కరోనా మహమ్మారి విషయంలో ఎంత జాగ్రత్త వహించాలో, దానిని నివారించే వ్యాక్సిన్ల విషయంలోనూ అంతే జాగ్రత్తలు అవసరం. వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేయకుండా, సరైన జాగ్రత్తలు పాటించకుండా వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే ప్రాణాంతకంగా మారే అవకాశాలుంటాయి. అందుకే వ్యాక్సిన్ పంపిణీకి ముందు అన్ని దేశాల్లో విధిగా అవసరమైన ప్రచారం, డ్రైరన్ నిర్వహించిన తర్వాతే మాస్ వ్యాక్సినేషన్ మొదలుపెడతారు. మరీ ముఖ్యంగా వ్యాక్సిన్ పొందేవారి వయసు విషయంలోనూ కచ్చితమైన నిబంధనలున్నాయి. భారత్ సహా అన్ని దేశాల్లో ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే కొవిడ్ టీకాలను అందిస్తున్నారు. 5 నుంచి 12 ఏళ్లు, 12 నుంచి 18 ఏళ్ల వయసు వారికి ఉద్దేశించిన టీకాలపై క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఐదేళ్లలోపు శిశువులు కూడా కొవిడ్ బారిన పడుతున్నప్పటికీ వారికి అందించే టీకాలపై ప్రయోగాలు ఇంకా ప్రారంభదశలోనే ఉన్నాయి. అలాంటిది దక్షిణ కోరియాలో ఓ వైద్యప్రబుద్ధుడు ఏకంగా ఏడు నెలల శిశువుకు పెద్దల కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చి తప్పిదానికి పాల్పడ్డాడు..
దక్షిణ కొరియా రాజధాని సియోల్ శివారు సియోంగ్నామ్ పట్టణానికి చెందిన దంపతులకు 7నెలల శిశువున్నాడు. చిన్నారికి కాస్త జ్వరం రావడంతో డాక్టర్ కు కబురు పెట్టారు. పనిలో పనిగా తల్లి కూడా కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోవాలనుకుంది. శిశువు కోసం ఫ్లూ షాట్, తల్లి కోసం కొవిడ్ వ్యాక్సిన్ షాట్ తీసుకుని ఆ ఇంటికి చేరిన డాక్టర్.. పొరపాటున పెద్దల మోడెర్నా కొవిడ్ వ్యాక్సిన్ ను 7నెలల శిశువుకు పొడిచాడు. తీరా ఇంజెక్ట్ చేసిన తర్వాతగానీ తాను చేసిన తప్పును గ్రహించాడా డాక్టర్. వెంటనే తల్లిదండ్రులను అప్రమత్తం చేయడంతో పరుగు పరుగున శిశువును సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. సెప్టెంబర్ 29న ఈ సంఘటన జరిగింది. విచిత్రంగా..
సాధారణంగా కొవిడ్ వ్యాక్సిన్ వికటిస్తే రక్తం గడ్డలు కట్టి వ్యక్తి చనిపోవడమో, తీవ్రమైన అలర్జీలు రావడమో జరుగుతుంది. అయితే పెద్దల వ్యాక్సిన్ తీసుకున్న ఆ శివును ఐదు రోజులపాటు అబ్జర్వేషన్ లో ఉంచగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కనిపించలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, జరిగిన విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన శిశువు తల్లిదండ్రులు.. తప్పు చేసిన డాక్టర్ పై భారీ నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తూ దావా వేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సౌత్ కొరియన్ మీడియా తాజాగా బయటపెట్టింది.
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ ఇప్పటిదాకా పసి పిల్లలకు అందుబాటులోకి రాలేదు. 2 నుంచి 5ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ ప్రయోగాలు ప్రాథమిక దశలో ఉన్నట్లు ఫైజర్ సంస్థ ఇటీవలే ప్రకటించింది. నవజాత శిశువుల విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి ప్రయోగాలు మొదలుకాలేదు. సౌత్ కొరియాలో పొరపాటు చేసిన డాక్టర్ కు భారీ జరిమాన పడే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే, ఈనెల 6న బ్రెజిల్ లోనూ ఇద్దరు నవజాత శిశువులకు ఆస్పత్రిలో నర్సులు పొరపాటున ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చారు. నాలుగు నెలల బాలుడు, రెండు నెలల పాపకు నర్సులు పొరపాటున పెద్దల కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వగా, అదృష్టవశాత్తూ పిల్లలల్లో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid vaccine, South korea