూడా ఈ పరిస్థితిని గుర్తించలేకపోయారు. ఈ కండిషన్ గురించి వివరించడానికి ఆ డాక్టర్లకు అనేక గంటల సమయం పట్టింది. ఈ సమయంలో తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. తన బిడ్డకి ఏమైందోనని వారు ఆందోళన చెందారు. "ఒక తల్లిగా నేను ఏ విషయంలో తప్పు చేశానో తెలియక చాలా బాధపడ్డాను. ప్రెగ్నెన్సీ సమయంలో అన్ని జాగ్రత్తలు పాటించాను.
బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలని ఒక తల్లి పాటించాల్సి అన్ని నియమాలను పాటించాను. చాలా జన్యు పరీక్షలు, స్కాన్లు చేయించాం. అనేక మంది వైద్యులు బిడ్డ చాలా ఆరోగ్యంగా పుడుతుందని హామీ ఇచ్చారు. కానీ అలా జరగలేదు. డాక్టర్ల ప్రకారం ఈ పరిస్థితి మేం ఎలాంటి తప్పు చేయకపోయినా వచ్చింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటి పరిస్థితి వస్తుందని డాక్టర్లు తెలిపారు" అని బిడ్డతల్లి మీడియాకి చెప్పుకొచ్చారు.
2007లో క్లెఫ్ట్ ప్యాలేట్-క్రానియోఫేషియల్ జర్నల్‌లో ఇలాంటి కేసులు కేవలం 14 మాత్రమే నమోదైనట్లు పేర్కొన్నారు. ఐలా చిరునవ్వును సరిచేయడానికి తల్లిదండ్రులు శస్త్రచికిత్స గురించి వైద్యులతో మాట్లాడుతున్నారు. మాక్రోస్టోమియా అనేది కేవలం సౌందర్య సమస్య మాత్రమే కాదు ఎందుకంటే ఐలాకి పాలు పట్టించడం అసాధ్యం. ఐలా పుట్టిన కొన్ని నెలల తర్వాత తల్లిదండ్రులు ఈ పరిస్థితి గురించి మరింత అవగాహన పెంచుకోవడానికి @cristinakylievercher అనే ఓ టిక్‌టాక్ అకౌంట్‌ను ప్రారంభించారు. ఆ సమయం నుంచి నెటిజనులు ఈ చిన్నారిపై అమితమైన ప్రేమ కురిపిస్తున్నారు. కొందరు మాత్రం ఆ చిన్నారి పరిస్థితిని చూసి జాలి పడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, Baby sister, Viral