హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

China Bus Accident: బస్సు బోల్తాపడి.. 27 మంది మృతి..చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం

China Bus Accident: బస్సు బోల్తాపడి.. 27 మంది మృతి..చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

China Bus Accident: ఇక్కడ గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ప్రావిన్స్ రాజధాని గుయాంగ్ నగరంలో సెప్టెంబరు మొదటి వారంలో కఠినమైన లాక్‌డౌన్ అమలు చేశారు. అలాంటి ప్రాంతంలో బస్సు యాక్సిడెంట్‌ జరగడంపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం (China Accident) జరిగింది. రూరల్ గుయిజౌ ప్రావిన్స్‌లోని ఓ ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం బస్సు బోల్తా (Bus Accident in China) పడింది. అందులో ప్రయాణిస్తున్న 27 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడినట్లు సమాచారం. గుయిజౌ ప్రావిన్స్ రాజధాని గుయాంగ్ నగరానికి ఆగ్నేయంగా ఉన్న సాండు కౌంటీలో ఆదివారం ప్రమాదం జరిగిందని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ఉన్నారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ బస్సు గుయిజౌ క్యాపిటల్ సిటీ గుయాంగ్ నుంచి లిబోకు వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు అధికారులు వెల్లడించారు.

  గ్రామీణ గుయిజౌ ప్రావిన్స్‌లో పేదలు ఎక్కువగా ఉండే.. మారుమూల, పర్వతప్రాంతం. ఇక్కడ గిరిజనులతో పాటు పలు జాతుల మైనారిటీలు ఎక్కువగా నివసిస్తారు. ఇక్కడ గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ప్రావిన్స్ రాజధాని గుయాంగ్ నగరంలో సెప్టెంబరు మొదటి వారంలో కఠినమైన లాక్‌డౌన్ అమలు చేశారు. అలాంటి ప్రాంతంలో బస్సు యాక్సిడెంట్‌ జరగడంపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా వల్ల చైనాలో కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. అర్ధరాత్రి తర్వాత 2 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్ని టోల్ ప్లాజాల కార్యకలాపాలను నిలిపివేశారు. సదూర ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు ఈ సమయంలో హైవేలపై అనుమతిలేదు. కానీ ఈ బస్సు ప్రమాదం రాత్రి 2.40 గంటలకు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఆ సమయంలో బస్సు హైవేపైకి ఎలా వచ్చిందని నెటిజన్లు వీబో సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

  చైనాలో ఇటీవల ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. జూన్‌లో గుయిజౌ ప్రావిన్స్‌లో వేగంగా వెళ్తున్న రైలు పట్టాలు తప్పిన ఘటనలో ట్రైన్ డ్రైవర్ మృతి చెందాడు. మార్చిలో చైనాలో జరిగిన విమాన ప్రమాదంలో మొత్తం 132 మంది ప్రయాణికులు మరణించారు. గత దశాబ్దం కాలంలో చైనాలో జరిగిన ఘోర విమాన ప్రమాదాల్లో ఇది ఒకటి. గత వారం చైనాలోని చాంగ్షా నగరంలో 42 అంతస్తుల భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆ వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. అగ్నిప్రమాదానికి గురైన భవనం.. చైనా టెలికమ్యూనికేషన్స్ కంపెనీకి చెందినది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగింది. 42 అంతస్తులుంటే ఈ భవనంలో పైకి నుంచి కింద వరకు మంటలు వ్యాపించాయి. ఐతే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: China, International, International news, Road accident

  ఉత్తమ కథలు