బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం (Bangladesh Train Accident) జరిగింది. అతివేగంతో వెళ్తున్న ఓ రైలు.. పట్టాలు దాటుతున్న మినీ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం చిట్టగాంగ్ (Chittagong)లోని మిర్షారాయ్ సబ్ డిస్ట్రిక్ట్‌లోని బారాటకియా రైల్వే స్టేషన్ (Bara Takia railway station) సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రైల్వే క్రాసింగ్ వద్ద ఎలాంటి కాపలా లేకపోవడం వల్లే ప్రమాదం (Chittagong Train Accident) జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
శుక్రవారం మధ్యాహ్నం ఓ పాఠశాలకు చెందిన మినీ బస్సు.. బారాటకియా రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా..మహానగర్-ప్రోవతి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. అతివేగంతో ఢీకొట్టడంతో.. మినీ బస్సు ముక్కలు ముక్కలయింది. బస్సును సుమారు 500 మీటర్ల మేర ముందుకు ఈడ్చుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 17 మంది ఉన్నారు. వీరిలో 11 మంది మరణించగా.. మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో నలుగురు టీచర్లు, ఆరుగురు విద్యార్థులు, డ్రైవర్ ఉన్నారు. వీరంతా ఛత్తోగ్రామ్‌లోని ఆర్ అండ్ జే కోచింగ్ సెంటర్‌కి చెందినవారు. ఖోయచోరా వాటర్ ఫాల్స్ టూర్‌కి వెళ్లి.. తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో అక్కడ ఎలాంటి కాపలా లేదని.. గేటు పైకి ఎత్తి ఉండడం వల్లే.. మినీ ట్రక్కు ముందుకు వెళ్లిందని.. అదే సమయంలో రైలు వచ్చి ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
బంగ్లాదేశ్‌లో ఓపెన్ రైల్వే క్రాసింగ్‌ల వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బారాటకియా స్టేషన్ సమీపంలో జరిగిన తాజా రైలు ప్రమాద ఘటనలో గేట్‌మెన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గేట్‌మెన్ సద్దాం హుస్సేన్‌పై కేసు నమోదు చేశారు. శుక్రవారం అర్థరాత్రి అతడిని అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ రైల్వేస్ 2020లో విడుదల చేసిన డేటా ప్రకారం... గత 15 సంవత్సరాలలో చట్టబద్ధమైన, చట్టవిరుద్ధమైన వివిధ లెవల్ క్రాసింగ్‌లలో జరిగిన 4,914 రైలు ప్రమాదాల్లో 400 మందికి పైగా మరణించారు. మరో 2వేల మందికి పైగా గాయపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangladesh, Train accident